Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఫైల్స్ మీద దుష్ప్రచారం షురూ చేశారోచ్

By:  Tupaki Desk   |   19 March 2022 5:30 AM
కశ్మీర్ ఫైల్స్ మీద దుష్ప్రచారం షురూ చేశారోచ్
X
ఉన్నది ఉన్నట్లుగా తీయలేక.. జరిగిన దారుణ మారణకాండను కళ్లకు కట్టినట్లుగా తీయకుండా.. దాని తీవ్రతను దాదాపు తొంభై శాతం తగ్గించేసి సినిమా తీస్తేనే ఇంత యాగి చేస్తున్నకొందరు.. జరిగింది జరిగినట్లుగా తీస్తే అసలేమవుతారు? మరెంత ఆగమాగం అవుతారో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. కశ్మీర్ ఫైల్స్ మూవీకి లభిస్తున్న ఆదరణ దేశంలోని కొన్ని వర్గాలకు అస్సలు నచ్చట్లేదు. నిత్యం సిద్ధాంతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడే ఇలాంటి బ్యాచ్.. తామున్న రంగంలో అత్యున్నతస్థాయిలో ఉండి.. అందరిని ప్రభావితం చేసేలా ఉంటారు.

ఇలాంటి వారి నోటి నుంచి నిత్యం సమానత్వం.. ప్రజాస్వామ్యం.. లౌకికవాదం.. లాంటి సూడో మాటలు.. సూడో సిద్ధాంతాల్ని నిత్యం వల్లెవేస్తుంటారు. ఇలాంటి బ్యాచ్ కు కశ్మీర్ ఫైల్స్ పెద్ద విషయంగా మొదట్లో అనిపించలేదు. అందుకే.. సినిమా విడుదలైన నాలుగు రోజుల వరకు ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఎప్పుడైతే ఈ మూవీ ఒక సంచలనంగా మరి.. అందరూ దీని గురించి మాట్లాడుకునే చేయటమే కాదు.. కశ్మీరీ పండిట్లకు జరుగుతున్న అన్యాయం గురించి కన్నీళ్లు పెట్టుకుంటున్న వారెందరో.

ఈ అసమాన కదలికను చూసిన కొన్ని శక్తులు.. అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే సరికొత్త సిద్ధాంతాన్ని తెర మీద తెచ్చేందుకు గడిచిన నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఈ సిద్ధాంతం సిద్ధమైంది. దీని ప్రకారం చూస్తే.. కశ్మీర్ ఫైల్స్ ను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సినిమాను తనకు తోచినట్లుగా దర్శకుడు తీశాడని.. విషయం కంటే కూడా ఎక్కువగా దర్శకుడి 'అతి' ఉందన్న అనవసర వ్యాఖ్యతో పాటు.. వాస్తవానికి మించిన కల్పితాలు.. అసత్యాలే ఎక్కువగా చూపించినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

తమ ప్రచారానికి అనుగుణంగా.. ఈ సినిమాకు రాజకీయ మరకను అంటించేస్తూ.. సరికొత్త కుట్రకు తెర తీస్తున్నారు. తమ వాదనకు బలం చేకూరేలా వారు నిందల్ని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా టీంను ప్రధాని నరేంద్ర మోడీ పిలిచి.. వారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తే.. ఈ మూవీ బీజేపీ స్పాన్సర్డ్ సినిమాగా ప్రచారం చేయటం గమనార్హం. ఈ సినిమాకు వస్తున్న అపూర్వ ఆదరణ నేపథ్యంలో.. దీన్ని ఏదోలా చెడగొట్టాలన్న లక్ష్యంతో కొత్త తరహా ప్రచారాన్ని షురూ చేశారు.

అలాంటి వారికి బుర్రలో కాస్తంత గుజ్జు ఉందని నమ్మేటోళ్లు..సిద్ధాంతాలు.. ఆదర్శాల పేరుతో సమాజాన్ని.. అమాయకప్రజల్ని తరచూ కన్ఫ్యూజ్ చేసే బ్యాచ్ ఇప్పుడు రంగంలోకి దిగింది. కశ్మీర్ ఫైల్స్ మూవీని వీలైనంత బద్నాం చేసే చర్యలు షురూ అయ్యాయి. మరి.. వీటిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కాలమే డిసైడ్ చేయాలి.

ఏమైనా.. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన వేళ.. ఏదోలా దాన్ని దెబ్బ తీయటం.. సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేయాలన్న కొత్త కమిట్ మెంట్ తో రంగంలోకి దిగిన కుహనా మేధావుల ఆటలు సాగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే.. రాక రాక వచ్చిన ఒక సినిమాతోనే అంతమై.. చరిత్రలో కప్పేసిన సత్యాలు బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోవాలన్నదే లక్ష్యమన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పకతప్పదు.