Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : శ్రీదేవి సోడా సెంటర్

By:  Tupaki Desk   |   27 Aug 2021 9:36 AM GMT
మూవీ రివ్యూ : శ్రీదేవి సోడా సెంటర్
X
మూవీ రివ్యూ : 'శ్రీదేవి సోడా సెంటర్'

నటీనటులు: సుధీర్ బాబు-ఆనంది-నరేష్-పావెల్ నవగీతన్-హర్షవర్ధన్-రఘుబాబు-సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్
నిర్మాతలు: విజయ్ చిల్లా-శశి దేవిరెడ్డి
రచన-దర్శకత్వం: కరుణ్ కుమార్

మహేష్ బాబు బావగా సినిమాల్లోకి అడుగు పెట్టినా నటుడిగా ప్రతిభ చాటుకుని తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు.. ‘పలాస 1976’ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి పేరు సంపాదించిన కరుణ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మొదట్నుంచి ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

సూరిబాబు (సుధీర్ బాబు) గోదావరి ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే కుర్రాడు. అతను ఒక జాతరలో శ్రీదేవి (ఆనంది) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు శ్రీదేవి కూడా అతణ్ని ప్రేమిస్తుంది. కానీ వేరే కులానికి చెందిన సూరిబాబుతో శ్రీదేవి పెళ్లి చేయడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టముండదు. ఇదిలా ఉంటే సూరిబాబు అనుకోకుండా ఒక హత్య కేసులో చిక్కుకుని జైలు పాలవుతాడు. దీంతో అతడికి శ్రీదేవి దూరమవుతుంది. ఇక్కడి నుంచి సూరి.. శ్రీదేవిల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి.. చివరికి ఏమైందన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

సినిమాల్లో ప్రేమకథలకు ప్రధానంగా కనిపించే అడ్డంకి.. కులం. తెలుగులో ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. ఐతే ఈ సమస్యను వాస్తవికంగా.. హార్డ్ హిట్టింగ్ గా చూపించిన సినిమాలు మన దగ్గర చాలా తక్కువ. తమిళంలో.. మలయాళంలో సమస్యను చర్చించే తీరు చాలా లోతుగా ఉంటుంది. ప్రేక్షకులు కదిలిపోయేలా.. వాళ్లను చాలా కాలం వెంటాడేలా.. ఆలోచనకు గురి చేసేలా అక్కడ కులాంతర ప్రేమకథల్ని తెరకెక్కిస్తుంటారు. తమిళంలో రెండేళ్ల కిందట వచ్చిన ‘పరియేరుం పెరుమాళ్’ సినిమాలో ఈ నేపథ్యంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటి. అందులో కథానాయికగా నటించిన తెలుగమ్మాయి ఆనంది ‘శ్రీదేవి సోడా సెంటర్’లో శ్రీదేవిగా కనిపించడం విశేషం. కథ పరంగా కూడా ఆ సినిమాను చాలా వరకు గుర్తు చేస్తుంది ‘శ్రీదేవి సోడా సెంటర్’. కానీ దానికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనుకరణలా అనిపిస్తుందే తప్ప ఇందులో కొత్తగా చూపించిన విషయాలేమీ లేవు. ప్రస్తుత కాలంలో నడిచే కథ అయినప్పటికీ.. చాలా ఏళ్ల కిందటి ‘పాత’ సినిమాలో కనిపించడం ‘శ్రీదేవి సోడా సెంటర్’లో కనిపించే అతి పెద్ద లోపం. కథ.. కథనం.. సన్నివేశాలు.. ఇలా ఎందులోనూ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ‘పలాస’తో మెప్పించిన కరుణ్ కుమార్.. ఈసారి కేవలం చివర్లో వచ్చే హార్డ్ హిట్టింగ్ ట్విస్టును నమ్ముకుని మిగతా అంతా రొటీన్ సన్నివేశాలతో నింపేయడం నిరాశకు గురి చేస్తుంది.

‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా ప్రమోషన్లలో ఇటు హీరో సుధీర్ బాబు.. అటు దర్శకుడు కరుణ్ కుమార్ ఇద్దరూ కూడా.. మలయాళం-తమిళ సినిమాల ప్రస్తావన తీసుకొచ్చి తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే సినిమా ఇదవుతుందని ఘంటాపథంగా చెప్పారు. ఐతే ‘పలాస’లో కుల సమస్యను ఎంతో లోతుగా.. హృద్యంగా ప్రెజెంట్ చేసిన కరుణ్ కుమార్.. ఈసారి ఓ ప్రేమకథను కులం కోణంలో సీరియస్ గా చర్చించే ప్రయత్నమే చేశాడు. కానీ ‘ప్రేమకు కులం అడ్డంకి’ అనే నేపథ్యం తీసుకునేసరికి కొత్తగా చేయడానికి ఏమీ లేదన్నట్లు రొటీన్ సన్నివేశాలతో నింపేయడం ఇందులో నిరాశకు గురి చేసే విషయం. పైన చెప్పుకున్న పతాక సన్నివేశం దగ్గర మాత్రమే పైన చెప్పుకున్న తమిళ.. మలయాళ చిత్రాల్ని గుర్తు చేస్తూ హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది తప్ప.. మిగతాదంతా రొటీన్ వ్యవహారమే. ఆరంభ సన్నివేశాల వరకు ఆసక్తికరంగానే అనిపించినా.. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాల దగ్గరికి వచ్చేసరికి ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒక మూసలోకి వెళ్లిపోతుంది. హీరో మర్డర్ కేసులో చిక్కుకోవడం.. ఆ తర్వాత ఆ కేసులో వచ్చే మలుపులు ఏమంత కొత్తగా అనిపించవు. అలాగే అవి కథకు పెద్దగా బలం కూడా తీసుకురాలేదు. ఐతే ఉన్నంతలో ప్రథమార్ధం ఓకే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలోకి వచ్చాక కథ పెద్దగా ముందుకే కదలదు.

