Begin typing your search above and press return to search.

'అఖండ'లో నన్ను చూసి ఊహ భయపడిపోయింది

By:  Tupaki Desk   |   4 Dec 2021 3:30 PM GMT
అఖండలో నన్ను చూసి ఊహ భయపడిపోయింది
X
శ్రీకాంత్ తన కెరియర్ ను మొదలుపెట్టిన తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేశాడు. మరి కొన్ని సినిమాల్లో విలన్ తనయుడిగా తండ్రి దుర్మార్గాల్లో పాలుపంచుకునే కుర్ర విలన్ గా కనిపించాడు. అలాంటి శ్రీకాంత్ ఆ తరువాత హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లాడు.

ఫ్యామిలీ హీరో అనిపించుకుంటూనే చాలా తక్కువ కాలంలో 100 సినిమాలను పూర్తిచేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన 'అఖండ' సినిమాలో విలన్ గా పవర్ఫుల్ రోల్ చేశాడు. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో, బాలకృష్ణతో పాటు శ్రీకాంత్ యాక్టింగ్ గురించి కూడా అంతా మాట్లాడుకుంటున్నారు.

తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ .. " హీరోగా ఫోర్స్ గా డైలాగ్స్ చెప్పడం వేరు .. విలన్ గా ఫోర్స్ గా డైలాగ్స్ చెప్పడం వేరు. విలన్ అనేసరికి వాయిస్ లో కొంచెం బేస్ పెంచవలసిందే. వాయిస్ లో ఆ బేస్ .. ఆ ఫోర్స్ ఉంటేనే ఆ పాత్ర ఆడియన్స్ లోకి వెళుతుంది. వాయిస్ లో ఆ బేస్ తెచ్చుకోవడమనేది డబ్బింగ్ చెప్పే సమయంలో మరింత కష్టమైన విషయం.

ఒకప్పుడు నేను ఫ్యామిలీ హీరోగా చేశాను. అలా అని చెప్పేసి ఎప్పుడూ అక్కడే ఉండిపోలేము .. అక్కడే ఆగిపోలేము. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ రోల్ చూసినవాళ్లు, శ్రీకాంత్ అలా చేయగలడు .. ఇలా చేయగలడు అనుకుంటున్నారు.

ఈ సినిమాలో నన్ను చూడగానే చాలా భయమేసిందని ఊహ చెప్పింది. ఈ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడు ఒక సారి నేను కాస్త్యుమ్స్ .. లుక్ మార్చకుండా అలాగే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఊహతో పాటు కొంతమంది అక్కడ కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు.

నన్ను చూడగానే ఎవరో అనుకుని కంగారుపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తారు. ఆ తరువాత నేనని తెలిసి .. 'ఏంటిదీ .. ఇంత క్రూరంగా ఉన్నారేంటి?' అంటూ నవ్వేశారు. 'ఆపరేషన్ దుర్యోధన' సమయంలో కూడా నేను ఇలాగే చేశాను. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకి నేను సెట్ కావడమనేది నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇకపై హీరోగా వెళ్లాలా? .. విలన్ పాత్రలే చేయాలా? అనే విషయంలో క్లారిటీ లేదు. నాకు వచ్చే అవకాశాలను బట్టి చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నా కెరియర్ కి బాగా ఉపయోగపడుతుంది .. నేను బాగా చేయగలను అనే నమ్మకం నాకు కలిగితే చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

'అఖండ'లో వరదరాజులు పాత్రను రిసీవ్ చేసుకుంటున్న తీరు బాగుంది. అనంతపురం నుంచి అమెరికా వరకూ ఉన్న బాలయ్య అభిమానులంతా కాల్ చేసి నన్ను అభినందిస్తూ ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మా రోషన్ హీరోగా సక్సెస్ కావడం .. నేను విలన్ గా సక్సెస్ కావడం నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.