Begin typing your search above and press return to search.

హైకోర్టు తీర్పును స‌వాల్ చేసిన స్టార్‌ హీరో.. ఈసారి ఏమంటుందో?

By:  Tupaki Desk   |   22 July 2021 12:30 PM GMT
హైకోర్టు తీర్పును స‌వాల్ చేసిన స్టార్‌ హీరో.. ఈసారి ఏమంటుందో?
X
కోలీవుడ్ స్టార్ హీరో థ‌ళ‌ప‌తి విజ‌య్ త‌న రోల్స్ రాయీస్ కారుకు సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించ‌లేదంటూ.. మ‌ద్రాసు హైకోర్టు తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చ‌ర్య రాజ‌ద్రోహ‌మేన‌ని కూడా తేల్చి చెప్పింది. అంతేకాదు.. విజ‌య్ ను మందలిస్తూ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. దీంతో.. కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. సోష‌ల్ మీడియాలో విజ‌య్ వ్య‌తిరేకులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆయ‌న అభిమానులు తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. త‌మ హీరో ఇలా చేయ‌డ‌మేంట‌ని ఫీల‌య్యారు. అయితే.. అస‌లు విష‌యం వేరే ఉంద‌ని, పూర్తిగా తెలియ‌కుండా నింద‌లు వేస్తున్నార‌ని విజ‌య్ లాయ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాదు.. తీర్పును మ‌ళ్లీ స‌వాల్ చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. అన్న‌ట్టుగానే.. విజ‌య్ మ‌ళ్లీ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించారు.

2012లో విజ‌య్ లండన్ నుంచి కారు కొనుగోలు చేశాడ‌ని, దానికి సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించ‌లేద‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ల‌క్ష రూపాయ‌లు జ‌రిమానా విధించి, సీఎం రిలీఫ్ ఫండ్ కు చెల్లించాల‌ని కూడా ఆదేశించింది. అయితే.. ఈ విష‌యంలో అంద‌రూ ఒక‌వైపే తెలుసుకున్నార‌ని, అస‌లు విష‌యం వేరే ఉంద‌ని విజ‌య్ లాయ‌ర్ కుమార‌స‌న్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా తమ వాద‌న ఏంటీ? జ‌రుగుతున్న ప్ర‌చారం ఏంటీ అన్న‌దానిపై క్లారిటీ ఇచ్చారు. అస‌లు.. తాము దాఖ‌లు చేసిన కేసు ఏంట‌న్న‌ది కూడా చెప్పారు. దీనిక‌న్నా ముందు.. ఇలాంటి ఓ కేసును కూడా వివ‌రించారు. 199లో విలియమ్ ఫెర్నాడెజ్ అనే వ్య‌క్తి కేర‌ళ హైకోర్టులో ఎంట్రీ ట్యాక్స్ విష‌య‌మై కేసు పెట్టార‌ట‌. ఈ పిటిష‌న్లో విలియమ్ వాద‌న ఏమంటే.. ''మేము వాహనాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు భారీగా దిగుమతి సుంకం చెల్లించాం. మళ్లీ ఎంట్రీ ట్యాక్స్ ఏంటీ? ఇది న్యాయం కాదు'' అని కేరళ హైకోర్టులో వాదించారు. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం.. క‌స్ట‌మ్స్ ట్యాక్స్ చెల్లించిన త‌ర్వాత ఎంట్రీ ట్యాక్స్ వ‌ర్తించ‌ద‌ని తీర్పు చెప్పింద‌ట‌.

ఇప్పుడు విజ‌య్ కేసు కూడా అలాంటిదే. ఆయ‌న దిగుమ‌తి సుంకం మొత్తం చెల్లించారు. కానీ.. ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల‌ని కోర‌డంపై వివాదం నెల‌కొంద‌ని తెలిపారు. దీంతో.. 2012లో ఆ కారు కొనుగోలు చేసిన స‌మ‌యంలోనే ష‌ర‌తుల‌తో కూడిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను కోర్టు జారీచేసిందని, దీని ప్ర‌కారం.. 20శాతం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించి వాహ‌నాన్ని రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని కోర్టు తెలిపింద‌న్నారు. దీంతో.. విజ‌య్ ఆ మొత్తాన్ని చెల్లించిన త‌ర్వాత‌నే రిజిస్ట‌ర్ చేసుకొని కారును వినియోగించార‌ని కూడా తెలిపారు.

తాజా విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఇలా వ్యాఖ్యానించింద‌ని అన్నారు. ఈ విష‌యం పూర్తిగా తెలియ‌ని వారు విజ‌య్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఇది స‌రికాద‌ని అన్నారు. మొత్తం తెలుసుకున్న త‌ర్వాత‌నే మాట్లాడాల‌ని అన్నారు విజ‌య్ లాయ‌ర్‌. అయితే.. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపైనా అప్పీల్ చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. అయితే.. అది ట్యాక్స్ విష‌య‌మై కాద‌న్నారు. న్యాయ‌స్థానం చేసిన క‌ఠినమైన వ్యాఖ్య‌లు స‌రికాద‌నే అప్పీల్ చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.

చెప్పిన‌ట్టుగానే విజ‌య్‌.. మ‌ద్రాస్ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ దురైస్వామి, జ‌స్టిస్ హేమ‌ల‌తా నేతృత్వంలోని డివిజ‌న్ బెంచ్‌.. విచార‌ణ‌కు స‌మ్మ‌తించింది. ఇటీవ‌ల న్యాయ‌మూర్తి ఇచ్చిన కాపీని జ‌త చేయాల‌ని రిజిస్ట్రార్ ను బెంచ్ ఆదేశించింది. మ‌రోరెండు రోజుల్లో ఈ కేసు విచార‌ణ‌కు వ‌చ్చే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి, సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజ‌న్ బెంచ్ ఎలా స్పందిస్తుంద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా.. ఈ కేసు విష‌యంలో సింగిల్ బెంచ్‌ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్నుల‌తోనే పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రుల్లో సేవ‌లు స‌హా.. సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. సినిమా న‌టులు నిజ‌మైన హీరోలుగా ఉండాలే త‌ప్ప‌.. రీల్ హీరోలుగా కాదంది. ఇలాంటి వారు ప‌న్నులు ఎగ్గొట్ట‌డం ఏ మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని చెప్పిన న్యాయ‌స్థానం.. ప‌న్ను ఎగ‌వేత అనేది రాజ‌ద్రోహ‌మ‌ని తేల్చి చెప్పారు. దిగుమ‌తి చేసుకున్న కారుకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్సు రెండు వారాల్లోగా చెల్లించాల‌ని ఆదేశించింది. అంతేకాదు.. ఈ పిటిష‌న్ వేసినందుకు గానూ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది.