Begin typing your search above and press return to search.

తగ్గిన స్టార్ హీరోల సినిమాలు.. విజయాలు

By:  Tupaki Desk   |   30 Oct 2019 5:30 PM GMT
తగ్గిన స్టార్ హీరోల సినిమాలు.. విజయాలు
X
ఈ ఏడాది టాలీవుడ్ రిలీజులలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టాప్ లీగ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినవే తక్కువ. వాటిలో కూడా మెజారిటీ ఫ్లాపులు. యావరేజ్ గా మిగిలిన సినిమాలే. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే ఈ ఏడాది ఒక్క టాప్ లీగ్ స్టార్ హీరో సినిమా కూడా హిట్ కాలేదు. జనవరిలో రిలీజ్ అయిన రామ్ చరణ్ సినిమా 'వినయ విధేయ రామ' ఒక డిజాస్టర్. ఇక సమ్మర్ లో రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా 'మహర్షి' యావరేజ్ మాత్రమే. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. కొన్ని ఏరియాల్లో కాలేదు.

ఇక ప్రభాస్ 'సాహో' కూడా బ్రేక్ ఈవెన్ కు దూరంలోనే ఆగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' కూడా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ఈ ఏడాదిలో పెద్ద స్టార్లు నటించిన సినిమాలేవీ రిలీజ్ కాలేదు. సీనియర్ స్టార్లలో బాలయ్య.. నాగార్జున.. వెంకటేష్ సినిమాలు రిలీజ్ అయినా ఒక్క వెంకీకి మాత్రమే 'F2' తో హిట్ దక్కింది. అల్లు అర్జున్ గ్యాప్ తీసుకోవడంతో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఎన్టీఆర్ రాజమౌళి 'RRR' తో బిజీగా ఉండడంతో వచ్చే ఏడాది వరకూ సినిమా లేదు. పవన్ కళ్యాణ్ ఎలాగూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఆయన సినిమా కూడా లేదు.

ఇక స్టార్ డైరెక్టర్లు కూడా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో సినిమాలు రిలీజ్ కాలేదు. రాజమౌళి సినిమా కోసం వచ్చే ఏడాదివరకూ వేచి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి కోసం వెయిట్ చేయడంతో కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఈ ఏడాది రిలీజ్ రాలేదు. ఇక సుకుమార్ 'రంగస్థలం' తర్వాత సినిమా మొదలు పెట్టలేదు. ఈరోజే లాంచ్ కాబట్టి ఈ ఏడాది సుకుమార్ సినిమా లేనట్టే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఈ ఏడాది ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు.

ఇదంతా గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తి చేయడానికి ఏడాది.. అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో సగం మంది స్టార్ హీరోల సినిమాలు ప్రతి ఏడాదీ రిలీజ్ కావడం లేదు. ఆ స్టార్ హీరోలతో దర్శకులు లాక్ అయి ఉండడంతో స్టార్ డైరెక్టర్లదీ అదే పరిస్థితి. రిలీజ్ అయిన మూడు నాలుగు స్టార్ హీరోల సినిమాలలో అన్నీ హిట్ అయ్యే పరిస్థితి లేదు.

ప్రభాస్ ఒక సినిమాకు సరాసరి రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. మహేష్ బాబు ఒక సినిమా చేయాలంటే ఏడాది నుంచి ఒకటిన్నర సంవత్సరం పడుతోంది. అనిల్ రావిపూడి సినిమా మాత్రమే ఎక్సెప్షన్. యావరేజ్ మీద చూస్తే మహేష్ నటించిన సినిమాలు ఏడాదికి ఒకటి లెక్కన రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ కూడా ఒక సినిమాకు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం తీసుకుంటారు. ఎన్టీఆర్ కొంత స్పీడ్ గా చేస్తారు కానీ ఇప్పుడు రాజమౌళి తో చేస్తున్నారు కాబట్టి లేటే. అల్లు అర్జున్ ఒక సినిమా చేసేందుకు ఏడాది పడుతోంది.

ఇదిలా ఉంటే ప్రతి స్టార్ హీరో డైరీ వచ్చే రెండేళ్ళ వరకూ ఖాళీ లేకపోవడం కూడా న్యూ జెనరేషన్ దర్శకులకు కష్టం అవుతోంది. స్టార్ హీరోను ఒప్పించినా ఏడాది నుంచి రెండేళ్ళు సినిమా కోసం వెయిట్ చెయ్యాల్సి వస్తోంది. దీంతో కొత్త దర్శకులు స్టార్ హీరోల దగ్గరకు పోవడానికి భయపడుతున్నారు. ఏదేమైనా ప్రేక్షకులకు మాత్రం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావడం లేదనే ఫీల్ కలుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్పెషల్ ప్రాజెక్ట్ అయితే తప్ప స్టార్ హీరోలు ఎక్కువ సమయం తీసుకోకుండా సినిమాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.