Begin typing your search above and press return to search.

శ్రియ అంత త‌క్కువ‌కి ఒప్పుకుందా?!

By:  Tupaki Desk   |   9 Jun 2016 3:30 PM GMT
శ్రియ అంత త‌క్కువ‌కి ఒప్పుకుందా?!
X
ఒక అవ‌కాశం వ‌స్తే అదే ప‌ది వేలు అన్న‌ట్టుంది శ్రియ ప్ర‌స్తుత ప‌రిస్థితి. గోపాల గోపాల త‌ర్వాత ఆమెకి మ‌రో సినిమా లేదు. అలాంట‌ప్పుడు బాల‌కృష్ణ వందో సినిమాలో ఛాన్స్ అంటే ఇక తిరుగేముంటుంది? నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేసే స‌న్నివేశం కూడా ఉండ‌దు. ఆ ప‌రిస్థితిని క్రిష్ అండ్ టీమ్ బాగానే క్యాష్ చేసుకొన్న‌ట్టుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు ఎవ్వ‌రూ కూడా కోటికి త‌గ్గే ప‌రిస్థితి లేదు. వాళ్లుంటే సినిమాకి అద‌న‌పు క్రేజ్ వ‌స్తుంది కాబ‌ట్టి త‌ప్ప‌ద‌న్న‌ట్టుగా ఎంపిక చేసుకొంటుంటారు నిర్మాత‌లు. బాల‌కృష్ణ వందో సినిమా గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణికి కూడా మొద‌ట స్టార్ హీరోయిన్‌ నే ఎంపిక చేసుకోవాల‌నుకొన్నారు. చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేశారు కానీ... ఎవ్వ‌రూ అందుబాటులో క‌నిపించ‌లేదు. ఇక మ‌రో ప్ర‌త్యామ్నాయం లేక శ్రియని ఎంచుకొన్నాడు క్రిష్‌.

అయితే ఆమె ఈ సినిమా చేస్తున్నందుకు గానూ కేవ‌లం 40ల‌క్ష‌లే అందుకొంటోంద‌ట‌. కాల్షీట్లు కూడా భారీగానే కేటాయించింద‌ట‌. శ్రియ ఓకే కావ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత క్రిష్‌ కి బోలెడంత డ‌బ్బు ఆదా అయిన‌ట్ట‌య్యింది. అయినా బాల‌కృష్ణ సినిమా అంటేనే ఓ ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌, దానికి తోడు వందో చిత్రంగా గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక హీరోయిన్ న‌య‌న‌తార అయితే ఏముంది? అనుష్క అయితే ఏముంది? శ‌్రియని ఎంపిక నిర్ణ‌యం ముమ్మాటికీ స‌రైన‌దే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ కి పెట్టాల్సిన కోట్ల రూపాయల్ని సినిమాపై హంగుల‌కోసం కేటాయిస్తే మ‌రింత భారీద‌నం వ‌స్తుంది. అన్న‌ట్టు ఈ సినిమా చేయ‌డం ద్వారా శ్రియకి కూడా చాలా లాభాలే ఉన్నాయి. ఆమెకి అందుతున్న పారితోషికం త‌క్కువే కావ‌చ్చు కానీ... బాల‌య్య వందో చిత్రంలో న‌టించింద‌న్న ఓ గుర్తింపు అయితే ద‌క్కుతుంది. సినిమా హిట్ట‌యితే ఆమెకి మ‌రిన్ని ఆఫ‌ర్లు వెల్లువెత్తే అవ‌కాశాలూ లేక‌పోలేదు.