Begin typing your search above and press return to search.

మహేష్ బాబుకి శ్రీరెడ్డి పంచ్

By:  Tupaki Desk   |   19 April 2018 5:58 AM GMT
మహేష్ బాబుకి శ్రీరెడ్డి పంచ్
X

మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమా రిలీజవుతోందంటే.. రిలీజ్ ముందు రోజు హంగామా ఎలా ఉంటుందో చెప్పేదేముంది? అందులోనూ ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివతో కలిసి మహేష్ చేసిన సినిమా ‘భరత్ అనే నేను’. దీనిపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. దీని టీజర్.. ట్రైలర్.. పాటలు అన్నీ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. ఇంత హైప్ ఉన్న సినిమా గురించి రిలీజ్ ముందు రోజు అసలు డిస్కషన్ అన్నదే లేకపోవడం విచిత్రం. ప్రస్తుతం ఏ టీవీ ఛానెల్ పెట్టినా.. ఏ వెబ్ సైట్ చూసినా.. సోషల్ మీడియాను పరిశీలించినా.. ఎక్కడ చూసినా టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మీదే డిస్కషన్ నడుస్తోంది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను తిట్టడంతో కొత్త మలుపు తిరిగిన వివాదం.. ఇందులోకి రామ్ గోపాల్ వర్మ పేరు రావడంతో మరో మలుపు తీసుకుంది.

శ్రీరెడ్డితో తానే పవన్ ను బూతు మాట అనిపించినట్లు చెప్పడంతో వివాదం మరో స్థాయికి చేరుకుంది. మరోవైపు శ్రీరెడ్డి.. తమన్నా అనే జూనియర్ ఆర్టిస్టుతో మాట్లాడిన ఆడియో టేపు కూడా బయటికి వచ్చింది. మొన్నటిదాకా ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా ఉన్న సినీ ప్రముఖులు ఇప్పుడు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జీవిత.. నాగబాబు.. అల్లు అరవింద్.. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దవాళ్లు స్పందించారు. ముఖ్యంగా ఇప్పుడు వర్మ తన తప్పును ఒప్పుకుంటూ రిలీజ్ చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. నిన్నటి అర్ధరాత్రి నుంచి ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఈ వేడిలో మహేష్ సినిమా గురించి ఎక్కడా పెద్దగా డిస్కషన్ లేదు. సినిమాకు బుకింగ్స్ బాగానే అవుతున్నాయి కానీ.. రిలీజ్ ముంగిట వేరే వ్యవహారాలు మీడియాను కమ్మేసి దీని గురించి డిస్కషన్ లేకపోవడం ప్రతికూల విషయమే. మరి రేపు సినిమా రిలీజ్ తర్వాతైనా వేరే టాపిక్స్ పక్కకు పోయి ఈ సినిమా వార్తల్లో నానుతుందేమో చూడాలి.