Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో చిరు vs నాగ్...!

By:  Tupaki Desk   |   27 May 2020 11:30 PM GMT
సోషల్ మీడియాలో చిరు vs నాగ్...!
X
సినీ ఇండస్ట్రీలో హీరోల అభిమానుల మధ్య జరిగే ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ పుట్టినప్పటినుండి అభిమానుల మధ్య గొడవలు కామన్ గా ఉండేవే. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికి వారు తమకు నచ్చని హీరోలపై ద్వేషంతో రగిలిపోతూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేసుకోడం హీరోల ఫాన్స్ కి మామూలైపోయింది. ట్విట్టర్ లో కొత్త కొత్త నెగిటివ్ హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేస్తూ ఇతర హీరోలను కించపరుస్తూ తమని తాము కించపరుచుకుంటూ ఉంటారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని.. మా హీరోవే ఒరిజినల్ అండ్ ఆర్గానిక్ రికార్డులని.. వాళ్లకు ఫేక్ రికార్డులు అని.. ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ - నందమూరి ఫ్యాన్స్ - అక్కినేని ఫ్యాన్స్ - ప్రభాస్ ఫ్యాన్స్ - మహేష్ ఫ్యాన్స్.. ఇలా అందరి మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది.

సినీ ఇండస్ట్రీలో నటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎక్కడైనా ఒకరినొకరు తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు.. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు కూడా. 'మేము మేము బాగానే ఉంటాం.. కానీ మీరే' అంటూ వాళ్లే డైరెక్టుగా చెప్పిన గొడవలు మాత్రం ఆపరు. ఇప్పుడు లేటెస్టుగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మరియు కింగ్ నాగార్జున ఫ్యాన్స్ వార్ స్టార్ చేసారు. నాగార్జున గొప్పంటే.. కాదు చిరంజీవి గొప్పంటూ దూషణలకు దిగుతున్నారు. మీ హీరో మా హీరోకి పోటీ కూడా రాలేడని ఒకరంటే.. మీ హీరో మా హీరో తరహా సినిమా ఒక్కటైనా చేసి చూపెట్టమని సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. ఈ విధంగా ఒకరి హీరోలను ఒకరు కించపరుచుకుంటూ మిగతా వారి దృష్టిలో దిగజారి పోతున్నారు.

నిజానికి సినీ ఇండస్ట్రీలో చిరు - నాగ్ చాలా స్నేహంగా మెలుగుతారు. స్నేహితులుగా కంటే అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. చిరు నాకు బ్రదర్ లాంటి వాడని నాగ్ అనేక సందర్భాల్లో చెప్పాడు. చిరు అయితే నాగ్ కి నాకు ఉన్న అనుబంధానికి పేరు పెట్టలేమని.. నాగ్ సలహా మీదుగానే బిజినెస్ లో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశా అని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వీరిద్దరి పిల్లలు కూడా వీరి లాగే క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. చిరంజీవి ఒక సందర్భంలో 'అఖిల్ నాకు చిన్న కొడుకు' అని సంభోదిస్తే.. నాగ్ 'చరణ్ నాకు పెద్ద కొడుకు' అని సంభోదించాడు. ఈ రెండు కుటుంబాలు అంత అన్యోన్యంగా ఉంటాయి. కానీ వీరి ఫ్యాన్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు. ఒకరి మీద ఒకరు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ దిగజారి పోతుంటారు. హీరోల స్థాయిని దిగజార్చే ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ ఎప్పుడు ఆగుతాయో మరి...!