Begin typing your search above and press return to search.

నటుడుగా మారిన స్టార్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   25 Feb 2021 7:00 PM IST
నటుడుగా మారిన స్టార్ డైరెక్టర్..!
X
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్.. పేరు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక దర్శకుడుగా సూపర్ హిట్ సినిమాలతో ఆయన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి సెల్వరాఘవన్ రూపొందించే సినిమాలన్ని తెలుగులో కూడా డబ్ వెర్షన్ రిలీజ్ అవుతుంటాయి. అలా సూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగులో సెల్వ రూపొందించిన 7/జి బృందావన కాలనీ, వెంకటేష్ హీరోగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. లాంటి సినిమాలు ఓ మార్క్ సృష్టించాయి. ఇక డబ్బింగ్ రూపంలో అయితే చెప్పక్కర్లేదు. నేను, యుగానికొక్కడు లాంటివి మంచి హిట్ అందుకున్నాయి. అయితే దర్శకుడుగానే కాకుండా సెల్వరాఘవన్ ఇప్పుడు నటుడుగా కూడా తన మార్క్ చూపించేందుకు రెడీ అయిపోయాడు.

ఆయన గతేడాది డిసెంబర్ నెలలోనే నటుడుగా మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళంలో 'రాకీ' సినిమా తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రాఘవన్ నటిస్తున్నాడు. 'సాని కాయిధమ్' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ తో హీరోయిన్ కీర్తిసురేష్ ప్రధానపాత్రను పోషిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా డిసెంబర్ లోనే విడుదల చేశారు మేకర్స్. అయితే ఇండస్ట్రీలో ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నటుడుగా ఆయన ముఖానికి రంగేసుకున్నాడు. ఫిబ్రవరి 25న అంటే ఈరోజు తొలిసారి నటుడుగా మారానని.. ఇదంతా అభిమానుల కారణంగానే సాధ్యం అయిందని సెల్వరాఘవన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసాడు. ఇక కొత్త పోస్టర్ చూస్తే ఈ సినిమా పోలీస్ విచారణ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. చూడాలి మరి నటుడుగా మారిన దర్శకుడు ఎలా ఎంటర్టైన్ చేస్తాడో!