Begin typing your search above and press return to search.

ఏ నిమిషానికి ఏమి జరుగునో...

By:  Tupaki Desk   |   28 Jun 2015 9:42 AM GMT
ఏ నిమిషానికి ఏమి జరుగునో...
X
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? ఇప్పటికీ ఏదైనా విలేజీకి పండగలప్పుడో పబ్బాలప్పుడో వెళితే ఘంటసాల పాడిన ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. పాత డొక్కు మైక్‌ సెట్‌లో ఈ పాటని పదే పదే తిరగతోడేసిన సందర్భాలు కనిపిస్తాయి. అయితే ఈ లైన్‌ని ప్రతి సందర్భానికి అన్వయించవచ్చు. సుడి తిరగడం, గాలివాటంగా వెళ్లిపోవడం లాంటి పదాల్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు.

నిన్నటికి నిన్న ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ పురస్కారం వచ్చేస్తుంది అనుకున్న ఒక హీరోయిన్‌ అడ్డంగా చతికిలబడింది. అందాల సమంత 'మనం' చిత్రంలో ప్రదర్శించిన అభినయం ఉత్తమ అభినయం అనడానికి ఎలాంటి సందేహం లేదు. మనం విజయంలో సమంత పార్ట్‌ని అస్సలు విస్మరించలేం. ఇదే విషయాన్ని నాగార్జున సైతం పలుమార్లు గుర్తు చేశారు. అయితే ఫిలింఫేర్‌ ఉత్తమ నటి (తెలుగు సినిమా) పురస్కారం తనకే అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో సీన్‌ మారిపోయింది. ఆ పురస్కారం అనూహ్యంగా శ్రుతిహాసన్‌కి దక్కింది. రేసుగుర్రం చిత్రంలో నటనకు గానూ ఈ పురస్కారాన్ని శ్రుతి దక్కించుకుంది. మౌనవృతం పాటించి హింసించే కన్నెపిల్లగా శ్రుతి అద్భుతమైన అభినయాన్ని కనబరిచిందనడంలో సందేహమేం లేదు. అయితే ఇలా అనూహ్యంగా ఫిలింఫేర్‌ ఎత్తుకెళ్లేంత నటించిందని ఎవరూ అనుకోలేదు. దానివల్ల కంగు తినడం జనాల వంతయ్యింది.

అప్పట్లో 'మగధీర' రామ్‌చరణ్‌ని కాదని మేస్త్రీ దాసరి 'నంది' ఎగరేసుకుపోయినట్టు భలే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అయితే ఇలాంటి అవార్డుల విషయంలో ఏం జరుగుతుందో అవార్డు కమిటీకి.. ఆ తర్వాత ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. ఏ నిమిషానికి ఏమి జరుగునో .. ఎవరూహించెదరు?