ద్వితీయార్ధంలో ఒక చోట నరేష్ పాత్ర.. ‘‘అది లేచిపోయిన ప్రతిసారీ తీసుకురావడమే నా పనైపోతోంది’’ అంటూ అసహనానికి గురవుతుంది. హీరో కోసం హీరోయిన్ రెండుసార్లు ఇల్లు విడిచి వెళ్లిపోతే.. మళ్లీ ఆమెను తిరిగి ఇంటికి తీసుకు వచ్చే సన్నివేశాలు చూస్తే ప్రేక్షకుల అసహనం కూడా ఇలాగే ఉంటుంది. హీరో జైలు నుంచి పారిపోవడం.. మళ్లీ పోలీసులకు పట్టుబడటం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు రుచించవు. వీటి పర్పస్ ఏంటో.. కథకు దీని వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏంటో అర్థమే కాదు. ప్రతి పాత్రా ఒక దశ దాటాక రొటీన్ గా తయారైపోతుంది. ఐతే ప్రి క్లైమాక్స్‌లో కొంతసేపు శ్రీదేవి పాత్రే తెరమీద కనిపించకుండా ఆ పాత్ర ఏమైంది అనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ విషయాన్ని రివీల్ చేసే క్లైమాక్సులో ఒక పావుగంట ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తుంది. కాసేపు వెంటాడుతుంది కూడా. ఐతే కేవలం ఈ పతాక ఘట్టాన్ని నమ్ముకోకుండా మధ్యలో కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రత్యేకమైన సినిమా అయ్యేది. ఎక్కువమందికి చేరువయ్యేది. కొన్ని లోపాలున్నప్పటికీ.. సీరియస్ లవ్ డ్రామాలు చూసేవాళ్లకు ఇది ఓకే అనిపించొచ్చు. కొత్తదనం కోరుకున్నా.. కథనంలో వేగం ఆశించినా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ రుచించడం కష్టమే.

నటీనటులు:

సమ్మోహనం.. నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాల్లో క్లాస్ పాత్రలతో మెప్పించిన సుధీర్ బాబు.. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో మాస్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు. నటుడిగా అతను పరిణతి సాధించాడని ఈ సినిమా చూస్తున్నంతసేపూ తెలుస్తూనే ఉంటుంది. సూరిబాబు పాత్రను ఓన్ చేసుకుని నటించినట్లు కనిపిస్తుంది. హీరోలాగా కాకుండా ఒక పాత్రధారి లాగా కనిపిస్తాడు సుధీర్ తెరపై. సూరిబాబు పాత్ర కోసం సుధీర్ చాలా కష్టపడి బాడీ కూడా పెంచాడు కానీ.. అదంత అవసరం అనిపించదు. తమిళంలో సత్తా చాటుకున్న తెలుగమ్మాయి ఆనంది.. ఎట్టకేలకు తెలుగులో ఒక పూర్తి స్థాయి మంచి పాత్ర చేసింది. ఆమె శ్రీదేవి పాత్రకు బలం తెచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. విలన్ పాత్రలో చేసిన తమిళ నటుడు పావెల్ నవగీతన్ చాలా బాగా చేశాడు. సినిమాలో నటన పరంగా ఆశ్చర్యానికి గురి చేసేది అతనే. నరేష్ తన అనుభవాన్ని చూపించాడు. రఘుబాబు.. సత్యం రాజేష్ కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

మణిశర్మ పాటల్లో చుక్కల మేళం ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతంలో మణిశర్మ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సినిమా శైలికి తగ్గట్లు.. డిఫరెంట్ బీజీఎం ఇచ్చాడాయన. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం సినిమాలో మరో మేజర్ హైలైట్. ఆరంభంలో వచ్చిన పడవ పోటీల ఎపిసోడ్ తో మొదలుపెట్టి.. చాలా సన్నివేశాల్లో శ్యామ్ దత్ ప్రతిభ కనిపిస్తుంది. విజువల్స్ సినిమాకు ఒక రస్టిక్ లుక్ తీసుకొచ్చాయి. నిర్మాణ విలువల విషయంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు ఏమాత్రం రాజీ పడలేదు. కథను నమ్మి బాగా ఖర్చు పెట్టారు. సాంకేతికంగా అన్ని విషయాలూ ఉన్నత ప్రమాణాలతో ఉండేలా చూసుకున్నారు. దర్శకుడు కరుణ్ కుమార్.. మరోసారి ‘పలాస’ తరహాలోనే గ్రామీణ నేపథ్యంలో కులం చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నాడు కానీ.. తొలి సినిమాలో మాదిరి ఇందులో ఇంటెన్సిటీ చూపించలేకపోయాడు. కథ పరంగా కొత్తదనం లేకపోవడం మైనస్ అయింది. చివర్లో వచ్చే ట్విస్టును మినహాయిస్తే ఆశ్చర్యపరిచే విషయాలేమీ లేవిందులో. కరుణ్ నరేషన్ మరీ నెమ్మదిగా సాగి ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోయేలా చేస్తుంది.

చివరగా: శ్రీదేవి సోడా సెంటర్.. ‘పాత’ సినిమాలో ‘కొత్త’ ముగింపు

రేటింగ్-2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre