Begin typing your search above and press return to search.

RRR గే లవ్ స్టోరీ అన్న రసూల్ కు 'బాహుబలి' నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్..!

By:  Tupaki Desk   |   5 July 2022 2:54 AM GMT
RRR గే లవ్ స్టోరీ అన్న రసూల్ కు బాహుబలి నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్..!
X
ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పోకుట్టి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంపై 'గే లవ్ స్టోరీ' అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'నిన్న రాత్రి RRR అనే చెత్త సినిమాను 30 నిమిషాలపాటు చూశాను' అని మొదట బాలీవుడ్ డైరెక్టర్ మునీష్ భరద్వాజ్ ట్వీట్ చేస్తే.. దాన్ని రీట్వీట్ చేస్తూ రసూల్ పై విధంగా కామెంట్ చేశాడు. వీరిద్దరి పై సినీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

తాజాగా 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ దీనిపై స్పందిస్తూ రసూల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. “RRR సినిమా ఒక గే లవ్ స్టోరీ అని నేను భావించడం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు ఇది గే లవ్ స్టోరీనే అనుకుంటే.. అందులో తప్పేముంది? అసలు నువ్వు దాన్నెలా సమర్థించుకుంటావు? నీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి దిగుజారుగు కామెంట్ రావడం నిజంగా శోచనీయం” అని శోభు ట్వీట్ చేశారు.

శోభు ట్వీట్ కు రసూల్ పోకుట్టి రియాక్ట్ అవుతూ.. ''మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అది గే లవ్ స్టొరీ అయినప్పటికీ తప్పు ఏమీ లేదు. పబ్లిక్ డొమైన్‌ లో ఇప్పటికే ఉన్న విషయాన్ని నా ఫ్రెండ్ కు కోట్ చేసాను తప్ప మరేమీ లేదు. ఇందులో స్టూపింగ్ ఫ్యాక్టర్ లేదు. మీరు దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు శోభూ.. నేను దీన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.

కాగా, మునీష్ భరద్వాజ్ చేసిన ట్వీట్ కు రసూల్ పోకుట్టి స్పందిస్తూ RRR ను గే లవ్ స్టొరీ అనడం పై నెటిజన్లు ఆయన పై మండి పడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే తాను పశ్చిమ దేశాల్లో ఈ సినిమా గురించి అనుకుంటున్న దాన్నే కోట్ చేశానని రసూల్ చెబుతున్నాడు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై మీరు చేసిన కామెంట్స్ తో మీపై రెస్పెక్ట్ పోయిందని ఓ నెటీజన్ ట్వీట్ చేయగా.. "వెస్ట్రన్ దేశాల్లో ఆ చిత్రాన్ని అలానే పిలుస్తున్నారు. నేను దానిని కోట్ చేశాను అంతే" అని ఆస్కార్ విన్నర్ పేర్కొన్నాడు. అక్కడితో ఆగకుండా తమ అభిప్రాయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి రసూల్ - మునీష్ ట్వీట్లు పెడుతూ వచ్చారు.

ఏదేమైనా హాలీవుడ్ ప్రముఖులతో జేజేలు కొట్టించుకుంటున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని ఒక ఇండియన్ టెక్నిషియన్ ఇలా గే లవ్ స్టోరీతో పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అది కూడా అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవకారుల స్పూర్తితో రాసుకున్న కథని అవమానించడం దారుణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రసూల్ దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమాను తక్కువ చేసి మాట్లాడుతున్న రసూల్ పోకుట్టి ని టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎవరూ ప్రోత్సహించవద్దని అంతున్నారు. 'పుష్ప: ది రైజ్' 'రాధేశ్యామ్' వంటి చిత్రాలకు వర్క్ చేసిన రసూల్.. 'పుష్ప: ది రూల్' లో కూడా భాగమయ్యే అవకాశం ఉంది. మరి RRR వివాదం తర్వాత పుష్ప మేకర్స్ ఆస్కార్ విన్నర్ తో కలిసి పని చేస్తారో లేదో చూడాలి.