Begin typing your search above and press return to search.

బిగ్ డిబేట్‌: క‌ళ‌ను తొక్కేసిన తెలుగు ప్ర‌భుత్వాలు..!

By:  Tupaki Desk   |   23 March 2021 1:30 PM GMT
బిగ్ డిబేట్‌: క‌ళ‌ను తొక్కేసిన తెలుగు ప్ర‌భుత్వాలు..!
X
క‌ళాభిమానం ఒక‌ప్పుడు ఉన్న‌ట్టు ఇప్పుడు లేదా? తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు అస‌లు క‌ళారంగంపై మక్కువ కానీ మ‌మ‌కారం కానీ లేవా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌భుత్వం త‌ర‌పున సాంస్కృతిక శాఖ‌లు ఉన్నా అవేం చేస్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. ప్ర‌త్యేకించి సినీప‌రిశ్ర‌మ‌తో స‌మ‌న్వ‌యం చేసేందుకు సినిమాటోగ్ర‌ఫీ శాఖ ఉన్నా కానీ నిష్ప్ర‌యోజ‌నంగా క‌నిపిస్తోందన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అడ‌పాద‌డ‌పా సినీ పెద్ద‌ల్ని పిలిచి మంత‌నాలు సాగించి ఆన‌క మ‌మ అనిపించేయ‌డం తప్ప సినీవ్య‌వ‌స్థ‌ల ప్ర‌క్షాళ‌న‌కు కానీ.. లేదా పురోభివృద్ధికి కానీ ప్ర‌భుత్వాలు చేస్తున్న‌దేమీ లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

నిజానికి అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇలాంటి స‌న్నివేశం లేదు. నాటి ముఖ్య‌మంత్రులు ఎవ‌రైనా కానీ సినీటీవీ నాట‌క రంగాల‌కు బోలెడంత చేశారు. అడిగింది ఇచ్చారు. ప్రోత్స‌హించారు. అలాగే ప్ర‌భుత్వం త‌ర‌పున నంది అవార్డుల్ని ప్ర‌తియేటా విధిగా ఇచ్చి ఎంక‌రేజ్ చేసేవారు. కానీ ఇప్పుడలా లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్- తెలంగాణ డివైడ్ త‌ర్వాత తెలుగు సినీప‌రిశ్ర‌మ ఆకులో వ‌క్క‌లా కూర‌లో క‌రివేపాకులా మారింది.

అస‌లు ఈ రంగాన్ని ప‌ట్టించుకునేవాళ్లే లేరు. అప్పుడ‌ప్పుడు సినీపెద్ద‌ల‌తో మంత‌నాలు అంటూ ప్ర‌భుత్వాల హ‌డావుడి త‌ప్ప ఇంకేదీ క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ ఉంది. ఇక ఇటీవ‌లే జాతీయ అవార్డులు ప్ర‌క‌టించ‌గానే.. అందులో తెలుగు సినిమాల‌కు ప్రోత్సాహం క‌నిపించింది. అదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్రోత్సాహ‌క అవార్డులేవీ? అన్న ప్ర‌శ్న పుట్టుకొచ్చింది. ఏపీలో య‌థావిధిగా నందులు ఇస్తామ‌న్నారు. తెలంగాణ‌లో పేరు మార్చి సింహా పుర‌స్కారాలు అన్నారు. కానీ ఇవేవీ ఇస్తున్న పాపాన పోలేదు. ఇంత‌కుముందు ఒకేసారి నాలుగైదేళ్ల పెండింగ్ నందులు పంపిణీ చేశారు కానీ ఎవ‌రికీ అంత ఆస‌క్తిగా అనిపించ‌లేదు. అస‌లు అవార్డులు అంటేనే మ‌ర్చిపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప్రతియేటా ఇస్తేనే గౌర‌వం. ప్ర‌తిభావంతుల‌కు గుర్తింపు. ఆల‌స్యంగా ఇచ్చినా వాటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇక‌నైనా నందులు.. సింహా పుర‌స్కారాలు ఇస్తారా లేదా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది.

ఉగాది వ‌స్తోంది. అస‌లింత‌కీ అవార్డులిస్తారా లేదా? వాటిపై ఆలోచించే టైమ్ ఉందా? అస‌లు ప్ర‌భుత్వాల‌కు ఆలోచ‌న ఉందా లేదా? ఉంటే ప్ర‌ణాళిక ఏదీ? అంటూ టాలీవుడ్ ప్ర‌శ్నిస్తోంది. దీనికి ఇరు తెలుగు ప్ర‌భుత్వాల నుంచి స‌మాధానం వ‌స్తుందేమో చూడాలి.