Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో సౌత్‌ డైరెక్ట‌ర్స్ హంగామా!

By:  Tupaki Desk   |   10 Sep 2022 6:30 AM GMT
బాలీవుడ్ లో సౌత్‌ డైరెక్ట‌ర్స్ హంగామా!
X
గ‌త కొంత కాలంగా బాలీవుడ్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల‌తో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో డిజాస్ట‌ర్లుగా నిలుస్తుండ‌టంతో బాలీవుడ్ ప‌రిస్థితి అయోమ‌యంగా మారింది. స్టార్ హీరో సినిమా విడుద‌లైన ప్ర‌తీ సారి ఈ సినిమాతో బాలీవుడ్ కు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డుతున్న బాలీవుడ్ మేక‌ర్ల‌కు ఘోర ప‌రాభ‌వం ఎదుర‌వుతూనే వుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తీ బాలీవుడ్ హీరో ఇప్ప‌డు ద‌క్షిణాది డైరెక్ట‌ర్ల‌పై క‌న్నేస్తున్నాడు.

రీసెంట్ గా రాజ‌మౌళి 'RRR' తో. ప్ర‌శాంత్ నీల్ 'కేజీఎఫ్ 2'తో, సుకుమార్ 'పుష్ప‌'తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకోవ‌డంతో వీరితో సినిమాలు చేయాల‌ని బాలీవుడ్ హీరోలు వెంట‌ప‌డుతున్నారు. అంతే కాకుండా ద‌క్షిణాదిలో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ని అందించిన ద‌ర్శ‌కుల‌తో సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే 'అర్జున్‌రెడ్డి' మూవీని హిందీలో 'క‌బీర్ సింగ్‌' పేరుతో షాహీద్ క‌పూర్ తో రీమేక్ చేసి అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న పందీప్ రెడ్డి వంగ ప్ర‌స్తుతం ర‌ణ్ బీర్ క‌పూర్ తో 'యానిమ‌ల్‌' మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

విశ్వ‌క్ సేన్ తో 'హిట్ : ద ఫ‌స్ట్ కేస్‌'మూవీని రూపొందించిన శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్ లో ఇదే మూవీని హిందీలో రాజ్ కుమార్ రావుతో రీమేక్ చేశారు. ఇక 'జెర్సీ' మూవీని టాలీవుడ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో షాహీద్ క‌పూర్ తో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో ఆశించిన విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయాయి. అయినా బాలీవుడ్ హీరోలు మ‌న సౌత్‌ద‌ర్శ‌కుల వైపే చూస్తున్నారు. మ‌న వాళ్ల‌తో సినిమాలు చేయాల‌ని ఆస‌క్తిని చూపిస్తున్నారు.

ఈ క్ర‌మంలో మ‌రిన్న సినిమాలు బాలీవుడ్ లో మ‌న సౌత్ డైరెక్ట‌ర్ల‌తో డైరెక్ష‌న్ లో రూపొందుతున్నాయి. ఈ క్ర‌మంలో పుష్క‌ర్ - గాయ‌త్రి కొన్నేళ్ల క్రితం తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ మూవీ 'విక్ర‌మ్ వేద‌'ను హిందీలో అదే పేరుతో హృతిక్ రోష‌న్‌, సైఫ్ అలీఖాన్ ల‌తో రీమేక్ చేశారు. సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానున్న ఈ మూవీ ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిలోనూ భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కు థీటుగా తెర‌కెక్కిన ఈ మూవీ కోసం యావ‌త్ బాలీవుడ్ మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈఅ సినిమాతో బాలీవుడ్ రూపురేఖ‌లు ఒక్క‌సారిగా మారినా ఆశ్చ‌ర్యం లేద‌న్న‌ది అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

ఇదే ఊపులో మ‌రో సౌత్ ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ తో షారుఖ్ ఖాన్ 'జ‌వాన్‌' పేరుతో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ గ్లింస్ ఇప్ప‌టికే విడుద‌లై సినిమా అంచ‌నాల్ని పెంచేశాయి. ఇక ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో మ‌రో సౌత్ మూవీ రీమేక్ అవుతోంది. సూర్య హీరోగా న‌టించిన మూవీ 'సూరారైపోట్రు'. ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి. ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ స్ఫూర్తితో ఈ మూవీని సుధా కొంగ‌ర తెర‌కెక్కించారు.

అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుద‌లైన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇదే మూవీని సుధా కొంగ‌ర డైరెక్ష‌న్ లో అక్ష‌య్ కుమార్ హీరోగా హీరో సూర్య బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇవ‌న్నీ బాలీవుడ్ కు భారీ విజ‌యాల్ని అందించ‌బోతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు ద‌క్షిణాది ద‌ర్శ‌కులపై ఆస‌క్తిని చూపిస్తుండ‌టం విశేషం. రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ గా మారిన ఆశ్చ‌ర్యంలేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.