Begin typing your search above and press return to search.

కాశీలో కలపట్లేదా? రామేశ్వరం లోనా?

By:  Tupaki Desk   |   2 March 2018 11:17 AM GMT
కాశీలో కలపట్లేదా? రామేశ్వరం లోనా?
X
అతిలోక సుంద‌రి అంతిమ‌యాత్ర అయిపోయింది. శ్రీదేవి చ‌రిత్ర‌లో ఒక భాగంగా మిగిలిపోయింది. సామాన్య జ‌నాల‌కే కాదు... స్టార్ హీరోయిన్ల‌కు సైతం రోల్ మోడ‌ల్ అయిన‌ శ్రీదేవిని ఇక సినిమాల‌లో చూడ‌డ‌మే. 54 ఏళ్ల‌కే ప్ర‌పంచాన్ని వీడి వెళ్లిన ఆమె మ‌ర‌ణం... సినీ జ‌గత్తుకే తీరని విషాదం. ముంబైలో అంత్య‌క్రియ‌లు స‌వ్యంగా జ‌రిగిపోయాయి. ఇక మిగిలింది అస్థిక‌లు నీటిలో క‌ల‌ప‌డ‌మే. అందుకు బోనీ త‌న భార్య పుట్టిన రాష్ట్రానే ఎంచుకున్నాడు.

అస్థిక‌లు క‌ల‌ప‌డానికి చాలా మంది కాశీకే వెళ‌తారు. అక్క‌డ గంగాన‌దిలో క‌లిపితే ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంద‌ని భావిస్తారు. బోనీ క‌పూర్ మాత్రం త‌న భార్య అస్థిక‌ల‌ను రామేశ్వ‌రంలోని స‌ముద్రంలో క‌ల‌పాల‌ని నిర్ణ‌యించాడ‌ట‌. ఎందుకంటే శ్రీదేవి పుట్టింది త‌మిళ‌నాడులోనే... రామేశ్వ‌రం ఉన్న‌ది త‌మిళ రాష్ట్రంలోనే. అందుకే సామాజిక న్యాయం పాటిస్తున్నాడు బోనీ. ముంబైలో అంత్య‌క్రియ‌లు పూర్త‌వ్వ‌డంతో అస్థిక‌ల‌ను తీసుకుని శుక్ర‌వారం చెన్నై రానున్నార‌ట‌. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఫ్లైట్ కూడా సిద్ధ‌మైంద‌ట‌. చెన్నై నుంచి రామేశ్వ‌రం 550 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి రామేశ్వ‌రం వెళుతుంది శ్రీదేవి కుటుంబం. అస్థిక‌లు స‌ముద్రంలో క‌లిపేశాక తిరిగి చెన్నై చేరుకుని... అక్కడ నుంచి ముంబై వెళ్లిపోతుంది.

దుబాయ్‌లో మేన‌ల్లుడి పెళ్లికి వెళ్లిన శ్రీదేవి... ఆ పెళ్లి జ‌రిగిపోయిన నాలుగు రోజుల‌కు మ‌ర‌ణించింది. తానున్న హోట‌ల్ గదిలోని బాత్రూమ్ ట‌బ్‌లో ప‌డి పోయి తుది శ్వాస విడిచింది. నీటిలో ప‌డిపోవ‌డంలో ఊపిరాడ‌క చ‌నిపోయిన‌ట్లు ఫోరెన్సిక్ రిపోర్టు చెబుతోంది. ఈ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్న‌ప్ప‌టికీ... ఎలాంటి ఆధారాలు మాత్రం దొర‌క‌లేదు. ఆమె కార్డియాక్ అరెస్టు వ‌ల్ల చ‌నిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఫోరెన్సిక్ రిపోర్టులో కార్డియాక్ అరెస్టు అనే ప‌ద‌మే క‌నిపించ‌లేదు. ఏది ఏమైనా సినీ ధ్రువ‌తార ఆకాశానికి చేరిపోయింది.