Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణుకు నటన రాదా?

By:  Tupaki Desk   |   24 March 2018 8:15 AM GMT
శ్రీవిష్ణుకు నటన రాదా?
X
నటుడిగా మంచి పేరే తెచ్చుకున్నాడు కదా.. శ్రీవిష్ణును పట్టుకుని అంత మాట అనేశారేంటి అంటారా..? ఐతే ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా చూసిన వాళ్లెవ్వరూ అతను బాగా నటించాడని అనట్లేదు మరి. రుద్రరాజు సాగర్ అనే పాత్రలో అతను జీవించాడనే అంటున్నారు. కొందరైతే సినిమాలో శ్రీవిష్ణు ఎక్కడున్నాడు రుద్రరాజు సాగర్ కదా ఉన్నాడు అంటున్నారు. ఇవేమీ అతిశయెక్తులు కాదు. నిజంగా ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఇలా ఏదో ఒక ఫీలింగ్ కలిగితే ఆశ్చర్యమేమీ లేదు. చదువు సరిగా అబ్బని.. సంప్రదాయాల ఛట్రంలో ఇమడని కుర్రాడి పాత్రలో శ్రీవిష్ణు అంత గొప్పగా నటించాడు మరి.

‘నీదీ నాదీ ఒకే కథ’ సంగతలా ఉంచి కొంచెం వెనక్కి వెళ్దాం. ‘మెంటల్ మదిలో’లో ప్రతిదానికీ కన్ఫ్యూజ్ అయ్యే అరవింద్ కృష్ణగా అతను ఎంత బాగా చేశాడు? అంతకుముందు ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో రైల్వే రాజుగా ఎలా ఒదిగిపోయాడు? ఆ సినిమాల్లో పాత్రలు కనిపించాయి తప్ప శ్రీవిష్ణు కనిపించాడా? ఇలా పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకుని.. వాటిలో ఒదిగిపోయి ఆ పాత్రలే తప్ప నటుడు కనిపించకుండా చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇందులో విష్ణు ఆరితేరిపోయినట్లున్నాడు. ఇవన్నీ సమాజంలోంచి పుట్టిన పాత్రలు. సామాన్యంగా కనిపిస్తూనే చాలా టిపికల్‌గా కనిపించే ఈ పాత్రలు చేయడానికి శ్రీవిష్ణు ఫస్ట్ ఛాయిస్ అయిపోతున్నాడు. కాకపోతే హీరోగా శ్రీవిష్ణు తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. అతడి సినిమాలు కమర్షియల్ గానూ విజయవంతమైతే ఇలాంటి మరిన్ని మంచి పాత్రలు.. సినిమాలు చేయడానికి అవకాశముంటుంది. ఆ దిశగా ‘నీదీ నాదీ ఒకే కథ’ ముందడుగు అవుతుందేమో చూద్దాం.