Begin typing your search above and press return to search.

వీడియో: సూపర్ కిడ్ సితార చెప్పిన స్పెయిన్ స్టోరీ..!

By:  Tupaki Desk   |   5 Nov 2021 9:33 AM GMT
వీడియో: సూపర్ కిడ్ సితార చెప్పిన స్పెయిన్ స్టోరీ..!
X
సూపర్ కిడ్ సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ దంపతుల ముద్దుల తనయ సితార.. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య‌తో క‌లిసి 'A & S' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఇందులో ఫన్నీ ఛాలెంజెస్ - గేమ్స్ తో పాటుగా ట్రావెలింగ్ స్టోరీలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార స్పెయిన్ స్టోరీ అనే పేరుతో ఓ వీడియోని పంచుకుంది.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్‌ కోసం గత నెలలో చిత్ర బృందం అంతా స్పెయిన్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ తో పాటుగా నమ్రత - గౌతమ్ - సితార హాలిడే కోసం కెళ్లారు. స్పెయిన్‌ లోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను సితార వీడియో రూపంలో పరిచయం చేసింది. ఇందులో మ్యూజియం - పార్క్ - పురాతనమైన చర్చి మొదలైనవి ఉన్నాయి. వీటి గురించి సితార తన ముద్దుముద్దు మాటలతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో వివరించడం ఆకట్టుకుంటుంది.

'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతున్న విధానాన్ని కూడా ఈ వీడియో చివర్లో చూడొచ్చు. డైరెక్టర్ పరశురామ్ ‘యాక్షన్‌ సార్’ అని చెప్పినప్పుడు కెమెరా వెనుక సితార మరియు గౌతమ్ ఉన్నారు. మహేష్ బాబు ఇందులో స్పష్టంగా కనపడనప్పటికీ.. స్పెయిన్ లో తన భార్యా పిల్లలతో ఎంజాయ్ చేసిన ఫోటోలను గమనించవచ్చు.

‘స్పెయిన్ స్టోరీ’ ట్రావెల్ డైరీని షేర్ చేస్తూ “స్పెయిన్‌ నా మనసుకు నచ్చింది. ఇక్కడి ఆహారం, సంస్కృతి, వాస్తుశిల్పం.. అన్నీ అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ సందర్శించడానికి ఇష్టపడతాను” అని లిటిల్ ప్రిన్సెస్ సితార కామెంట్ పెట్టింది. మహేష్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు గోవా డైరీస్ పేరుతో ఆధ్య - సితార షేర్ చేసిన వీడియో అలరించిన సంగతి తెలిసిందే.

కాగా, మహేష్ బాబు - పరాశురామ్ పెట్లా కాంబినేషన్ లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ తో పాటుగా మహేష్ ఫ్యామిలీ హైదరాబాద్‌ కు తిరిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నానని సితార పాప ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది.