Begin typing your search above and press return to search.

ఏం చేస్తాం...కరోనా కాలమిది.. తప్పదు..తనకు ఎదురైన కొత్త అనుభవంపై స్టార్ యాంకర్

By:  Tupaki Desk   |   3 May 2021 10:37 AM GMT
ఏం చేస్తాం...కరోనా  కాలమిది.. తప్పదు..తనకు ఎదురైన కొత్త అనుభవంపై స్టార్ యాంకర్
X
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి వింత వింత పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడంతో జన సమూహంలో కలవడానికి ప్రజలు భయపడుతున్నారు. మామూలుగా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అంటేనే ఇంటి నిండా బంధుమిత్రులతో కళకళ లాడుతూ ఉంటుంది. కానీ అటువంటి వేడుకలు కూడా కరోనా కారణంగా మమ అంటూ నిర్వహించి పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విధిలేని పరిస్థితుల్లో కొందరు అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు జరుపుకుంటుండగా, మరికొందరు జూమ్ వంటి యాప్ ల ద్వారా వేడుకలను ఇంట్లోనే ఉండి వీక్షిస్తున్నారు.

కొంతమంది వధూవరులు వెరైటీగా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి బంధుమిత్రులకు అందజేస్తున్నారు. శుభకార్యాలకే కాదు అశుభాలు కూడా జనాలు వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో వారు, అతి సన్నిహితులు ఎవరైనా ప్రాణాలు విడిచినా దగ్గరకు వెళ్లి చూస్తే పరిస్థితి లేకపోవడంతో చాలామంది వీడియో కాల్ ద్వారానే చివరి చూపు చూస్తున్నారు.తాజాగా తెలుగులో ప్రముఖ యాంకర్ అయిన ఝాన్సీకి కూడా కరోనా వల్ల ఓ కొత్త పరిస్థితి వచ్చింది. వరుసకు తనకు కొడుకు అయ్యే ఓ యువకుడి నిశ్చితార్థం జరిగిప్పటికీ కరోనా కారణంగా ఆమె పాల్గొన లేకపోయింది.

తనకు ఎదురైన అనుభవాన్ని ఝాన్సీ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది. 'నాకు కొడుకు వరస అయ్యే సంపత్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. స్వయంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ ద్వారానే వేడుకను వీక్షించా. ఈ నిశ్చితార్థ వేడుకలో కేవలం అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. నాతో సహా 300 మంది బంధుమిత్రాదులు ఆన్లైన్ ద్వారానే ఈ వేడుకను వీక్షించారు. ఇలాంటివన్నీ మనకు కొత్త అయినా, వేరే ఆప్షన్ లేక పోవడంతో తప్పదని' ఝాన్సీ పేర్కొన్నారు. కరోనా విజృంభణ కారణంగా ముందుముందు ఎటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందోనని అంతా అనుకుంటున్నారు.