Begin typing your search above and press return to search.

నాన్న నా ఫ్రెండ్స్ తో కలిసి ఐపీఎల్ క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేసేవారు!

By:  Tupaki Desk   |   2 Oct 2020 3:00 PM GMT
నాన్న నా ఫ్రెండ్స్ తో కలిసి ఐపీఎల్ క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేసేవారు!
X
ఇటీవల మరణించిన లెజండరీ సింగర్ ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు గాయకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అభిమానులు హాజరై.. ఎస్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ మాట్లాడుతూ తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకొన్నారని భావోద్వేగానికి లోనయ్యాడు. 'ఆయన నాకు నాన్న మాత్రమే కాదు.. ఓ స్నేహితుడి కంటే ఎక్కువ. ఆయనను మరిచిపోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. నాన్న మరణం తర్వాత అందరి దృష్టి నాపై ఉంది. నాపై నాన్న ఎంతో బాధ్యతను పెట్టారు. ఆ బాధ్యతను ఎలా నెరవేరుస్తారనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు' అని చరణ్ తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.

''నాన్న 50 రోజులపాటు మృత్యువుతో పోరాటం చేస్తున్న సమయంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరూ ప్రార్థనలు చేశారు. అందుకు మా కుటుంబం తరఫున ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాన్నగారి సంతాప సభ పెట్టాలని స్నేహితులు నన్ను అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. వారంతా ఆయనపై ఉన్న ప్రేమభిమానాలతో ముందుకు వచ్చారు. నాకంటే ఎక్కువగా వాళ్లు నాన్నతో అనుబంధాన్ని పెంచుకొన్నారు. నాన్నకు క్రికెట్ అంటే ఇష్టం. ముఖ్యంగా ఐపీఎల్ జరిగేటప్పుడు మా ఇంటిలో నా ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూంటే నాన్న కూడా మాతో కలిసేవారు. వారితో సరదగా మ్యాచ్ చూస్తూ హ్యాపీగా ఫీలయ్యేవారు. వయసుతో తేడా లేకుండా కలిసిపోయేవాడు'' అని ఎస్పీ చరణ్ తెలిపారు.

''నాన్న జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించారు. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరికి జీవితాంతం మిగిలిపోయే అనుభూతులు ఆయనతో ఉన్నాయి. నాన్న ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల నా బాల్యంలో ఆయనతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయాను. కానీ ఆయనతో కలిసి ఎక్కువగా స్టేజీలపైనో స్టూడియోలో వద్ద ఎక్కువ సమయాన్ని గడిపాం. మా నాన్న ఏంటో అప్పుడే తెలుసుకొన్నాం. ఇంటిలో కంటే స్టూడియోలలో, స్టేజ్‌లపైనే ఉండటానికి ఆయన ఇష్టపడేవారు'' అని ఎస్పీ చరణ్ తన తండ్రి గురించి చెప్పారు.