Begin typing your search above and press return to search.

త‌ల్లి కోసం ప్ర‌చార‌గోదాలోకి సోనాక్షి సిన్హా!

By:  Tupaki Desk   |   4 May 2019 5:24 AM GMT
త‌ల్లి కోసం ప్ర‌చార‌గోదాలోకి సోనాక్షి సిన్హా!
X
తండ్రి ఒక పార్టీ.. త‌ల్లి మ‌రో పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌టం చాలా రాజ‌కీయ కుటుంబాల్లో చూస్తుండేది. అయితే.. త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న భార్య కోసం స‌ద‌రు భ‌ర్త ప్ర‌చారం చేయ‌టం కాస్త వింతే. అలాంటి చిత్ర‌విచిత్రాలు బాలీవుడ్ సినీ న‌టుడు శత్రుఘ్న‌సిన్హా ఇంట క‌నిపిస్తాయి. వారింట రాజ‌కీయం మామూలుగా ఉండ‌దు.

తాజాగా జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో శ‌తృఘ్నసిన్హా.. ఆయ‌న స‌తీమణి పూనం సిన్హా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్న‌ది మామూలు వ్య‌క్తి మీద కాదు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీద‌. అలాంటి వ్య‌క్తి మీద ప్ర‌చారం చేస్తున్న వేళ‌.. ఏదో పోటీ చేస్తున్నామంటే చేస్తున్నామ‌న్న‌ట్లు కాకుండా.. తీవ్ర‌మైన పోటీ ఇస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మొన్న‌టి వ‌ర‌కూ బీజేపీలో ఉన్న శ‌తృఘ్న సిన్హా.. ఈ మ‌ధ్య‌న కాంగ్రెస్‌లోకి మార‌టం తెలిసిందే. అయితే.. ఆయ‌న స‌తీమ‌ణి పూనం మాత్రం స‌మాజ్ వాదీ పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. రాజ్ నాథ్ మీద పోటీ అంటే మాట‌లు కాక‌పోవ‌టంతో భార్య‌కు తోడుగా శ‌తృఘ్న సిన్హా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. తాజాగా.. వారి కుమార్తె.. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా కూడా ప్ర‌చార బ‌రిలోకి దిగారు.

యూపీ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాజ్ నాథ్ పై ప్ర‌త్య‌ర్థిగా పూనం బ‌రిలోకి దిగిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మీరేమో కాంగ్రెస్‌.. మీ వైఫ్ స‌మాజ్ వాదీ పార్టీ. రెండు పార్టీల మ‌ధ్య పోటీ ఉంది. అలాంటి మీరు.. మీ భార్య త‌ర‌ఫున ఎలా ప్ర‌చారం చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌ను శ‌తృఘ్న సిన్హాను ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న ఆస‌క్తిక‌రంగా జ‌వాబు ఇస్తున్నారు.

త‌న భార్య త‌ర‌ఫు ప్ర‌చారాన్ని భ‌ర్త హోదాలో చేస్తున్న‌ట్లు స‌మ‌ర్థించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. శ‌తృఘ్న సిన్హా బీహార్ లోని పాట్నా సాహిబ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తానికి శ‌తృఘ్న సిన్హా ఫ్యామిలీ రాజకీయం మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇక‌.. తల్లికి మ‌ద్ద‌తు ప‌లుకుతూ సోనాక్షి చేస్తున్న ప్ర‌చారానికి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆమెనుచూసేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నారు. సోనాక్షి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నం.. ఓట్లు వేసేట‌ప్పుడు ఇంతే ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారా? అన్న‌ది తేలాలంటే మాత్రం ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.