Begin typing your search above and press return to search.

పిల్లలతో అందాల స్నేహ ఆనందాల సందడి!

By:  Tupaki Desk   |   13 Aug 2022 10:59 AM GMT
పిల్లలతో అందాల స్నేహ ఆనందాల సందడి!
X
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో స్నేహ ఒకరు. ముందుగా మలయాళ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైన స్నేహ, ఆ తరువాత తెలుగు తెరకి పరిచయమైంది. తెలుగు తెరకి 'ప్రియమైన నీకు' సినిమాతో పరిచయమైన స్నేహ, ఇక్కడి యూత్ మనసులను పొలోమంటూ కొల్లగొట్టేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఆమె వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్లింది. వెంకీ .. శ్రీరామదాసు .. రాధాగోపాళం వంటి విభిన్నమైన విజయాలు ఆమె ఖాతాలో కనిపిస్తాయి.

స్నేహ నవ్వుకి మనసు పారేసుకుని ప్రేక్షకులంటూ ఉండరు. సుజాత తరువాత చీరకట్టులో తెలుగు తెరకి తెలుగుదనం తీసుకొచ్చిన కథానాయికగా ఆమెకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

హీరోయిన్ గా కెరియర్ గ్రాఫ్ మంచి ఊపు మీద సాగుతున్నప్పుడే ఆమె తన తోటి నటుడైన 'ప్రసన్న'ను పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ప్రేమించుకుని .. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సినిమా పరిశ్రమకి సంబంధించిన అన్యోన్యమైన దంపతుల జాబితాలో ఈ జంట కూడా కనిపిస్తుంది. వీరి ప్రేమానురాగాలకు గుర్తుగా ఒక అమ్మాయి .. ఒక అబ్బాయి ఉన్నారు.

వివాహమైన తరువాత స్నేహ కేరక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో ఆమె తెరపై కనిపించడం లేదు. తన పిల్లల ఆలనాపాలనకి ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆమె సినిమాల సంఖ్యను తగ్గించుకున్నట్టుగా చెబుతున్నారు. పిల్లలతో కలిసి గడుపుతున్న మధురమైన క్షణాలకి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.

మొన్న గురువారం స్నేహ కొడుకు బర్త్ డే. ఆ సందర్భంగా ఆ రోజున చేసిన సందడి తాలూకు ఫొటోలను కూడా స్నేహ షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్లో పిల్లలను ఆడించడం .. వాళ్లకి కొత్త బట్టలు వేసి ముస్తాబు చేయడం వంటి పిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పద్ధతికి పట్టుచీరకట్టినట్టుగా కే అనిపించే స్నేహ మళ్లీ తెరపై కనిపించాలనేది అభిమానుల ఆకాంక్ష. మరి స్నేహ మనసులో ఏవుందో చూడాలి. ప్రసన్న మాత్రం తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.