Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సోలో బ్రతుకే సో బెటర్

By:  Tupaki Desk   |   25 Dec 2020 9:20 AM GMT
మూవీ రివ్యూ : సోలో బ్రతుకే సో బెటర్
X
చిత్రం : ‘సోలో బ్రతుకే సో బెటర్’

నటీనటులు: సాయిధరమ్ తేజ్ - నభా నటేష్ - రావు రమేష్ - రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - నరేష్ - సత్య - సుదర్శన్ - ఝాన్సీ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన - దర్శకత్వం: సుబ్బు

లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో తెలుగులో రిలీజవుతున్న తొలి పేరున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

విరాట్ (సాయిధరమ్ తేజ్) కొన్ని కారణాల వల్ల పెళ్లి పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న కుర్రాడు. ఆ వ్యతిరేకతను తన వరకు ఉంచుకోకుండా.. తన చుట్టూ ఉండే అబ్బాయిలు, అమ్మాయిల్లో పెంచే పనిలో పడతాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే గ్రూప్ పెట్టి ఒక ఉద్యమానికి పూనుకుని బ్రహ్మచారులను మోటివేట్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. అలాంటి వ్యక్తి నెమ్మదిగా తన ఆలోచనలు మార్చుకోవాల్సిన స్థితిలో పడతాడు. పెళ్లి పట్ల ఆకర్షితుడవుతాడు. కానీ అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమృత (నభా నటేష్) అనే అమ్మాయి ఒకప్పటి తన ‘సోలో’ ఫిలాసఫీలకే ఆకర్షితురాలై పెళ్లి పట్ల వ్యతిరేకతతో ఉంటుంది. ఈ స్థితిలో విరాట్ ఆమె మనసు మార్చి ఎలా తనను పెళ్లి చేసుకున్నాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఈ ప్రపంచంలో పెళ్లి మీద.. భార్యల మీద వచ్చినన్ని జోకులు ఇంకే టాపిక్ మీదా వచ్చి ఉండవేమో. ఐతే ఆ జోకులు కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాటిని సీరియస్ గా తీసుకుంటే కష్టం. ఈ జోకుల్ని ఆస్వాదించేవాళ్లు.. షేర్ చేసేవాళ్లందరూ కూడా వివాహ వ్యవస్థలో భాగమైన వాళ్లే. ఇందులో చాలామంది భార్యల్లేకుండా బతకలేని వాళ్లే. ‘‘పెళ్లి అనేది సృష్టి ధర్మం’’ అంటూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో ఒక చోట టీవీ ఇంటర్వ్యూలో నటుడు నారాయణ మూర్తి చెప్పిన మాటల్ని చూపిస్తారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన ఆయన.. యువతకు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకోమనే సలహా ఇచ్చాడు. ఈ సినిమా ‘సోల్’ అంతా ఆ మాటలోనే ఉంది. ముందు ఆవేశంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనుకున్నప్పటికీ.. ఒక దశ దాటాక ఒంటరి బతుకు కష్టం అనిపిస్తుందని.. ఎవరికైనా జీవితంలో ఒక తోడు కచ్చితంగా అవసరమని చెప్పే ప్రయత్నం జరిగింది ఈ చిత్రంలో. కానీ దాన్ని అనుకున్నంత వినోదాత్మకంగా... ప్రభావంతంగా చెప్పడంలో కొత్త దర్శకుడు సుబ్బు విఫలమయ్యాడు. ప్రథమార్ధం వరకు ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేసినా.. ఒకట్రెండు బలమైన సన్నివేశాలు పడ్డా.. ఓవరాల్ గా మాత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సో సోగానే అనిపిస్తుంది తప్ప అనుకున్నంత ఇంపాక్ట్ ఇవ్వదు.

