Begin typing your search above and press return to search.

రివ్యూ: సన్నాఫ్‌ సత్యమూర్తి

By:  Tupaki Desk   |   9 April 2015 7:45 AM GMT
రివ్యూ:  సన్నాఫ్‌ సత్యమూర్తి
X
రివ్యూ: సన్నాఫ్‌ సత్యమూర్తి

రేటింగ్‌: 2.5 /5

నటీనటులు: అల్లు అర్జున్‌, ఉపేంద్ర, ప్రకాష్‌ రాజ్‌, సమంత, నిత్యామీనన్‌, ఆదా శర్మ, స్నేహ, ఆలీ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్‌, సంపత్‌, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు, పవిత్ర లోకేష్‌ తదితరులు

ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ

రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌



'అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్‌బస్టర్‌ తీసిన త్రివిక్రమ్‌.. రేసుగుర్రం లాంటి బ్లాస్టింగ్‌ హిట్టు కొట్టిన అల్లు అర్జున్‌.. వీళ్లిద్దరితో కలిసి జులాయి లాంటి హిట్టు తీసిన రాధాకృష్ణ.. ఈ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ పెద్ద సినిమా కోసం ప్రేక్షకులు ఆవురావురుమని ఎదురు చూస్తున్న టైంలో వచ్చింది సన్నాఫ్‌ సత్యమూర్తి. మరి ఈ కాంబినేషన్‌ తెరమీద మరోసారి మ్యాజిక్‌ చేసిందా.. అంచనాల్ని అందుకుందా.. చూద్దాం పదండి.



కథ:

సత్యమూర్తి (ప్రకాష్‌ రాజ్‌) అనే 300 కోట్ల అధిపతి కొడుకు విరాజ్‌ ఆనంద్‌. ఐతే యాక్సిడెంట్‌లో చనిపోయిన విరాజ్‌ తండ్రి.. అతడికి విలువల్ని మాత్రమే మిగులుస్తాడు. ఆస్తులన్నీ అప్పుల వాళ్లకు వెళ్లిపోతాయి. తల్లి, అన్నయ్య, వదినలతో కలిసి రోడ్డు మీదికి వచ్చేస్తాడు విరాజ్‌. అతడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న పల్లవి (ఆదా శర్మ) వదిలేసి వెళ్లిపోతుంది. కుటుంబాన్ని పోషించడానికి, అన్న కూతురి స్కూల్‌ ఫీజు కట్టడానికి పల్లవి పెళ్లి ఈవెంట్‌కే మేనేజర్‌గా వెళ్తాడు విరాజ్‌. అక్కడే అతడికి సమీర (సమంత) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. సమీరను తనకివ్వమని ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్‌)ను అడిగితే.. ముందు సత్యమూర్తి నుంచి తనకు రావాల్సిన స్థలాన్ని తెచ్చివ్వమంటాడు సాంబశివరావు. ఆ స్థలం దేవరాజ్‌ (ఉపేంద్ర) అనే రౌడీ కబ్జా చేసి ఉంటాడు. మరి విరాజ్‌ ఆ స్థలాన్ని దేవరాజ్‌ నుంచి విడిపించాడా? తన తండ్రి మీద ఏ మచ్చా పడకుండా చూశాడా? సమీరను దక్కించుకున్నాడా? అనేది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

కథనం, విశ్లేషణ్ణ త్రివిక్రమ్‌ తీసిన వాటిలో ఫ్లాప్‌ అనిపించుకున్న ఏకైక సినిమా ఖలేజా. కానీ ఆ ఖలేజా సినిమా కూడా టీవీలో వస్తుంటే అతుక్కుపోయి చూసేస్తుంటారు జనాలు. అందుక్కారణం.. త్రివిక్రమ్‌ మాత్రమే ఇవ్వగలిగే ఎంటర్టైన్మెంట్‌. ఇంత సీరియస్‌ కాన్సెప్ట్‌ ను అంత ఫన్నీగా డీల్‌ చేశాడేంటి అని ఖలేజా రిలీజైనప్పుడు విమర్శించిన వారు సైతం ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్‌ కోసం ఖలేజాను మళ్లీ మళ్లీ చూశారు. ఖలేజాకు ముందు, తర్వాత కూడా త్రివిక్రమ్‌ తీసిన సినిమాల విషయంలోనూ ఇలాంటి కంప్లయింట్లు ఉన్నప్పటికీ వాటిని జనాలు బాగా ఆదరించారంటే.. మళ్లీ మళ్లీ చూశారంటే కారణం.. ఎంటర్టైన్మెంటే.

కానీ వినోదాన్ని వడ్డించడంలో ఎంత పెన్ను తిరిగిన వాడైనా.. త్రివిక్రమ్‌ ఎప్పటికీ ఒకేలా రాస్తాడని, తీస్తాడని ఆశించలేం కదా. ఎప్పుడో ఓసారి కొంచెం తేడా కొట్టచ్చు కదా. సన్నాఫ్‌ సత్యమూర్తి విషయంలో అదే జరిగింది. అతడి పెన్నులో ఇంకైపోయిందని అనలేం కానీ.. ఇంతకుముందున్న స్థాయిలో అతడి పెన్ను పని చేయలేదని మాత్రం మొహమాట పడాల్సిన పని లేదు.

