Begin typing your search above and press return to search.

శ్రుతి మించుతున్న హీరోల ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   11 Aug 2018 4:30 PM GMT
శ్రుతి మించుతున్న హీరోల ఫ్యాన్స్
X
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. సమాచారాన్ని చాలా వేగంగా వ్యాప్తి చేయడం సోషల్ మీడియా గొప్పదనం. అలాగే మీడియా దాచి పెట్టే.. వక్రీకరించే విషయాల్ని సోషల్ మీడియా బహిర్గతం చేస్తుంది. ఈ రకంగా రోజు రోజుకూ సోషల్ మీడియా బలం పుంజుకుంటోంది. నెటిజన్లకు గొప్ప సమాచార సాధనంగా ఉపయోగపడుతోంది. ఇక సినీ పరిశ్రమకైతే సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక సినిమా ప్రచారం సగానికి పైగా సోషల్ మీడియా ద్వారానే ఉచితంగా జరిగిపోతోంది. కేవలం సోషల్ మీడియా ప్రచారంతోనే జనాల్లోకి వెళ్లి మంచి విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఐతే సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాలు కూడా తక్కువేమీ కాదు. ట్రోల్ చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా సెలబ్రెటీల్ని టార్గెట్ చేసి ఓ రేంజిలో ఆడేసుకుంటూ ఉంటారు.

ఈ మధ్య స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో శ్రుతి మించి పోతున్న తీరు చర్చనీయాంశమవుతోంది. తమ హీరోల్ని ఒక మాట అంటే చాలు.. అవతలి వాళ్ల మీద విరుచుకుపడుతున్నారు. చేయని తప్పుకూ ట్రోల్ చేస్తున్నారు. మంచి చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకోకుండా ఎదురు దాడి చేస్తున్నారు. ఈ మధ్య హీరోల పుట్టిన రోజులకు చాలా సమయం ఉండగానే 100 డేస్.. 50 డేస్ కౌంట్ డౌన్లు నడపడం సోషల్ మీడియాలో ఫ్యాషన్ అయిపోయింది. వ్యక్తి పూజ శ్రుతి మించి.. తమ వెర్రి అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు చేస్తున్న ప్రయత్నాలివి. ప్రభాస్ పుట్టిన రోజుకు సంబంధించి ఇలాంటి ఒక హ్యాష్ ట్యాగ్ ను ఒక ప్రముఖ సినీ జర్నలిస్టే ట్వీట్ చేసేసరికి.. తమిళ కథానాయకుడు సిద్దార్థ్ కు కోపం వచ్చి.. వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులకు కోపం వచ్చేసింది. జోకర్ సిద్దార్థ్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని తిట్టిపోశారు.

ఇక తాజాగా యువ నటుడు ఆదర్శ్ బాలకష్ణ.. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ లతో కలిసి పని చేస్తుండటం పట్ల హర్షం ప్రకటిస్తూ.. ఒక ట్వీట్ చేయగా.. అందులో ఎన్టీఆర్ పేరు పక్కన ‘సర్’ లేదంటూ తారక్ అభిమానులు అతడిని టార్గెట్ చేశారు. అలాగే ‘గూఢచారి’ని ప్రశంసిస్తూ మహేష్ బాబు చేసిన ట్వీట్ కు బదులుగా జస్ట్ ‘థ్యాంక్ యు’ మాత్రమే చెప్పడాన్ని సూపర్ స్టార్ అభిమానులు తప్పుబట్టారు. ఆమెనూ తిట్టిపోశారు. ఇవన్నీ కూడా అభిమానుల అతికి నిదర్శనాలే. ట్వీట్లలో ‘సర్’ అనకపోతే.. ఆహా ఓహో అని పొగడకపోతే వాళ్లకు ఆయా హీరోలపై గౌరవం లేదని తిట్టడం అపరిపక్వతకు నిదర్శనం తప్ప మరేమీ కాదు. ఇలాంటి చెడు పోకడలు పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు. హీరోలకు కూడా ఇవి చేటు చేసేవే. ఈ విషయాల్లో హీరోలు.. వాళ్ల పీఆర్వోలు కొంచెం స్పందించి అభిమానుల్ని అదుపులో పెట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.