సోలో బ్రతుకే సో బెటర్.. ప్రోమోలు కట్ చేసుకోవడానికి మంచి అవకాశమున్న కాన్సెప్ట్. పెళ్లి పట్ల వ్యతిరేకత పెంచుకున్న కుర్రాడు.. తన చుట్టూ ఉన్న వాళ్లను ఆ దిశగా మోటివేట్ చేయడం అన్నది ఇంట్రో వరకు ఓకే. సోలో బ్రతుకులో ఉన్న కంఫర్ట్ గురించి కాసేపు లెక్చరిస్తే.. పెళ్లిలో ఉన్న కష్టం గురించి కాసేపు పంచులేస్తే ఫన్నీగానే ఉంటుంది. వాటిని ప్రోమోలుగా కట్ చేసి టీజర్.. ట్రైలర్లో వేస్తే బాగానే అనిపిస్తుంది. కానీ ఈ కాన్సెప్ట్ మీద రెండు గంటలకు పైగా నిడివితో సినిమా తీయడం మాత్రం కష్టమని సినిమా చూస్తున్నపుడు అర్థమవుతుంది. ట్రైలర్ చూసి ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుంచి మరీ ఎక్కువ వినోదం ఆశిస్తే నిరాశ తప్పదు. సినిమాలో ఉన్న ఉత్తమమైన ఎపిసోడ్ల నుంచే కొన్ని షాట్లు తీసి ట్రైలర్లో పేర్చారనిపిస్తుంది. అంతకుమించి సినిమాలో పెద్దగా విషయం లేకపోయింది. సినిమా ఆరంభంలోనే హీరో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ గ్రూప్ పెట్టడం.. పెళ్లికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం.. చుట్టూ ఉన్న వాళ్లను బ్యాచిలర్ లైఫ్ దిశగా మోటివేట్ చేయడం సరదాగా అనిపిస్తుంది. దీనికి తోడు మామూలు సన్నివేశాలను కూడా తనదైన కామెడీ టైమింగ్ తో పండించగల వెన్నెల కిషోర్ ‘పెళ్లి’ చుట్టూ నడిపించిన ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.

రెండుంబావు గంటల నిడివి ఉన్న సినిమాలో హీరో తన ‘సోలో’ సిద్ధాంతం మీద ముప్పావు గంటకు మించి ఉండడు. అతడిలో రియలైజేషన్ రావడానికి దారి తీసే ‘రావు రమేష్’ ఎపిసోడ్ బాగానే అనిపించినా.. మరీ అంత తేలిగ్గా హీరో మారిపోవడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఇంతకుముందు ‘మన్మథుడు’ సినిమాలోనూ హీరో పెళ్లి పట్ల వ్యతిరేకతతో ఉండటం.. ఆ తర్వాత మారడం చూడొచ్చు. ‘సోలో బ్రతుకే..’లో కొన్ని సన్నివేశాలు చూస్తే ఆ క్లాసిక్ మూవీ స్ఫూర్తి కూడా కనిపిస్తుంది. కానీ ‘మన్మథుడు’ హీరో పెళ్లి పట్ల వ్యతిరేకతతో ఉండటానికి బలమైన కారణాలుంటాయి. అలాగే అతను మారడానికి దారితీసే సన్నివేశాలూ అంతే బలంగా ఉంటాయి. ఆ సినిమాలో వినోదం, ఎమోషన్ సమపాళ్లలో ఉంటాయి. రెండూ అంతే ప్రభావం చూపిస్తాయి. కానీ దాదాపు అలాంటి కాన్పెప్ట్ తోనే తెరకెక్కిన ‘సోలో బ్రతుకే..’ వినోదం జస్ట్ ఓకే అనిపిస్తుంది. మిగతా వ్యవహారం అయితే మరీ సాధారణంగా తయారైంది. ముఖ్యంగా ఇందులో ద్వితీయార్ధం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్క రావు రమేష్ పాత్రను ముగించే సన్నివేశం మినహాయిస్తే ఏదీ ఆకట్టుకోదు. అంతా బోరింగ్ వ్యవహారమే.