సన్నాఫ్‌ సత్యమూర్తి ట్రైలర్‌ చూస్తే ఇదేదో అత్తారింటికి దారేది-2లా ఉందే అనుకున్నారు జనాలు. ఇది అచ్చంగా అలాంటి సినిమానే అని చెప్పలేం కానీ.. త్రివిక్రమ్‌ అదే 'లెక్కల్లో' రాసి, తీసిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు. ఒకే ఎమోషనల్‌ పాయింట్‌ తీసుకుని తనదైన శైలిలో వినోదాన్ని జోడించి.. జనాల్ని బాగా నవ్వించి, చివర్లో ఏడిపించేద్దామనుకున్నాడు త్రివిక్రమ్‌.

కానీ ఇంతకుముందులా జనాలు పగలబడి నవ్వేంత సీన్‌ లేదు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చాక కూడా నవ్వించే త్రివిక్రమ్‌ మార్కు కామెడీ.. తెరలు తెరలుగా గుర్తొచ్చి మనసుల్ని గిలిగింతలు పెట్టే అతడి చమత్కారం.. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో మిస్సయ్యాయి. కామెడీ లేదని అనలేం కానీ.. త్రివిక్రమ్‌ నుంచి ఆశించేంత డోస్‌ లేదు. ఎమోషన్‌ కూడా పండలేదు అని చెప్పలేం.. కానీ అందులోనూ ఏదో వెలితి. ఏదో పైపైన నడిపించేశాడు తప్పితే.. మనసు లోతుల్లోకి వెళ్లలేకపోయాడన్న అసంతృప్తి.

'అత్తారింటికి దారేది'లో ఎమోషనల్‌ క్లైమాక్స్‌ కు జనాలు బాగా కనెక్టయిన మాట వాస్తవం. అంత మాత్రాన త్రివిక్రమ్‌ తన బలాన్ని వదిలేస్తే ఎలా? 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో అదే చేశాడు. కామెడీ డోస్‌ తగ్గించేసి.. విలువలు విలువలు అంటూ ప్రథమార్ధమంతా ఎమోషన్స్‌ పండించడం మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. హీరో తన ప్రేయసి దగ్గర ''ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లా'' అంటూ తండ్రికు గుర్తు చేసుకునే సన్నివేశం సహా.. ఇంకో రెండు మూడు సన్నివేశాల్లో ఎమోషన్స్‌ బాగానే పండాయి. కానీ ఎంటర్టైన్మెంట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రథమార్ధం కొంచెం భారంగానే గడుస్తుంది. హీరో పాత్ర నుంచి ఏమాత్రం వినోదాన్ని ఆశించే పరిస్థితి లేకపోగా.. ఆలీ, ఎమ్మెస్‌, రాజేంద్రప్రసాద్‌ పాత్రలు కూడా నిరాశ పరుస్తాయి. ఉన్నంతలో షుగర్‌ పేషెంట్‌ గా హీరోయిన్‌ చేసిన కామెడీనే కాస్త బెటర్‌.

ఫస్టాఫ్‌ సోసోగా సాగినా.. ద్వితీయార్ధంలో ఉపేంద్ర, నిత్యామీనన్‌, బ్రహ్మానందం ఉన్నారు కాబట్టి ఎంతో ఎక్స్‌ పెక్ట్‌ చేస్తాడు ప్రేక్షకుడు. కానీ త్రివిక్రమ్‌ లాంటి వాడు.. మొహం మొత్తేసిన శ్రీనువైట్ల ఫార్ములాలోకి వెళ్లిపోవడం నిరాశ పరుస్తుంది. హీరో వెళ్లి విలన్‌ ఇంట్లో ఇరుక్కుపోవడం.. అక్కడ బ్రహ్మిని వాడేసుకుని డ్రామానడిపించడం.. చివర్లో విషయం బయటపడిపోయి.. పతాక సన్నివేశంతో సినిమాకు శుభం కార్డు పడిపోవడం.. ఎన్ని సినిమాల్లో చూడలేదు?

ద్వితీయార్ధంలో ప్రేక్షకుడి కామెడీ దాహం తీర్చే ప్రయత్నం చేసినా.. ఈ మొహం మొత్తేసిన వ్యవహారం మాత్రం ఇబ్బంది పెడుతుంది. బ్రహ్మి క్యారెక్టర్‌ ఆశించిన స్థాయిలో పేలలేదు. చివర్లో వచ్చే ట్విస్టు మరీ సినిమాటిక్‌గా ఉన్నప్పటికీ అది ఆకట్టుకుంటుంది. ముగింపు బాగుందనిపిస్తుంది. కానీ బయటికొచ్చే ప్రేక్షకుడికి సంతృప్తి మాత్రం ఉండదు. ఉపేంద్ర క్యారెక్టర్‌ కు బిల్డప్‌ బాగా ఎక్కువైంది. క్యారెక్టర్లు మరీ ఎక్కువైపోవడం వల్ల ఆ క్యారెక్టర్లను కానీ, కథనాన్ని సరిగా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌ వ్యవహారమంతా రొటీన్‌గా అనిపిస్తుంది.

