Begin typing your search above and press return to search.

పునీత్ కు ట్రీట్ మెంట్ చేసిన ఆసుపత్రికి.. వైద్యుడికి ప్రత్యేక భద్రత

By:  Tupaki Desk   |   7 Nov 2021 12:30 PM GMT
పునీత్ కు ట్రీట్ మెంట్ చేసిన ఆసుపత్రికి.. వైద్యుడికి ప్రత్యేక భద్రత
X
ప్రముఖ నటుడు పునీత్ రాజకుమార్ అనూహ్య మరణం కన్నడ ప్రజల్ని మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లోని ప్రజల మీదా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఎక్కడి దాకానో ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పునీత్ మరణం మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆయన మరణం వేళ.. మీడియాలో ఆయనకు భారీ ప్రాధాన్యతను ఇచ్చారు. నిజానికి నటుడిగా కంటే కూడా.. ఆయనలోని మానవత్వం.. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే మనసు ఆయన గురించి తెలీని వారిని సైతం ఫిదా అయ్యేలా చేయటమే కాదు.. అలాంటి గొప్ప నటుడ్ని బతికి ఉన్న వేళలో తెలుసుకోలేకపోయామన్న ఆవేదన పలువురి నోట వినిపించటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. పునీత్ కు చికిత్స చేసిన ఆసుపత్రికి.. వైద్యుడికి తాజాగా భద్రతను భారీగా పెంచేయటం గమనార్హం. జిమ్ చేస్తూ.. గుండెపోటుకు గురైన పునీత్ తొలుత ఒక ఆసుపత్రికి వెళ్లటం.. అక్కడ పరీక్షలు జరిపి.. వేరే ఆసుపత్రికి పంపటం తెలిసిందే. అక్కడకు చేరుకునే సరికి ఆలస్యమైందన్న మాట వినిపిస్తోంది. తొలుత వెళ్లిన ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం కారణంగానే పునీత్ దూరమయ్యారన్న మండిపాటు పలువురి నోట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. పునీత్ కు వైద్యం అందించిన బెంగళూరులోని సదాశివనగర్ లోని క్లినిక్ వద్ద భద్రతనుపెంచారు. ఇదిలా ఉంటే పునీత్ మరణానికి కారణం వైద్యుడి నిర్లక్ష్యంగా పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనకు వైద్యం చేసిన వైద్యుడు డాక్టర్ రమణరావు వివరణ ఇచ్చారు. గడిచిన 35 ఏళ్లుగా తాను రాజ్ కుమార్ కుటుంబానికి వైద్యం చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. పునీత్ కు వైద్యం చేయటంలో ఎలాంటి లోపం జరగలేదన్నారు.

అక్టోబరు 29న ఉదయం 11.15 గంటల వేళలో పునీత్ తన వద్దకు వచ్చారని.. అప్పటికే ఆయనకు చెమటలు పట్టి ఉన్నట్లు చెప్పారు. ఆ వెంటనే ఆయనకు ఈసీజీ తీశానని చెప్పారు. గుండెపోటు వచ్చిందన్న అనుమానంతో తక్షణం యాంజియోగ్రాం చేయటానికి విక్రం ఆసుపత్రికి వెళ్లాలని చెప్పానని.. అంబులెన్సు కోసం ఆలస్యం చేయకుండా కారులో వెళ్లినట్లుగా చెప్పారు. కేవలం నాలుగైదు నిమిషాల్లోనే ఆసుపత్రికి వెళ్లేలా చేశామని చెప్పారు. పునీత్ కు వైద్యం అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోలేదని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆయన్ను అరెస్టు చేయాలని.. ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాలంటూ కొన్ని సంఘాల వారు నిరసన చేపట్టాలని భావిస్తున్న వేళ.. ఆసుపత్రికి.. వైద్యుడికి రక్షణను మరింత పెంచారు.