Begin typing your search above and press return to search.

డబ్బింగ్ చెప్పినందుకు కోటి రూపాయలా?

By:  Tupaki Desk   |   9 Sep 2015 2:24 PM GMT
డబ్బింగ్ చెప్పినందుకు కోటి రూపాయలా?
X
ఎంత పేరు మోసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా సరే.. ఒక సినిమాకు కోటి రూపాయలు పారితోషకంగా తీసుకుంటారా? కనీసం ఇందులో సగం తీసుకున్న ఆర్టిస్టు అయినా ఉన్నారా? సందేహమే. అయితే ఈ విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి సిద్ధమవుతోంది అలనాటి అందాల తార శ్రీదేవి. ఇండియాలో ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పినందుకు అత్యధికంగా కోటి రూపాయల పారితోషకం అందుకోబోతున్న తారగా ఆమె రికార్డు సృష్టించబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా.. సౌత్ సినిమాల్లోకి దాదాపు దశాబ్దంన్నర తర్వాత శ్రీదేవి రీఎంట్రీ ఇవ్వబోతున్న ‘పులి’. ఈ సినిమాలో శ్రీదేవి రాణిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో అక్టోబరు 1న భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజవబోతోంది.

అదే రోజు తెలుగులోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐతే విజయ్ గత సినిమాల్లాగా తెలుగు వెర్షన్ విషయంలో లైట్ తీసుకోవట్లేదు. చాలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అందుకే శ్రీదేవితో తెలుగులో డబ్బింగ్ చెప్పించి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలని భావిస్తున్నారు. ఐతే ఇందుకోసం ఆమె ఏకంగా కోటి రూపాయల పారితోషకం డిమాండ్ చేసిందట. ఐతే తెలుగు నిర్మాతలు ఆ విషయంలో పెద్దగా సంకోచించట్లేదని సమాచారం. శ్రీదేవి వాయిస్ కు ఉన్న క్రేజ్ ఏంటో తెలుసు కాబట్టి.. ఆమె డబ్బింగ్ చెబితే సినిమాకు బాగా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఓకే చెప్పేశారట. త్వరలోనే శ్రీదేవి డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. విజయ్ సరసన హన్సిక, శ్రుతి హాసన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో సుదీప్ మరో కీలక పాత్ర పోషించాడు. చింబుదేవన్ దర్శకత్వం వహించాడు.