Begin typing your search above and press return to search.
వరల్డ్ వైడ్ గా 'టాప్' లేపిన ‘స్క్విడ్ గేమ్’..!
By: Tupaki Desk | 6 Nov 2021 4:10 AM GMTకరోనా సమయంలో అందరికీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి రావడంతో.. మన దేశంలో కూడా వెబ్ కంటెంట్ కు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. భాషతో ఓటీటీ వేదికతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్ లు చూస్తున్నారు. ఇటీవల ‘మనీ హీస్ట్’ (లే కాసా డి పాపెల్) సిరీస్ ను ఆదరించిన జనాలు.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ''స్క్విడ్ గేమ్'' సిరీస్ ను తెగ చూసేస్తున్నారు. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ జరుగుతోంది.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ''స్క్విడ్ గేమ్'' వెబ్ సిరీస్.. విడుదలైన అన్ని దేశాల్లోనూ నెం.1గా కొనసాగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువమంది చూసిన సిరీస్ ఇదేనని ఓటీటీ దిగ్గజం ప్రకటించింది. నీల్సన్ స్ట్రీమింగ్ కంటెంట్ రేటింగ్ ల ర్యాంకింగ్ ల ప్రకారం, అక్టోబర్ 4వ వారం వ్యూవర్ షిప్ లో మొత్తం నిమిషాల్లో ఈ టీవీ సిరీస్ 3 బిలియన్ల నిమిషాలతో అగ్రస్థానంలో ఉంది. దీనిని బట్టే ఈ దక్షిణ కొరియా సర్వైవల్ డ్రామా ఏస్థాయిలో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
''స్క్విడ్ గేమ్'' వెబ్ సిరీస్ ను దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించారు. 2009లోనే ఈ కథ రాసుకున్న దర్శకుడు.. దీన్ని థ్రిల్లర్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పదేళ్లు కష్టపడ్డారని తెలుస్తోంది. ఆర్థిక పరమైన కష్టాలతో పాటుగా ఈ స్క్రిప్ట్ ని ఏ స్టూడియో వారు యాక్సెప్ట్ చేయకపోవడం దీనికి కారణాలు. అయితే కరోనా టైం లో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. తొమ్మిది ఎపిసోడ్స్ ఉండే సిరీస్ గా హ్వాంగ్ డాంగ్ తీర్చిదిద్దారు.
'స్క్విడ్ గేమ్' కథ విషయానికొస్తే.. జీవితంలో సర్వస్వం కోల్పోయి అప్పుల పాలైన కొందరు వ్యక్తులు.. ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్ లైట్ - గ్రీన్ లైట్ - టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లల ఆటల పోటీలు నిర్వహిస్తారు. మొత్తం ఆరు పోటీలుండే ఈ ఆటలో చివరిదే ‘స్క్విడ్ గేమ్’. ఇది సౌత్ కొరియాలో పాపులర్ ఆయిన చిన్నపిల్లల గేమ్. ఈ ఆరు ఆటల్లో గెలిచిన వారు 39 మిలియన్ డాలర్లు (45.6 బిలియన్ కొరియన్ వన్) గెలుచుకోవచ్చు. ఇవన్నీ సులభమైన ఆటలే.. కాకపోతే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ఆటలో ఓడిపోయిన వారు పోటీ నుంచే కాదు.. జీవితం నుంచే శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. అంటే ఓడిపోతే చంపేస్తారన్నమాట. మొదటి ఆట ఆడి ముందుకు వెళితే కానీ ఈ విషయం వారికి తెలియకపోవడం ఇక్కడ గమనార్హం.
ప్రాణాంతకమైన స్క్విడ్ గేమ్ ఆటలను విజయవంతగా పూర్తిచేసుకొని చివరకు ఎవరు విజేతగా నిలిచారనేది చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిలియనీర్లు ఈ హింసాత్మక పోటీని తమ వినోదం కోసం ఒక రహస్య దీవిలో నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనే పోటీదారులకు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో సమస్య, కష్టనష్టాలు ఉంటాయి. డబ్బులు ఆశ చూపించి వారిని పావులు మార్చి.. ఆటలో కొట్టుకుని చస్తుంటే చూసి సంపన్నులు ఆనందిస్తుంటారు.
'స్క్విడ్ గేమ్' సిరీస్ సమాజంలోని అంతరాలను.. డబ్బున్న వారికి పేదవారికి మధ్య వ్యత్యాసాలను చూపిస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోతున్న మనుషుల నిజస్వరూపాన్ని కూడా తెరపై ఆవిష్కరించింది. ఇందులోని పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషులుగా ఉండడం కూడా ఈ సిరీస్ విజయానికి మరో కారణం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం - స్నేహం - మోసం - త్యాగం వంటి అంశాలతో ఒక ఎమోషనల్ జర్నీగా ఈ వెబ్ సిరీస్ సాగింది. ఉత్కంఠ భరితమైన కథనంతో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది. అందుకే మన దేశంలో కూడా ఓటీటీ కంటెంట్ లో టాప్ లో కొనసాగుతుంది. ఈ సిరీస్ క్లైమాక్స్ ని బట్టి 'స్క్విడ్ గేమ్' కు సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. మరి ఈ సెన్సెషనల్ సిరీస్ కు కొనసాగింపుగా త్వరలో రెండో సీజన్ కూడా వస్తుందేమో చూడాలి.