హీరోయిన్ పాత్రను మరీ ఆలస్యంగా ఇంటర్వెల్ దగ్గర కథలోకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగించినా అక్కడ ట్విస్టు బాగానే అనిపిస్తుంది. కానీ ఆ పాత్రతో ప్రేక్షకులకు ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని విధంగా మరీ పేలవంగా తీర్చిదిద్దడంతో ద్వితీయార్ధంలో లవ్ ట్రాక్ మొత్తం తేలిపోయింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలేవీ ఆకట్టుకోవు. హీరోయిన్ని మార్చడానికి హీరో ప్రయత్నించడం.. అతడికి ఎదురు దెబ్బలు తగలడం.. చివరికి కథ సుఖాంతం కావడం.. ఇలా రొటీన్ ట్రాక్ లో వెళ్లిపోయిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ రాను రాను బోర్ కొట్టించేస్తుంది. అనవసర సన్నివేశాలు పేర్చి సినిమాను బలవంతంగా సాగదీయడం తప్ప ద్వితీయార్ధంలో ఏ విశేషం లేదు. ప్రథమార్ధంలో వెన్నెల కిషోర్ తరహాలో ఎవరూ కామెడీ పండించకపోవడం పెద్ద మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే ‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ తో ఆకట్టుకున్నంతగా సినిమాగా ఆకట్టుకోదు. సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లకు వెళ్లి కాసేపు టైంపాస్ చేయలనుకుంటే ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఓకే కానీ.. అంతకుమించి ఆశిస్తే నిరాశ తప్పదు.

నటీనటులు:

సాయిధరమ్ తేజ్ విరాట్ పాత్రకు ఓకే అనిపిస్తాడు. ‘సోలో’ ఫిలాసఫీలతో సాగే వరకు అతడి పాత్ర సరదాగానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత సినిమాలాగే అతడి పాత్ర గ్రాఫ్ కూడా పడిపోతుంది. నటన పరంగా ఈ పాత్ర తేజుకు అంత పరీక్ష పెట్టేదేమీ కాదు. ఉన్నంతలో హుషారుగా నటించి ఓకే అనిపించాడు. హీరోయిన్ నభా నటేష్ సినిమాలో పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. ఆమె పాత్ర సినిమాలో ఉన్నదే తక్కువ సమయం. అందులోనూ ఆమె ప్రత్యేకతను చూపించడానికి స్కోప్ లేకపోయింది. ఒక పాట వరకు కొంచెం మెరిసింది తప్ప.. మిగతా సిినిమాలో ఆమె తేలిపోయింది. రావు రమేష్ కథకు కీలకమైన పాత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. హీరో పాత్రలో మార్పుకు కారణమయ్యే సన్నివేశంలో ఆయన నటన కదిలిస్తుంది. సినిమాలో ఉత్తమ సన్నివేశం కూడా అదే. నరేష్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. వెన్నెల కిషోర్ పెళ్లి కోసం తపించిపోయే వ్యక్తిగా తనదైన శైలిలో నవ్వించాడు. కన్నడిగుడిగా అతడి భాష.. యాస కూడా కామెడీకి తోడ్పడ్డాయి. సుదర్శన్, సత్య బాగానే చేశారు. రాజేంద్ర ప్రసాద్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా లేదు. ఆయన నటన కూడా అసహజంగా.. అతిగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

నో పెళ్లి.. ఇది నేనేనా.. లాంటి పాటలతో తమన్ కొంత హుషారు పుట్టించాడు కానీ.. ఓవరాల్ గా సంగీత పరంగా ఇంపాక్ట్ అనుకున్నంతగా లేదు. పాటలు ఇంకా బాగుండాల్సిందనిపిస్తుంది. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా సాగింది. వెంకట్.సి.దిలీప్ ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగానే అనిపిస్తాయి. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. రైటర్ కమ్ డైరెక్టర్ సుబ్బు.. తొలి సినిమాతో యావరేజ్ మార్కులే వేయించుకున్నాడు. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని ప్రభావవతంగా తెరపైకి తీసుకురాలేకపోయాడు. చాలామంది దర్శకుల్లాగే సినిమాను ఆసక్తికరంగా ఆరంభించి.. ఆ తర్వాత కాడి వదిలేశాడు. ‘‘కొన్నిసార్లు కన్నీళ్లు తుడుచుకోవడానికి మన రెండు చేతులు కూడా సరిపోవు’’ అనే డైలాగ్.. ఈ డైలాగ్ వచ్చే సన్నివేశంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. కానీ ఈ మెరుపులు ఆ తర్వాత కూడా కొనసాగి ఉంటే.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ స్థాయి వేరుగా ఉండేది.

చివరగా: సోలో బ్రతుకే సో బెటర్.. సోసో!

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre