Begin typing your search above and press return to search.

SS రాజ‌మౌళి కంటే స్పీల్ బ‌ర్గ్ రేసులో వెన‌క్కి?

By:  Tupaki Desk   |   22 Jan 2023 5:10 AM GMT
SS రాజ‌మౌళి కంటే స్పీల్ బ‌ర్గ్ రేసులో వెన‌క్కి?
X
RRR 2022లో విమర్శకుల అభిమాన చిత్రంగా మారింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సంచలనం సృష్టించింది. క్రిటిక్స్ స‌హా ట్రేడ్ వ‌ర్గాలు ఈ సినిమా ఫ‌లితాన్ని ప్ర‌శంసించాయి. ప్ర‌పంచ సినీదిగ్గ‌జాలు న‌టీన‌టులు అత్యున్న‌త సాంకేతిక నిపుణులు ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం..క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాల‌ను గెలుచుకోవ‌డ‌మే గాక ఇప్పుడు ఆస్కార్ పోటీ బ‌రిలోను ఈ సినిమా నిలిచింది.

ఈ చిత్రం 2022లో విమర్శకుల అభిమాన చిత్రంగా మార‌డ‌మే గాక‌.. ప్ర‌పంచంలోని మారుమూల ప్ర‌జ‌ల‌ అభిమానాన్ని ద‌క్కించుకుంటొంది.
ఇటీవల ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023లో `నాటు నాటు..` పాట‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును గెలుచుకుంది. ఇది ఆస్కార్స్ 2023కి కూడా షార్ట్ లిస్ట్ అయింది. గత ఏడాది మార్చి 25న విడుద‌లైన ఈ చిత్రం ప‌లు దేశాల్లో విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. తాజాగా స్టీవెన్ స్పీల్ బర్గ్ తెర‌కెక్కించిన `ది ఫాబెల్ మాన్స్‌`ను రేసులో వెన‌క్కి నెట్టి RRR క్రిటిక్స్ జాబితాలో 6వ స్థానాన్ని పొందింది.

2022లో తమకు ఇష్టమైన సినిమాలను షేర్ చేయమని యునైటెడ్ స్టేట్స్ లోని కొంతమంది అగ్ర విమర్శకులను అసోసియేటెడ్ ప్రెస్ (అమెరికా) కోరింది. ఇది సంవత్సరంలోని ఉత్తమ చిత్రాలలో టాప్ 25 లో నిలిచిన చిత్రాల‌కు ర్యాంకింగ్ ను ఇచ్చింది. ఈ జాబితాలో RRR 6వ స్థానాన్ని కైవసం చేసుకోగా.. స్టీవెన్ స్పీల్ బర్గ్ తెర‌కెక్కించిన `ది ఫాబెల్ మాన్స్` 8వ స్థానాన్ని పొందింది. 2022లో విమర్శకుల ఇష్టమైన టాప్ 10 చిత్రాల జాబితాను ప‌రిశీలిస్తే...

ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ - ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వ‌న్స్- Tár -నోప్ (Nope)- ది ఉమెన్ కింగ్ చిత్రాల త‌ర్వాత ఆరో స్థానంలో RRR నిలిచింది. ఆ త‌ర్వాత టామ్ క్రూజ్ టాప్ గ‌న్ - మూవ‌రిక్ - ది ఫెబుల్ మ్యాన్స్- ఉమెన్ టాకింగ్ -గ్లాస్ ఆనియ‌న్: ఏ నైవ్స్ ఔట్ మిస్ట‌రీ చిత్రాలు టాప్ 10లో నిలిచాయి. స్పీల్ బర్గ్ తెర‌కెక్కించిన `ది ఫాబెల్ మాన్స్` 8వ స్థానానికి ప‌రిమితమైంది. అంటే రాజ‌మౌళి- ఆర్.ఆర్.ఆర్ కంటే మ‌రో రెండు స్థానాలు వెన‌క‌బ‌డింది. ఆ విధంగా స్పీల్ బ‌ర్గ్ కంటే రాజ‌మౌళి పేరు ఒక మెట్టు పైన క‌నిపించింది.

అయితే స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ తో ఏ ఇత‌ర ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడిని పోల్చ‌లేం. అత‌డు హాలీవుడ్ దిగ్గ‌జం. అసాధార‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన మ‌హా మేధావి. సాంకేతికంగా అత్యుత్త‌మ టెక్నాల‌జీని 80ల‌లోనే ప‌రిచ‌యం చేసిన మ‌హ‌నీయుడు. జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీతో అత‌డు చేసిన వండ‌ర్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్ప‌టికీ స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ చిత్రాలు సృష్టించిన రికార్డుల గురించి అమెరికా స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు నిరంత‌రం ముచ్చ‌టించుకుంటూనే ఉంటారు. ఇక నేటిత‌రం ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి అలాంటి వారి నుంచి స్ఫూర్తి పొంది సినిమాల‌ను రూపొందిస్తున్నారు. అయితే అంత పెద్ద ద‌ర్శ‌కుడి చెంత నిల‌చి ఇప్పుడు రాజ‌మౌళి మ‌న దేశ గౌర‌వాన్ని పెంచార‌న‌డంలో సందేహం లేదు. మేటి తెలుగు ప్ర‌తిభావంతుడు జ‌క్క‌న్న‌కు `తుపాకి` ప్ర‌త్యేకించి హ్యాట్సాఫ్ చెబుతోంది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.