Begin typing your search above and press return to search.

వైట్ల, రామ్.. ఓదార్పు సినిమా!

By:  Tupaki Desk   |   15 Nov 2015 1:30 PM GMT
వైట్ల, రామ్..  ఓదార్పు సినిమా!
X
రెండే రెండు సినిమాలు శిఖరం మీద ఉన్న శ్రీను వైట్లను పాతాళానికి పడేశాయి. ‘ఆగడు’ సినిమా కొట్టిన దెబ్బకు ‘బ్రూస్ లీ’ మందు రాస్తుందేమో అనుకుంటే.. దాని కంటే పెద్ద దెబ్బే కొట్టిందా సినిమా. దీంతో ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరో కూడా అతడి వైపు చూడని పరిస్థితి. ఒకప్పుడు వైట్ల వెంట పడ్డ హీరోలు సైతం అతణ్ని పట్టించుకోవట్లేదు.

ఇక యువ కథానాయకుడు రామ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. వరుసగా మూడు డిజాస్టర్లు చూశాక.. ‘పండగ చేస్కో’ అతడికి కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశమిచ్చింది. కానీ ‘శివమ్’ ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ కుర్రాడిని మళ్లీ కింద పడేసింది. ప్రస్తుతం ‘నేను శైలజ’ అనే సినిమా చేస్తున్నాడు కానీ.. దాని సంగతేమవుతుందో చూడాలి.

మొత్తానికి వైట్ల - రామ్.. ఇద్దరి పరిస్థితీ అయోమయంగానే ఉంది ప్రస్తుతం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒకప్పుడు వచ్చిన ‘రెడీ’ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అయింది. ఇద్దరి కెరీర్లను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఇప్పుడు మళ్లీ తమ కాంబినేషన్ తమ కెరీర్లను మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నారు వైట్ల - రామ్. ఇద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

ఇటీవలే ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సినిమా చేయడానికి ఓకే అనుకున్నారట. మొత్తానికి కష్టాల్లో ఉన్న ఈ డైరెక్టర్, హీరో ఒకరినొకరు ఓదార్చుకునే క్రమంలో ఓ సినిమాకు తయారైపోయారన్నమాట. నిర్మాత ఎవరు, కథేంటి అన్నది ఇంకా తేలలేదు కానీ.. ఇద్దరూ కలిసి సినిమా చేయడం మాత్రం ఖాయం అంటున్నారు.