Begin typing your search above and press return to search.

ఫోక‌స్‌: సొంత బ్యాన‌ర్ల‌తో దూసుకొచ్చారు!

By:  Tupaki Desk   |   10 Feb 2019 1:30 AM GMT
ఫోక‌స్‌: సొంత బ్యాన‌ర్ల‌తో దూసుకొచ్చారు!
X
స్టార్ హీరోల సినిమా నిర్మాణం అనేది ఇప్ప‌టిది కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌ అంత‌టి వారు సినిమాలు నిర్మించారు. సొంతంగా బ్యాన‌ర్లు స్థాపించి నిర్మాత‌లుగా పెట్టుబ‌డులు పెట్టారు. లాభ న‌ష్టాల్లో షేర్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా అగ్ర హీరోలు ఈ పంథాలో వెళ్లారు. అయితే అంద‌రు నిర్మాత‌ల‌కు సినిమా నిర్మాణం క‌లిసి రాదు. అంకెల గార‌డీ, ట్రేడ్ పై ప‌ట్టు ఉండాలి. అంత‌కుమించి అదృష్టం క‌లిసొస్తేనే గెలుపు ద‌క్కుతుంది. సావిత్రి స‌హా ఎంద‌రికో అలాంటి అనుభ‌వం అయ్యింది.

సీనియ‌ర్ హీరోల్లో నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ కి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అండ‌దండ‌లు ఉన్నాయి. ఇటీవ‌లే ఎన్టీఆర్ బ‌యోపిక్ తో బాల‌య్య నిర్మాత‌గా మారారు. ఎన్ బికే సినిమాస్ లో ఆయ‌న ఇక‌పైనా సినిమాలు నిర్మించ‌నున్నారు. మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ కోసం బాల‌య్య స‌న్నాహాలు చేస్తున్నార‌న్న టాక్ ఉంది. మెగాస్టార్ చిరంజీవికి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అండ ఉంది. ప్ర‌స్తుత స్టార్‌ హీరోల్లో మ‌హేష్ ఇప్ప‌టికే ఎంబీ కార్పొరేష‌న్ స్థాపించి నిర్మాత‌గా సినిమాలు తీసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అడివి శేష్ న‌టిస్తున్న గూఢ‌చారి 2 చిత్రానికి మ‌హేష్ పెట్టుబ‌డులు పెడుతున్నార‌న్న స‌మాచారం ఉంది. అలాగే ఎంబి కార్పొరేష‌న్ లో వెబ్ సిరీస్ ల నిర్మాణం - చిన్న సినిమాల నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో ఖైదీనంబ‌ర్ 150 చిత్రం తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం సైరా - న‌ర‌సింహారెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ బ్యాన‌ర్ చిరుతో సినిమాలు చేసేందుకేన‌ని చ‌ర‌ణ్ చెబుతున్నా , ప్ర‌స్తుత ట్రెండ్ లో కొత్త ఆలోచ‌న‌లు చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అల్లు అర్జున్‌ గీతా ఆర్ట్స్‌ కాకుండా సొంతంగా ఏఏ ఆర్ట్స్ ప్రారంభిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇందులో ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల్ని తెర‌కెక్కించే ఛాన్సుంది.

న‌వ‌త‌రం హీరోల్లో నితిన్‌, నాని, శ‌ర్వానంద్ వంటి వాళ్లు నిర్మాత‌లుగా అనుభ‌వం ఘ‌డించారు. నాగశౌర్య ఫ్యామిలీకి సొంతంగా బ్యాన‌ర్ ఉంది. నారా రోహిత్ ఇప్ప‌టికే సొంత బ్యాన‌ర్ లో సినిమాలు తీస్తున్నారు. హీరో సుధీర్ బాబు ఇటీవ‌లే సొంత బ్యాన‌ర్ సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ ప్రారంభించి `న‌న్ను దోచుకుందువ‌టే` అనే చిత్రంతో విజ‌యం అందుకున్నాడు. త‌దుప‌రి సినిమాల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు. సందీప్‌ కిషన్ సినిమాలు నిర్మించే ప్లానింగ్ లో ఉన్నాడ‌ట‌. న‌వ‌త‌రంలో ప‌లువురు హీరోలు సొంత బ్యాన‌ర్ల‌లో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. క్రియేటివిటీని ప్రోత్స‌హించ‌డం, ఫ్యాష‌న్ తోనే చాలా మంది సొంత బ్యాన‌ర్ల‌లో సినిమాలు తీస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.