Begin typing your search above and press return to search.

ఆ సెలెబ్రెటీలు సాయం చేసి కూడా చెప్పుకోవట్లేదా..?

By:  Tupaki Desk   |   2 April 2020 8:30 AM GMT
ఆ సెలెబ్రెటీలు సాయం చేసి కూడా చెప్పుకోవట్లేదా..?
X
భారత్‌ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి నానాటికి విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు అందజేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. క‌రోనా నిర్మూల‌న స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో పాలు పంచుకునేందుకు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు, కూడా భారీగా విరాళాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు కూర్చోవ‌డంతో వారిపై దుమ్మెత్తి పోస్టున్నారు నెటిజ‌న్స్. వివ‌రాల‌లోకి వెళితే బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా, కత్రినా కైఫ్, అలియా భట్, పూజాహెగ్డే, అనుష్క, రష్మిక, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టి వ‌ర‌కు పీఎం సహాయనిధికి, రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ ఎలాంటి సాయం చేయ‌లేదని, మీరెప్పుడు డొనేషన్స్ ఇస్తారు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా బాలయ్య, విజయ దేవరకొండ, బ్రహ్మానందం లాంటి వారు కూడా స్పందించకపోవడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే వాళ్లలో సోనాక్షిని విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. తోటి హీరోయిన్లు అంద‌రు సాయం చేస్తుంటే తాను మాత్రం ఏం ప‌ట్ట‌న‌ట్టు కూర్చోవ‌డాన్ని నెటిజ‌న్స్ త‌ప్పుప‌డుతున్నారు. ఆమె దీనిపై స్పందించిన సోనాక్షి.. కొంత మంది మంచి ప‌ని చేసి చెప్పుకుంటారు. మరికొంద‌రు చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. సెకండ్ ఆప్ష‌న్‌ని నేను పాటిస్తాను. న‌న్ను ట్రోల్ చేసే వారి కోసం నేను ఒక నిమిషం మౌనం పాటిస్తాను. విపత్క‌ర స‌మ‌యంలో ట్రోల్స్ చేయ‌డం కంటే ఈ విలువైన స‌మ‌యాన్ని మంచి కోసం ఉప‌యోగించండి. విరాళం ప్రకటించడం, ప్రకటించకపోవడం అనేది నా వ్య‌క్తిగ‌త విషయం' అంటూ త‌న ట్వీట్‌లో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇలానే రియాక్ట్ అయింది. 'మీరు కోరుకుంటున్నట్లు మేము ఎందుకు డొనేషన్స్ ఇవ్వాలి..ప్రైవేట్ గా విరాళాలు ఇచ్చిన కొన్ని లక్షల మంది ఉన్నారు..ప్రతీది పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి' అంటూ ఘాటుగా స్పందించింది. అలాగే డైరెక్టర్ దేవా కట్టా కూడా దీనిపై స్పందిస్తూ 'విరాళం అనేది రౌడీ మాములు కాదని, కొందరు ఇచ్చినా పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో, మరింకేదో కారణం చేతనో బయటకు చెప్పారు. అంత మాత్రానా వాళ్లని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని' కామెంట్ చేసాడు. ఏదేమైనా వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మరి.