Begin typing your search above and press return to search.

'నేను కూడా సుశాంత్ లా సూసైడ్ చేసుకుంటానేమో అని భయపడుతున్నారు'

By:  Tupaki Desk   |   6 Aug 2020 1:30 PM GMT
నేను కూడా సుశాంత్ లా సూసైడ్ చేసుకుంటానేమో అని భయపడుతున్నారు
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు అతని మాజీ మేనేజర్ దిశా సలియన్‌ సూసైడ్ చేసుకోవడంలో హీరో సూరజ్ పంచోలి పాత్ర ఉందని సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అతని గర్ల్ ఫ్రెండ్ జియా ఖాన్ ఆత్మహత్య చేసుకోడానికి కారకుడైన సూరజ్ ఇప్పుడు వీరి మరణానికి కూడా కారణమని నెటిజన్స్ ఆరోపించారు. ఈ క్రమంలో అతనికి దిశాకు సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ జాతీయ మీడియాలో పలు కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూరజ్‌ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.

సూరజ్‌ పంచోలి మాట్లాడుతూ.. దిశా సలియన్‌ అనే అమ్మాయిని తాను ఇంత వరకు ఎప్పుడూ మీట్ అవలేదని.. అనవసరంగా తనను ఈ కేసులోకి లాగుతున్నారని.. మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు వార్తలని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తన మీద జియా ఖాన్ సూసైడ్ కేసు నడుస్తోందని.. దాని వల్ల ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే తనతో వర్క్ చేస్తున్నారని.. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల తన కెరీర్ మరింత నాశనం అవుతుందని సూరజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జియా ఖాన్‌ కేసు 8 సంవత్సరాల నుండి నడుస్తోందని.. తీర్పు మాత్రం ఇంకా వెల్లడించలేదని.. జియా తల్లి రబియా ఖాన్‌ వల్ల ఆలస్యం జరుగుతోందని తెలిపాడు. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా తాను స్ట్రాంగ్ గా సానుకులంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని.. వీటి గురించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడానని.. ఇప్పటికే తన విషయంలో ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని.. వారిని మరింత ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదు అని సూరజ్‌ పేర్కొన్నారు.

అంతేకాకుండా సుశాంత్‌ ఆత్మహత్య గురించి తెలిసి తన తల్లి ఎంతో భయపడిపోయిందని.. నేను కూడా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటానేమోనని ఆందోళన చెందిందని చెప్పుకొచ్చాడు. అందుకే నీ మనసులో ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పు.. ఏం జరిగినా కూడా ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దని తన తల్లి ధైర్యం చెప్పిందని తెలిపాడు. ఇక ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని.. సినిమా అంటే తనకు ఇష్టమని.. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఇక్కడే ఉంటానని సూరజ్ పంచోలి అన్నారు. కొందరు తన జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. మానవత్వం లేనివారు మాత్రమే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారని సూరజ్‌ పంచోలి చెప్పుకొచ్చారు.