Begin typing your search above and press return to search.

రామ్ సినిమా కోసం రంగంలోకి ఇంతమంది సెలబ్రిటీలా?!

By:  Tupaki Desk   |   6 July 2022 3:25 AM GMT
రామ్ సినిమా కోసం రంగంలోకి ఇంతమంది సెలబ్రిటీలా?!
X
రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి 'ది వారియర్' సినిమా చేశాడు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన నుంచి ఇంతవరకూ వదిలిన 'బుల్లెట్' .. 'విజిల్' సాంగ్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. అందువలన ఈ రెండు భాషల్లోను ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ రోజున చెన్నైలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. చెన్నై లోని 'సత్య సినిమాస్'లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ రోజున సాయంత్రం 6:30 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. కోలీవుడ్ నుంచి ఈ ఫంక్షన్ కి 28 మంది సెలబ్రిటీలు హాజరవుతుండటం విశేషం. ఆ సెలబ్రిటీల పేర్లను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ఆ జాబితాలో మణిరత్నం .. భారతీరాజా .. శంకర్ .. కార్తి .. విశాల్ .. ఆర్య .. గౌతమ్ మీనన్ .. ఎస్.జె.సూర్య .. లోకేశ్ కనగరాజ్ .. వెట్రి మారన్ .. కీర్తి సురేశ్ తదితరుల పేర్లు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటించడం ఇదే మొదటిసారి. అయితే ఆయనకి ఇష్టమైన మాస్ యాక్షన్ జోనర్లోనే ఈ కథ నడుస్తుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లను కలుపుకునే ఈ కథ ముందుకు వెళుతుందనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ మార్కెట్ ను కూడా పెంచుకోవాలనే ఆలోచనలో రామ్ ఉన్నాడు. కోలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆయన ఆశిస్తున్న సపోర్ట్ ఎంతవరకూ లభిస్తుందనేది చూడాలి.

ఇక వరుస సక్సెస్ లతో ముందుకు వెళుతున్న కృతి శెట్టి, ఈ సినిమాతోనే నేరుగా కోలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. కాస్త బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలకు అక్కడి ఆడియన్స్ తొందరగా కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ అక్కడ సూర్యతో ఒక సినిమా చేస్తున్న కృతి ఇకపై అక్కడ మరింత బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాలో విలన్ గా చేసిన ఆది పినిశెట్టికి తమిళనాట కూడా మంచి ఇమేజ్ ఉంది. అందువలన ఈ సినిమాను అక్కడివాళ్లు ఓన్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇక్కడ ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి.