Begin typing your search above and press return to search.

రియల్‌ హీరో ఇమేజ్‌ తో కెరీర్‌ కు దెబ్బ పడనుందా?

By:  Tupaki Desk   |   1 Dec 2020 12:09 PM GMT
రియల్‌ హీరో ఇమేజ్‌ తో కెరీర్‌ కు దెబ్బ పడనుందా?
X
కరోనా సమయంలో ఎంతో మంది హీరోలు మంచి మనసుతో కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కోట్లల్లో విరాళాలు ఇచ్చి సాయంగా నిలిచారు. కాని విలన్‌ గా సుపరిచితుడు అయిన సోనూసూద్‌ మాత్రం అంతకు మించి అన్నట్లుగా సాయం చేశాడు. లాక్‌ డౌన్‌ తో వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికుల కోసం వందల కొద్ది బస్సులు ఏర్పాటు చేశాడు. రైలు మరియు విమానం ద్వారా కూడా సోనూ సూద్‌ వలస కార్మికులను తరలించిన దాఖలాలు ఉన్నాయి. ఆయన ఛారిటీ అంతటితో ఆగిపోలేదు. ఆయన వరుసగా సాయాలు చేస్తూనే వచ్చారు. దాంతో సోనూసూద్‌ కు రియల్‌ హీరో బిరుదును ఇవ్వడంతో పాటు దేవుడు అంటూ అంతా పొగడ్తల వర్షం కురిపించారు.

హీరోను మనం సినిమాల్లో విలన్‌ కొడితేనే చూడలేం. అలాంటిది రియల్‌ హీరో ఇమేజ్‌ ఉన్న సోనూసూద్‌ సినిమాల్లో విలన్‌ వేశాలు వేయడం.. ఆయన్ను హీరోలు కొట్టడం చేస్తే అభిమానులు తట్టుకుంటారా అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. కొందరు ముందు చూపు ఉన్న దర్శకులు ఎక్కువ ఆలోచించే దర్శకులు సోనూ సూద్‌ ను తీసుకునేందుకు ఆలోచనల్లో పడ్డారు అనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలో సోనూ సూద్‌ హీరోగా సినిమాలు చేయడం మంచిది అనే సలహాలు కూడా ఇస్తున్నారు. కాని సోనూ సూద్‌ మాత్రం ఏ అవకాశం వచ్చినా చేసేందుకు సిద్దం అన్నట్లుగా ఉన్నాడు.

కెరీర్‌ లో సోనూ సూద్‌ ఇంతకు ముందు ఏడాదికి పది సినిమాల వరకు చేసేవాడు. కాని ఇప్పుడు పరిస్థితి మారే అవకాశం ఉంది. సినిమాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. సినిమాల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఎందుకంటే పారితోషికం విపరీతంగా పెంచాడు. అయితే ఇలా ఎన్నాళ్లు అనేది కొందరి అనుమానం. భారీ పారితోషికంతో విలన్‌ గా ఎక్కువ కాలం కంటిన్యూ అవకవడం సాధ్యం అయ్యే వ్యవహారం కాదంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ హీరో ఇమేజ్‌ తో సోనూ సూద్‌ కెరీర్‌ లో కాస్త అయినా డ్యామేజీ జరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరి ఈ డ్యామేజీని సోనూసూద్‌ ఎలా కవర్‌ చేసుకుంటాడో చూడాలి.