Begin typing your search above and press return to search.

ఇకపై స్పీడ్ పెంచుతాను: అవసరాల శ్రీనివాస్

By:  Tupaki Desk   |   6 Sept 2021 12:30 AM
ఇకపై స్పీడ్ పెంచుతాను: అవసరాల శ్రీనివాస్
X
నటుడిగా .. దర్శకుడిగా అవసరాలకి మంచి గుర్తింపు ఉంది. కథాకథనాలపై ఆయనకి గట్టి పట్టుంది. తన సినిమాలకు తనే కథలను రెడీ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఆయన హీరోగా చేసిన 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా ఈ నెల 3వ తేదీన హియేటర్లకు వచ్చింది. రాజీవ్ రెడ్డి - సాయిబాబు నిర్మించిన ఈ సినిమాకి రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. తను హీరోగా చేసిన ఈ సినిమాకి కూడా అవసరాల రచయితగా పనిచేశారు. విడుదల రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నిజానికి ఇది క్రితం ఏడాదే పూర్తయిన సినిమా. థియేటర్లకు వద్దామని ఆగడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడం వలన, వెయిట్ చేస్తూ రావలసి వచ్చింది. ఒకానొక దశలో ఈ సినిమా థియేటర్లలో రావడం కష్టం ... ఇక ఓటీటీలోనే వస్తుందని అనుకున్నాను. కానీ నిర్మాతలు థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉండటంతో ఆగవలసి వచ్చింది. ఇక సినిమా విడుదలైన తరువాత వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది.

బట్టతల విషయంలో కొంతమంది ఇబ్బంది పడటం నేను చూశాను .. అలా బాధపడవలసిన అవసరం లేదనే విషయాన్ని నేను కాస్త బలంగా చెప్పాలనుకున్నాను. ఈ సినిమా ద్వారా అదే చేశాను. పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే .. నా ప్రయత్నం చాలావరకూ ఫలించిందనే ఆనందం కలుగుతోంది. ఈ 13 ఏళ్ల నా ప్రయాణం పట్ల నేను సంతృప్తికరంగానే ఉన్నాను. మంచి నటుడు అనిపించుకుంటే చాలు అనుకున్నాను .. అనిపించుకున్నాను. అయితే చాలా తక్కువ సినిమాలు చేస్తున్నానని చెప్పుకుంటున్నారు .. ఇకపై కాస్త స్పీడ్ పెంచుతాను.

నటుడిగా .. రచయితగా .. దర్శకుడిగా పనిచేసిన నాకు, రచన ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. నాని నాకు మంచి స్నేహితుడు. కానీ తనకి తగిన కథ నేను రెడీ చేసినప్పుడే ఆయనకు చెబుతాను. ఇక నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి సగం వరకూ పూర్తయింది. మిగతా సగం యూఎస్ లో తీయవలసి ఉంది. కరోనా కారణంగా వీసాలు రాకపోవడం వలన షూటింగు ఆగిపోయింది. నాగశౌర్య .. మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా, పరిస్థితులు అనుకూలించగానే మళ్లీ మొదలవుతుంది.

నేను ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటాను. కనీసం ఏడెనిమిది నెలలు పడుతుంది. అన్ని స్క్రిప్టులు మా ఇంట్లో కూర్చునే రాస్తూ ఉంటాను. కానీ ఏయే ప్రాజెక్టులు చేస్తున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? అనే ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి నేను అంత దూరం ఆలోచన చేయను. తరువాత సినిమా ఏమిటి? దానిని ఎలా డిజైన్ చేయాలి? దానికి సంతృప్తికరమైన రూపాన్ని ఎలా తీసుకురావాలనే ఒక్క విషయాన్ని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. అంతకుమించి నా బుర్రలో ఎలాంటి ఆలోచనలు ఉండవు" అని చెప్పుకొచ్చాడు.