Begin typing your search above and press return to search.

కోలాలు - అప్పీల‌కు ప్ర‌చారమేల‌?

By:  Tupaki Desk   |   16 Dec 2018 6:00 AM GMT
కోలాలు - అప్పీల‌కు ప్ర‌చారమేల‌?
X
స్టార్ల‌కు ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి చెప్పాలా? స్టార్లు, సూప‌ర్ స్టార్ల‌ను ఆద‌ర్శంగా తీసుకుని వాటిని అనుస‌రించేందుకు అభిమానులు ఎల్ల‌పుడూ సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా టీవీ- మీడియా క‌మ‌ర్షియ‌ల్స్ లో తార‌లు ఇచ్చే ప్ర‌చారం ప్ర‌భావం అంతా ఇంతా కాదు. టీనేజీ యువ‌తీయువ‌కుల‌పైనా ఇది తీవ్ర‌మైన ప్ర‌భావం చూపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కోలాలు తాగ‌డం - సిగ‌రెట్లు తాగ‌డాన్ని - మ‌త్తు పానీయాలు సేవించ‌డాన్ని ట్రెండ్‌ గా భావించి చెడిపోతున్నారు. జూదం - ఆన్ లైన్ ర‌మ్మీ వంటి వాటి జోలికి వెళితే జేబులు గుల్ల చేసుకునే ప‌రిణామాలు త‌లెత్తుతున్నాయి. అయితే వీటికి స్టార్లు ప్ర‌చారం చేయ‌డం త‌గునా? ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం?

టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో అసాధార‌ణ స్టార్ డ‌మ్ ఉన్న స్టార్ల‌తో కోలా- మ‌త్తు పానీయాల‌ కంపెనీలు ప్ర‌చారం చేసుకుంటున్నాయి. కోట్లాది రూపాయ‌ల కాంట్రాక్టులు కుదుర్చుకుని స్టార్ల‌తో ప్ర‌మోష‌న్ చేయిస్తూ బిలియ‌న్ డాల‌ర్ బిజినెస్ చేస్తున్నాయి. అయితే కార్పొరెట్ కంపెనీల స్వార్థ పూరిత ప్ర‌యోజ‌నాల కోసం - ధ‌నార్జ‌న కోసం కోట్లాది మంది అమాయ‌క‌ జ‌నాల ఆరోగ్యంతో - ప్రాణాల‌తో ఆడుకుంటే స‌హించ‌త‌ర‌మా? కోలాలు- వాటితో పాటే పురుగుమందు తాగి.. మ‌త్తు పానీయాలు తాగి - హుక్కా పీల్చి ఆరోగ్యం చెడ‌గొట్టుకోమ‌న‌డం క‌రెక్టేనా? క‌్ల‌బ్బు - ప‌బ్బు - జ‌బ్బు క‌ల్చ‌ర్‌ లో అద‌నంగా జ‌నాల‌కు ఈ చెవిలో గుమ్మ‌డి పువ్వులు ఎందుకు? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అస‌లు కోలాలు - అప్పీల‌కు ప్ర‌చారం అవ‌స‌ర‌మా?

ఈ విష‌యంలో టాలీవుడ్ స్టార్లు కొంచెమైనా ప‌రిశీలిస్తే బావుంటుంద‌నేది విశ్లేష‌కుల సూచ‌న‌. త‌మ‌ స్వార్థం కోసం అభిమానుల్ని ఎందుకు బ‌లి పెట్ట‌డం అన్న వాద‌నా తెర‌పైకొచ్చింది. ఒక‌ప్ప‌టి టాప్‌ స్టార్లు - ఇప్ప‌టి టాప్ స్టార్లు అంద‌రూ కోలాల ప్ర‌చార బాట ప‌ట్ట‌డం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్‌? సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇలాంటి వాటి ప్ర‌చారానికి నోనో అనేస్తారు. మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి స్టార్లు కెరీర్ ఆరంభం మ‌త్తుపానీయాల‌కు ప్ర‌చారం చేసినా ఆ త‌ర్వాత ఆపేశారు. ఇప్పుడున్న అగ్ర‌ హీరోలు - న‌వ‌త‌రం స్టార్లు ఈ విష‌యంలో పున‌రాలోచించే ఛాన్సుందా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది.