Begin typing your search above and press return to search.

గంగూలీకే తుపాకీ గురిపెట్టారు

By:  Tupaki Desk   |   30 Dec 2016 9:17 AM GMT
గంగూలీకే తుపాకీ గురిపెట్టారు
X
గంగూలీ అంటే బెంగాల్ టైగర్.. టీమిండియాకు ధైర్యం, దూకుడు నేర్పిన ఘనత ఆయనదే. ప్రత్యర్థి టీంలు స్లెడ్జింగ్ చేస్తే ఉడుక్కుని సరిగ్గా ఆడలేక ఓడిపోయే టీమిండియా ఆటగాళ్లను రాటుదేలేలా నడిపించిన తొలి డ్యాషింగ్ కెప్టెన్ నిస్సందేహంగా గంగూలీయే. అలాంటి గంగూలీ తలకు ఓ వ్యక్తి తుపాకీ గురిపెట్టాడట. దాంతో గంగూలీ ఆ రోజుతో తన పనైపోయిందని టెన్షన్ పడ్డాడట. కంగారు పడకండి.. ఇది ఇప్పటి ఘటన కాదు, అప్పుడెప్పుడో గంగూలీ కెరీర్ తొలినాళ్లలోని ఘటన. ఆ సంగతి ఇప్పుడు గంగూలీ తన పుస్తకంలో రాసేసరికి అందరికీ తెలిసింది.

టీమిండియా మాజీ కెప్టెన్ - బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. 1996లో తన తొలి టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. సిరీస్ మధ్యలో తన బంధువులను కలిసేందుకు కావెండాష్ నుంచి పిన్నార్ కు లండన్ అండర్ గ్రౌండ్ ట్రెయిన్ లో వెళ్లాడట. అతనితో పాటు సిద్ధూ కూడా ఉన్నాడు. వాళ్లు కూర్చున్న క్యారేజ్ లోనే ఇద్దరు అబ్బాయిలు - ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. వారిలో ఒకడు బీరు తాగి - ఆ క్యాన్ ను వీరిపైకి విసిరేశాడు. దీంతో, సిద్దూ సీరియస్ అయ్యాడు. గంగూలీ వారించినా సిద్దూ తగ్గలేదు. దీంతో - చేసేదేమీ లేక సిధ్దూతో పాటు గంగూలీ కూడా గొడవలోకి దిగాడు. అయితే, ఊహించని విధంగా వారిలో ఒకడు రివాల్వర్ తీసి, గంగూలీ తలకు గురిపెట్టాడు. ఆ సందర్భంతో తన జీవితం ఈ ట్రెయిన్ లోనే ముగిసిపోయిందని గంగూలీ అనుకున్నాడట.

అయితే అదృష్టవశాత్తు ఆ గ్యాంగులోని ఓ అమ్మాయి ఆ అబ్బాయిని వెనక్కి లాగేసిందట. అంతలోనే స్టేషన్ కూడా రావడంతో రైళ్లో నుంచి గంగూలీ, సిద్ధూ ఇద్దరూ దిగిపోయారట. ఆ తర్వాత లండన్ లో ఎప్పుడు తిరగాలని అనిపించినా... కారులోనే తిరిగాడట గంగూలీ. మళ్లీ ట్రైను ఎక్కలేదట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/