నటీనటులు:

ఎప్పుడూ తెర మీద అల్లరల్లరి చేసే బన్నీ క్యారెక్టర్‌ డిమాండ్‌ దృష్ట్యా ఒద్దికగా, సీరియస్‌ గా నటించాడు. తండ్రిని తానెంత మిస్సవుతోంది ప్రియురాలి దగ్గర చెప్పే సన్నివేశంలో బన్నీ బాగా నటించాడు. కన్నీళ్లు రావంటూనే కళ్లల్లో నీళ్లు తెప్పించాడు. ఐతే త్రివిక్రమ్‌ లాంటి డైరెక్టర్‌ తో చేసినపుడు బన్నీ అల్లరి చేస్తేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. బన్నీ మూడీ అయిపోవడంతో సినిమా కూడా అంతే మూడీగా సాగింది. బన్నీ నుంచి ఆశించిన స్టెప్పులు కూడా లేవు. నిరాశ పరిచాడు. సమంత ఓ చిలిపి క్యారెక్టర్లో ఆకట్టుకుంది. సినిమాలో త్రివిక్రమ్‌ కొంచెం భిన్నంగా ఆలోచించిన క్యారెక్టర్‌ ఏదైనా ఉందంటే అది సమంతదే. ఆమె మునుపెన్నడూ లేని స్థాయిలో అందాలు ఆరబోయడం విశేషం. ఉపేంద్రను తీసుకొచ్చారంటే.. నిత్యా మీనన్‌ ఒప్పుకుందంటే.. ఇవేవో స్పెషల్‌ క్యారెక్టర్లయి ఉంటాయనుకుంటాం. వారి టాలెంట్‌ ను త్రివిక్రమ్‌ సరిగా వాడుకోలేదు. ఆదా శర్మ పాత్రా అంతే. ప్రకాష్‌ రాజ్‌ పెద్దగా చేసిందేమీ లేదు. రాజేంద్ర ప్రసాద్‌ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఆలీ పర్వాలేదు. ఎమ్మెస్‌ చేసిందేమీ లేదు. ఆయన వాయిస్‌ మాత్రం బాగానే మేనేజ్‌ చేశారు. స్నేహ, కోట, వెన్నెల కిషోర్‌, సింధు తులానిల గురించి మాట్లాడ్డం అనవసరం అనేలే ఊరికే ఉన్నారంటే ఉన్నారు. మందెక్కువైతే మజ్జిగ పలచన అవుతుందన్నట్లు.. బోలెడంతమంది ఆర్టిస్టులనైతే పెట్టుకున్నాడు కానీ.. వారి పాత్రల్ని మాత్రం సరిగా తీర్చిదిద్దలేదు త్రివిక్రమ్‌..

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఇప్పటికే పాపులరయ్యాయి. తెరమీద కూడా బాగానే అనిపించాయి. ఐతే పెన్నూ పేపరు చేతబట్టి, సూపర్‌ మచ్చి పాటల్ని అంత మామూలుగా తీస్తారని ప్రేక్షకులు ఆశించి ఉండరు. దేవి నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. అతడు రెచ్చిపోయేందుకు తగ్గ కంటెంట్‌ త్రివిక్రమ్‌ ఇవ్వలేదు. ప్రసాద్‌ మూరెళ్ల ఛాయాగ్రహణం ఎప్పట్లాగే అందంగా ఉంది. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కు ఢోకా లేదు. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. త్రివిక్రమ్‌ సినిమాలంటేనే డైలాగుల గురించి ఓ పెద్ద వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఇందులో కూడా అక్కడక్కడా మెరుపులున్నాయి కానీ.. పెన్నులో పదును తగ్గిందన్న విషయం మాత్రం ప్రేక్షకుడు ఈజీగా కనిపెట్టేస్తాడు. బ్రహ్మిని ఎవర్నువ్వు అనంటే.. పెళ్లాన్ని పిలిచి ''దీని మొగుణ్ని'' అని సమాధానమిచ్చినపుడు ఇదీ త్రివిక్రమ్‌ మార్కంటే అనిపిస్తుంది. అలాంటి మెరుపులు మరిన్ని ఉండాల్సింది.

చివరిగా...

బన్నీ అంటేనే జోష్‌.. త్రివిక్రమ్‌ సినిమాలన్నా అంతే.. కానీ సన్నాఫ్‌ సత్యమూర్తిలో ఆ జోషే మిస్సయింది.