Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: వచ్చేస్తున్నాడు సోగ్గాడు
By: Tupaki Desk | 13 Dec 2015 3:55 AM GMTఅక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. సంక్రాంతి సమరానికి రెడీ అవుతున్న నాగార్జున సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ట్రైలర్ ఈ రోజు సాయంత్రమే రిలీజైంది. టీజర్ తో చిన్న డోస్ ఇచ్చిన నాగ్.. ట్రైలర్ తో ఇంకా ఎక్కువగానే ఎంటర్టైన్ చేశాడు. సినిమా సరదా సరదాగా సాగబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది.
సోగ్గాడంటే సోగ్గాడే అనిపించే ఓ తండ్రి.. అతడి కడుపున ఓ బుద్ధిమంతుడైన కొడుకు.. తండ్రి చనిపోయి కొడుకులోకి ప్రవేశించి తన చిలిపి తనాన్నంతా చూపిస్తాడు. ఇంతకీ ఆ తండ్రి ఎందుకు చనిపోయాడు. కొడుకు శరీరంలోకి వచ్చి ఏం చేశాడన్నది సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. పెద్దగా సస్పెన్సీమీ పెట్టకుండా ట్రైలర్ తోనే కథ విప్పేసింది ‘సోగ్గాడే చిన్నినాయనా’ టీం.
కొడుకులో ఉన్న తండ్రి ‘‘పిట్ట పిటపిటలాడిపోతోంది’’ అనడం.. హీరోయిన్ ఆ మాటకు అర్థం తెలుసా అని అడిగితే గూగుల్ చేసి తెలుసుకుంటా అని కొడుకు గూగుల్లో చూడటం.. అంతా ఫన్నీ ఫన్నీగా ఉంది వ్యవహారం. రెండు భిన్నమైన పాత్రల్లో నాగ్ పెర్ఫామెన్స్ అదరగొట్టేశాడని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతోంది. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కూడా అందంగా కనిపిస్తున్నారు. ఐతే సంక్రాంతి విడుదల అని చెప్పకుండా త్వరలోనే వస్తున్నాడు అని మాత్రమే చెప్పారు. దీంతో సంక్రాంతికి సోగ్గాడు వస్తాడా రాడా అనే విషయంలో కొంచెం సందేహాలు కలుగుతున్నాయి.