Begin typing your search above and press return to search.

60 ఏళ్లు దాటాక‌..అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడంటారా?

By:  Tupaki Desk   |   16 April 2018 7:57 AM GMT
60 ఏళ్లు దాటాక‌..అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడంటారా?
X
క్యాస్టింగ్ కౌచ్ మీద మొద‌లైన యుద్ధం టాలీవుడ్ లో అంత‌కంత‌కూ ముదురుతోంది. ఈ అంశం మీద గ‌ళం విప్పిన న‌టి శ్రీ‌రెడ్డి చేసిన పోరాటానికి తాజాగా వామ‌ప‌క్షాల‌కు చెందిన మ‌హిళా సంఘాలు తెర మీద‌కు రావ‌టంతో శ్రీ‌రెడ్డికి మ‌రింత నైతిక స్థైర్యంతో పాటు.. ఆమెతో పాటు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌పై గ‌ళం విప్ప‌టానికి ప‌లువురు మ‌హిళ‌లు ముందుకు రావ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సాగుతున్న ఆర్థిక‌.. లైంగిక దోపిడీపై గ‌ళం విప్పిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు.. జూనియ‌ర్ ఆర్టిస్ట్ ల‌కు అండ‌గా మ‌హిళా సంఘాల నేత‌లు త‌మ పోరాటాన్ని తీవ్ర‌త‌రం చేశారు. తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఏలుతున్న నాలుగు కుటుంబాల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ప్ర‌జ‌ల అభిమానంతో.. వారి ప్రేమ‌తో కోట్లు గ‌డించార‌ని.. త‌రాలు గ‌డిచినా ఆ కుటుంబాల వారే హీరోలుగా చెలామ‌ణీ అవుతున్నార‌న్నారు. మీ తాత‌లు.. తండ్రులు.. కొడుకులు.. ఇంతేనా? అంటూ ప్ర‌శ్నించారు. మూడు త‌రాలుగా ఏలుతున్నారని.. తెలుగు రాష్ట్రాల్లో ముక్కు ముఖం ఉన్న వాళ్లు లేరా? అని నిల‌దీశారు. న‌ట‌న వ‌చ్చిన వాళ్లు లేరా? సృజ‌నాత్మ‌క‌త ఉన్నోళ్లు లేరా? యాక్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్లు లేరా? అంటూ తీవ్రంగా మండిప‌డ్డారు సామాజిక ఉద్య‌మ‌కారిణి సంధ్య‌.

తెలుగు ప్రేక్ష‌కుల త‌ర‌ఫున తాను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు చెప్పిన ఆమె.. త‌మ డ‌బ్బుల‌తో కోట్లు గ‌డించార‌ని.. ప్ర‌భుత్వాల నుంచి కోట్లాది రూపాయిలు విలువ చేసే భూములు తీసుకొని స్టూడియోలు నిర్మించుకున్నార‌న్నారు. ఒక‌డు ప‌వ‌ర్ స్టార్‌,.. ఇంకొకుడు సూప‌ర్ స్టార్‌.. మ‌రొక‌డు మెగాస్టార్ అని చెప్పుకుంటున్నారు. అర‌వైఏళ్ల వ‌య‌సులో అమ్మ‌డు.. లెట్స్ డు కుమ్ముడు అంటూ కుమ్ముతున్నారు. ఎంత‌కాలం మీ కుమ్ముళ్లు? అని ప్ర‌శ్నించారు.

సినిమాల‌ను ఏలుతున్న వాళ్లు.. రాజ‌కీయ నాయ‌కుల‌కు అమ్మాయిల్ని పంపిస్తున్న‌ట్లుగా త‌మ‌ను క‌లిసి అమ్మాయిలు చెప్పార‌న్నారు. వేషం కావాలంటే.. నిర్మాత ద‌గ్గ‌ర ప‌డుకోవాల‌ట‌. నిర్మాత‌కు డబ్బులు ఇచ్చే ఫైనాన్స‌ర్ ద‌గ్గ‌ర ప‌డుకోవాల‌ట‌.. వాడి ద‌గ్గ‌ర‌కు వెళితే.. వాడికి బాగా ప‌రిచ‌యం ఉన్న రాజ‌కీయ నేత ద‌గ్గ‌ర ప‌డుకోవాల‌ట‌. ఏమిటీ దారుణం? తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌ట్టిన చెద వ‌దిలించ‌టానికే ఈ పెను కేక‌లంటూ.. ఈ త‌ర‌హా దోపిడీని తాము అడ్డుకుంటామ‌న్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి