Begin typing your search above and press return to search.

స్నేహమ్మను బన్నీ టీమ్‌ భలే చూసుకుందట

By:  Tupaki Desk   |   24 May 2015 12:15 PM GMT
స్నేహమ్మను బన్నీ టీమ్‌ భలే చూసుకుందట
X
స్వతహాగా తమిళ అమ్మాయే కానీ.. స్నేహను మనమ్మాయిలాగే ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. రాధాగోపాలం లాంటి సినిమాల్లో స్నేహను చూస్తే ఆమెలో ఎంత తెలుగుదనం ఉందో అర్థమవుతుంది. కెరీర్‌ ఆసాంతం స్నేహకు మంచి మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు తెలుగు దర్శకులు. ఐతే పెళ్లయ్యాక సినిమాలకు విరామం ఇచ్చేసిన ఈ నవ్వుల రారాణి.. ఈ మధ్య 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా చేసే సమయానికే స్నేహ ప్రెగ్నెంట్‌. సినిమా ఒప్పుకుంది కాబట్టి.. పూర్తి చేయక తప్పలేదు.

ఐతే తన పరిస్థితి తెలిసి సన్నాఫ్‌ సత్యమూర్తి టీమ్‌ తనను భలే చూసుకుందని చెబుతోంది స్నేహ. ''అల్లు అర్జున్‌ నాకోసం తరచుగా స్వీట్స్‌ తెచ్చేవాడు. రాజేంద్ర ప్రసాద్‌ గారైతే మామిడికాయతో చేసిన నాలుగు రకాల పచ్చళ్లు ఇంటి నుంచి తెచ్చారు. నిత్యా మీనన్‌, సమంత అయితే.. షూటింగ్‌ గ్యాప్‌ వచ్చిందంటే చాలు.. విశ్రాంతి తీసుకోమంటూ జాగ్రత్తలు చెప్పేవాళ్లు. మొత్తం సన్నాఫ్‌ సత్యమూర్తి టీమ్‌ అంతా నన్ను మహరాణిలా చూసుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ అనుభవాన్ని మరిచిపోలేను'' అని చెప్పింది స్నేహ. ప్రస్తుతం స్నేహకు ఏడో నెల. ఆగస్టులో డెలివరీ. భర్త ప్రసన్న తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడంటోంది స్నేహ. ఆమె పండండి బిడ్డను ప్రసవించాలని కోరుకుందాం.