Begin typing your search above and press return to search.

ఆమె.. నిజంగానే అతిలోక సుంద‌రే!

By:  Tupaki Desk   |   25 Feb 2018 4:46 AM GMT
ఆమె.. నిజంగానే అతిలోక సుంద‌రే!
X
ఇంత‌క‌న్నా ద‌రిద్రపు వీకెండ్ ఉండ‌దేమో! అంతేమ‌రి.. కోట్లాది మంది ఎంతో అభిమానించి.. ఆరాధించే అతిలోక సుంద‌రి శ్రీ‌దేవిని దేవుడు తీసుకెళ్లిపోయాడంటే ఎవ‌రికి మాత్రం బాధ ఉండ‌దు. వీకెండ్ జోష్ లో అల‌సి.. ఉద‌యం కాస్త ఆల‌స్యంగా లేచిన వారి నిద్ర‌మ‌త్తు క్ష‌ణాల్లో ఎగిరిపోయే న్యూస్ విన్నంత‌నే షాక్. ఆ పై శోకం. దేవుడా.. మా శ్రీ‌దేవిని తీసుకెళ్లిపోతావా? అన్న విలాపం. ఈ వీకెండ్ కు మ‌రింకేమీ చేయ‌లేని బాధ‌.

శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త సినిమాను అభిమానించి.. ఆరాధించే వారికి మాత్ర‌మే కాదు.. అంద‌రిని క‌లిచివేసేది. ఎందుకంటే.. శ్రీ‌దేవి సినిమా న‌టి మాత్ర‌మే కాదు. ఆమె.. కోట్లాది మంది జీవితంలో భాగం. తెలుగు నేల మీద చాలామంది శ్రీ‌దేవి పేరుతో క‌నిపిస్తుంటారు.ఈ పేరు పెట్ట‌టానికి వెనుక అతిలోక సుంద‌రి మీద ఆరాధ‌న‌.. ఇష్టం.. అంత‌కు మించి ఆమె పుణ్య‌మా అని శ్రీ‌దేవి పేరుకు వ‌చ్చిన క్రేజే కార‌ణం. ఈ కార‌ణంగానే తెలుగు నేల మీద ఎంద‌రో శ్రీ‌దేవులు నిత్యం క‌నిపిస్తుంటారు.

దాదాపు నాలుగు ద‌శాబ్దాల క్రితం సంచ‌ల‌నంగా మారిన ఆమె పేరు.. ఇప్ప‌టికీ ఆ పేరు త‌న ఛ‌రిష్మాను కోల్పోకుండా ఉండ‌టం అతిలోక సుంద‌రికి మాత్ర‌మే త‌గ్గుతుంది.

య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు అందంగా ఉండ‌టం ఎవ‌రికైనా సాధ్య‌మే. ఫార్టీస్ లోనూ పెద్ద విష‌యం కాదు. ఫిఫ్టీ ప్ల‌స్ లోనూ ధ‌ర్టీస్ మాదిరి లావ‌ణ్యంతో మెరిసిపోవ‌టం శ్రీ‌దేవికి మాత్ర‌మే సొంతం. అతిలోక సుంద‌రిగా అంద‌రికి సుప‌రిచితురాలైన ఆమె.. నిజంగానే అతిలోక సుంద‌రి. కావాలంటే ఆమె అంతిమ‌క్ష‌ణాల్ని చూస్తే ఈ విష‌యం నిజ‌మేన‌నిపించ‌క మాన‌దు.

పెళ్లి వేడుక‌లో ఆనందంగా న‌వ్వుతూ.. తుళ్లుతూ.. ఫిష్టీస్ లోనూ త‌న అందంతో త‌న చుట్టూ ఉన్న వేదిక వెలుగులు చిమ్మే శ్రీ‌దేవి.. దేవ‌దేవుడు పిలిస్తే.. ఉలిక్కిప‌డి.. వ‌స్తున్నా ప్ర‌భు అంటూ వెళ్లిన‌ట్లుగా అనిపించ‌క మాన‌దు.

చాలామంది పుడుతుంటారు.. చ‌నిపోతుంటారు. కానీ.. శ్రీ‌దేవి మాదిరి మాత్రం కానేకాదు. పుట్టుక సంగ‌తి ప‌క్క‌న పెడితే.. శ్రీ‌దేవి మ‌ర‌ణం లాంటిది కోట్ల మందిలో ఒక్క‌రికి కూడా సాధ్యం కాదేమో.పెళ్లి వేడుక‌కు ముస్తాబై. అందానికి కొత్త అందాన్నిస్తూ.. హ్యాపీగా న‌వ్వుతూ ఉన్న ఆమె కార్డిక్ అరెస్ట్‌ కు గురి కావటం.. క్ష‌ణాల్లో ఆమె కోట్లాది మందిని విడిచి పెట్టి వెళ్లిపోయిన తీరు చూసినప్పుడు.. మ‌న శ్రీ‌దేవి అస‌లుసిస‌లు అతిలోక సుంద‌రే అనిపించ‌క మాన‌దు. దేవుడు విశ్రాంతి తీసుకునే వేళ‌.. భూమ్మీద‌కు అందమంటే ఎలా ఉంటుందో ప‌రిచ‌యం చేసేందుకు పంపించి ఉంటాడు. తాను నిద్ర లేచిన వెంట‌నే.. త‌న అందాన్ని వెన‌క్కి పిలిచేసి ఉంటాడు. లేక‌పోతే.. అతిలోక సుంద‌రి అంత హ‌టాత్తుగా మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్లిపోవ‌టం ఏమిటి..?