Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా హిట్ లు కానీ..చిన్న సినిమా..?

By:  Tupaki Desk   |   19 May 2022 4:30 PM GMT
పాన్ ఇండియా హిట్ లు కానీ..చిన్న సినిమా..?
X
టాలీవుడ్ ద‌శ మారింది. కోవిడ్ కోలుకోలేని దెబ్బ‌తీస్తే ఆ త‌రువాత ప‌రిస్థితులు మారిపోయాయి. ఇక్క‌డ రూపొందిన చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. దేశం మొత్తం మ‌న‌వైపే ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. మ‌న ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయా అని చూస్తున్నారు. ఈ ద‌శ‌లో ఓటీటీల‌తో పాటు థియేట‌ర్ల‌లోనూ ప్రేక్ష‌కుల సంద‌డి మొద‌లైంది. అయితే అది పెద్ద చిత్రాలకే కావ‌డం ఇప్ప‌డు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

కోవిడ్ కార‌ణంగా ప్రేక్ష‌కుల దృక్ప‌థంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ సినిమా, అది కూడా బిగ్ హిట్ చూడొచ్చులే అని తెలిస్తేనే ప్రేక్ష‌కులు థియేర్ల‌కు వ‌స్తున్నారు. లేదంటే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా స‌రే థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం పెద్ద చిత్రాల‌కు భారీగా టికెట్ రేట్లు పుంచుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డ‌మే. పెంచిన టికెట్ రేట్ల‌ని భ‌రించ‌లేని ప్రేక్ష‌కులు వారం లేదా రెండు వారాల త‌రువాత అదే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంద‌ని ఎదురుచూస్తున్నారు. ఆ కార‌ణంగానే థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చిన్న సినిమా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. పాన్ ఇండియా చిత్రాలు.. భారీ సినిమాల మ‌ధ్య చిన్న సినిమాని ప‌ట్టించుకునే నాధుడే క‌నిపించ‌డం లేదు. ఇక ఓటీటీల‌కు అల‌వాటుప‌డ్డ జ‌నం స్మాల్ మూవీస్ కోసం థియేట‌ర్ కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. టాక్ బాగుంది అన్న సినిమాల‌ని కూడా ప్రేక్ష‌కులు పెద్ద‌గా క‌నిక‌రించ‌డం లేదు. దీంతో చిన్న సినిమా ప‌రిస్థితి థియేట‌ర్ల‌కు ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో అన్న‌ట్టుగా త‌యారైంది.

ఈ ఏడాది విడుద‌లైన 'డీజే టిల్లు' త‌ప్పితే ఏ చిన్న సినిమా కూడా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆడింది లేదు. వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది లేదు. ఇదిలా వుంటే ఇటీవ‌ల త‌న సినిమా కోసం పెద్ద రిస్కే చేసిన విశ్వ‌క్ సేన్ త‌ను న‌టించిన 'అశోక వ‌నంలో అర్జున కల్యాణం' మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

కానీ వ‌సూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో ద‌క్కించుకోలేక‌పోతోంది. ఈ మూవీ అదృష్టం ఏంటంటే మంచి టాక్ వ‌చ్చిన వెంట‌నే ఈ మూవీకి ఓటీటీలో బిగ్ డీల్ ద‌క్కింది. అయితే ఇలా చిన్న చిత్రాల‌కు రిలీజ్ కి ముందు ఓటీటీ ఆఫ‌ర్లు ద‌క్క‌క‌పోగా కొన్ని సినిమాల‌కు థియేట‌ర్లే ద‌క్క‌డం లేదు.

'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' కు ఓటీటీలో బిగ్ డీల్ ద‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వుంది. కంటెంట్ బ‌లంగా వున్నా ఈ మూవీ ప్రాంక్ వీడియోతో వివాదాన్ని సృష్టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ మూవీ త‌ర‌హాలోనే చిన్న సినిమాలు కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా వున్న అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాలి. అప్ప‌డే వాటిపై ప్రేక్ష‌కుల‌తో పాటు ఓటీటీలు ప్ర‌త్యేక దృష్టిని సారిస్తున్నాయి. అలా చేయ‌లేని సినిమాల‌ని క‌నీసం సినిమాలుగా కూడా క‌న్సీడ‌ర్ చేయ‌డం లేదు.