Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి.. కార్డిస్తే ఒకలా.. కార్డివ్వకపోతే ఇంకోలా..

By:  Tupaki Desk   |   4 May 2018 4:04 AM GMT
శ్రీరెడ్డి.. కార్డిస్తే ఒకలా.. కార్డివ్వకపోతే ఇంకోలా..
X
కొంత విరామం తర్వాత శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నిన్న తన లాయర్లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి .. పరిశ్రమలో తనకు అన్యాయం చేసిన వాళ్లందరిమీదా న్యాయ పోరాటం చేయబోతున్నట్లు శ్రీరెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన వాళ్లను కూడా వదలబోనని ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రెస్ మీట్ తో హల్ చల్ చేసిన ఒక్క రోజులో శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ కార్యాలయానికి వచ్చింది. ‘మా’లో సభ్యత్వం కోసం డబ్బులు కట్టింది. ఇంతకుముందు సభ్యత్వం కోసం అప్లికేషన్ తీసుకున్న శ్రీరెడ్డి.. డబ్బులు కట్టకపోవడంతో సభ్యత్వం ఇవ్వలేకపోయామని ‘మా’ పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. దీని గురించి శ్రీరెడ్డి ఆసక్తికర రీతిలో స్పందించింది.

‘మా’ వాళ్లు అడిగిన మూటను తాను కట్టేశానని.. చెక్కు ఇచ్చేశానని.. సభ్యత్వం కోసం మరో దరఖాస్తు నింపాల్సి ఉందని ఆమె చెప్పింది. ఆ ఫామ్ అడిగితే.. ‘మా’ సభ్యులు విదేశాల్లో ఉన్నారని.. ఇంకో ఐదారు రోజుల్లో ఇండియాకు వస్తారని.. అప్పుడు ఇస్తామని చెప్పారని వెల్లడించింది. ‘మా’లో తనకు సభ్యత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసింది. ఐతే సభ్యత్వ కార్డు ఇస్తే మా సభ్యురాలిగా తన పోరాటం ఒక తరహాలో ఉంటుందని ఆమె అంది. సభ్యత్వం ఇవ్వని పక్షంలో అందుకు తగ్గట్లే మరోలా పోరాడతానని అంది. ఎలాగైనా సరే.. ఇండస్ట్రీని తాను వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. శ్రీరెడ్డి హెచ్చరికల నేపథ్యంలో మరి ‘మా’ ఎలా స్పందిస్తుందో చూడాలి.