Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్.. తమ్మారెడ్డితో శ్రీరెడ్డి గొడవ

By:  Tupaki Desk   |   1 April 2018 2:30 PM GMT
కాస్టింగ్ కౌచ్.. తమ్మారెడ్డితో శ్రీరెడ్డి గొడవ
X
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోంది శ్రీరెడ్డి. అవకాశాలిస్తామని ఆశ చూపి చాలామంది తనను వాడుకుని మోసం చేశారని.. వాళ్లందరి పేర్లూ బయటపెడతానని ఆమె హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇంతలోనే సీనియర్ దర్శకుడు తేజ శ్రీరెడ్డిని పిలిచి.. ఆమెకు రెండు సినిమాల్లో అవకాశాలిస్తానని ప్రకటించడంతో ఆమె సైలెంటవుతుందని అంతా అనుకున్నారు. కానీ శ్రీరెడ్డి ఏమీ ఇంకా తగ్గట్లేదు. తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి చర్చలో పాల్గొంది శ్రీరెడ్డి. ఈ సందర్భంగా ఆమెకు.. తమ్మారెడ్డికి వాడివేడిగా చర్చ సాగింది.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవమైతే ఎందుకు అందరూ బయటికి వచ్చి విషయం చెప్పట్లేదని తమ్మారెడ్డి ప్రశ్నించగా.. భయంతోనే హీరోయిన్లు నోరు విప్పట్లేదంటూ ఆయనకు గట్టిగా సమాధానం చెప్పింది శ్రీరెడ్డి. ఒక హీరోయిన్ బయటికి వచ్చి విషయం చెబితే.. ఈ అమ్మాయిని పెట్టుకుంటే సమస్యలని చెప్పి నిర్మాతలు తర్వాత అవకాశం ఇవ్వరని.. ఈ భయంతోనే అందరూ సైలెంటుగా ఉంటున్నారని శ్రీరెడ్డి చెప్పింది. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో చాలా పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారని.. వాళ్ల గురించి ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే అవి బయటపెడతామని శ్రీరెడ్డి చెప్పడం గమనార్హం. ఇక చాలామంది నిర్మాతలు స్టూడియోల్లోనే అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారని.. అవి స్టూడియోలు కాదని బ్రోతల్ హౌజ్ లని ఆమె అంది. బ్రోతల్ హౌజ్ అనే మాట చాలా పెద్దదని తమ్రెడ్డి అనగా.. మీకు ఈ విషయాలు తెలియవు.. ఇలాంటి వాటితో నలిగిపోయిన వాళ్లం తామని.. అన్నీ ఆధారాలతో బయటపెడతానని శ్రీరెడ్డి అంది. సినిమా హీరోయిన్లు సెట్లో ఉన్నపుడు పాప అంటారని.. కానీ ఆమె వెళ్లాక వాళ్ల గురించి బూతులు మాట్లాడతారని శ్రీరెడ్డి చెప్పింది.