Begin typing your search above and press return to search.

'స్పార్క్' షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్.. టాలెంట్ అన్వేషణలో సరికొత్త ఓటీటీ..!

By:  Tupaki Desk   |   21 May 2021 1:30 PM GMT
స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్.. టాలెంట్ అన్వేషణలో సరికొత్త ఓటీటీ..!
X
ఓటీటీ రంగంలో ఇప్పటికే సత్తా చాటుతున్న వేదికలకు ధీటుగా.. ''స్పార్క్'' అనే సరికొత్త ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వచ్చిన సంగతి తెలిసిందే. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోడానికి ఈ ఓటీటీకి శ్రీకారం చుట్టారు. భిన్నమైన కంటెంట్ తో తొలి అడుగే ఘనంగా వేసిన 'స్పార్క్' ఓటీటీ.. ఇప్పుడు ప్రతిభావంతులను గుర్తించే పనిలో పడింది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సహకారంతో షార్ట్2ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తోందీ స్పార్క్.

'కోవిడ్' వైరస్ అంశంపై వర్ధమాన ఫిలిం మేకర్స్ కోసం 'స్పార్క్' 20 లక్షల ప్రైజ్ మనీ అందించేలా ఈ కాంటెస్ట్ ఏర్పాటు చేసింది. 2 నిమిషాల కంటే తక్కువ నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ ఉండాలని.. సెలెక్ట్ అయిన వాటిని స్పార్క్ ఓటీటీలో పబ్లిష్ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పబ్లిష్ అయిన ప్రతి లఘు చిత్రానికి 10 వేలు అందించనున్నారు. ఇందులో అత్యధిక వ్యూస్ రాబట్టిన మొదటి 5 షార్ట్ ఫిలిమ్స్ లో ఫస్ట్ ప్రైజ్ - 5లక్షలు.. సెకండ్ ప్రైజ్ - 4లక్షలు.. థర్డ్ - 3లక్షలు.. ఫోర్త్ - 2లక్షలు.. ఐదో స్థానంలో నిలిచిన లఘు చిత్రానికి 1 లక్ష రూపాయలు ఇవ్వనున్నారు.

అంతేకాకుండా ఈ కాంటెస్ట్ లో టాప్-5 విన్నర్స్ కి 'స్పార్క్' ఓటీటీ ఒరిజినల్ ఫిలిం డైరెక్ట్ చేసే అవకాశం అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. పబ్లిష్ చేసిన పది రోజుల తర్వాత వ్యూస్ ని బట్టి వినర్స్ ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు ఇచ్చారు. మే 25వ తేదీ లోపు ఎంట్రీలను పంపాలని డెడ్ లైన్ పెట్టారు. అయితే కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో జూన్ 5 వరకు గడువు పొడిగిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

''షార్ట్ ఫిల్మ్ పోటీకి కొన్ని అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఎంపిక చేసిన సినిమాలను త్వరలోనే ప్రచురిస్తాం. లాక్‌ డౌన్ ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఎంట్రీల తుది గడువు మే 25 నుండి జూన్ 5 వరకు పొడిగించాలని నిర్ణయించుకున్నాము. జూన్ 15న రిజల్ట్స్ ఇవ్వబడతాయి'' అని ఆర్జీవీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.