Begin typing your search above and press return to search.

ఈ సోనూ వేరు.. ఆ సోనూ వేరు

By:  Tupaki Desk   |   18 April 2017 11:26 AM IST
ఈ సోనూ వేరు.. ఆ సోనూ వేరు
X
ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయినారు అంటూ సాగే పాత పాటను చాలామంది వినే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తే ఈ పాటనే గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా పూర్ కంట్రీ అన్న ఉద్దేశం వచ్చేలా రెండు రోజుల కిందట స్నాప్ చాట్ సీఈవో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఐతే జనాలు ‘స్నాప్ చాట్’ అనుకుని పొరబడి ‘స్నాప్ డీల్’ మీద పడ్డారు. ఈ ఇ-కామర్స్ సంస్థను తిట్టిపోస్తున్నారు. అంతే కాక ‘స్నాప్ డీల్’ యాప్‌ ను మొబైళ్ల నుంచి తీసి పారేస్తున్నారు. అసలే గత ఏడాది అమీర్ ఖాన్ చేసిన అసహన వ్యాఖ్యలతో అతణ్ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్న స్నాప్ డీల్ ఇమేజ్ బాగా దెబ్బ తింది. ఇప్పుడు ‘స్నాప్ చాట్’ సీఈవో పుణ్యమా అని ఈ సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది.

స్నాప్ డీల్ వ్యవహారం అలా ఉంటే.. బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యల దెబ్బకు నటుడు సోనూ సూద్ ఇబ్బంది పడుతున్నాడు. ముస్లింలు తెల్లవారుజామున చేసే నమాజ్ (అజాన్)ను ఉద్దేశించి నిగమ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఉదయం అజాన్ ద్వారా అందరినీ బలవంతంగా నిద్ర లేపడం ఎంత వరకు సమంజసం అని అతను ప్రశ్నించాడు. మహ్మద్ ప్రవక్త రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి సరిపోయిందని.. కానీ ఇప్పుడు కరెంట్ ఉండటం వల్ల జనాల్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నాడు సోనూ. గుళ్లు.. గురుద్వారాల్లో మాత్రం ఇలాంటి ఉండవని చెప్పాడు. మతం అంటే గూండాగిరీనే అని అతను తీర్మానించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ముస్లిం నెటిజన్లు అతడి మీద ఎదురుదాడికి దిగారు. ఐతే సోనూ అనే పేరు కొట్టగానే సోనూ సూద్ ట్విట్టర్ అకౌంట్ హైలైట్ అవుతోంది. జనాలు అది చూసుకోకుండా అతడి పేరును ట్యాగ్ చేసి హేట్ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై అతను అయోమయానికి గురై.. ఎవరో ఏదో చేస్తే ఎవరిని తిడుతున్నారు అంటూ అసహనంతో ట్వీట్ చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/