Begin typing your search above and press return to search.

మనం వేస్టన్న సినిమాల్ని నెత్తినపెట్టుకుంటున్నారు

By:  Tupaki Desk   |   7 Aug 2016 5:30 PM GMT
మనం వేస్టన్న సినిమాల్ని నెత్తినపెట్టుకుంటున్నారు
X
తమిళ ప్రేక్షకుల టేస్టు చాలా గొప్పది అంటుంటారు. అది చాలా వరకు నిజం కూడా. ఇప్పుడు మనం కొత్తదనం కొత్తదనం అనేస్తున్నాం కానీ.. తమిళంలో ఎప్పుడూ కొత్తదనంతో ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఐతే అప్పుడప్పుడూ తమిళ ప్రేక్షకులు టేస్టు మీద సందేహాలు కలిగేలా కూడా కొన్ని సినిమాలు ఆడేస్తుంటాయి. తెలుగు ప్రేక్షకులు వేస్ట్ అంటూ తిప్పికొట్టిన సినిమాలు కొన్నింటికి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తుంటారు.

గత ఏడాది ‘ఐ’ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సినిమాను తిప్పికొట్టారు. శంకర్ లాంటి వాడు అలాంటి సినిమా తీస్తాడని.. అంతగా విసిగిస్తాడని జనాలు అనుకోలేదు. తమిళంతో సమానంగా విపరీతమైన క్రేజ్ మధ్య తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా ఇక్కడ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది కానీ.. ఆ తర్వాత నిలబడలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్టే. అక్కడ ఈ సినిమాను బాగానే ఆదరించారు.

ఇక ఈ ఏడాది కొన్ని నెలల కిందట విజయ్ సినిమా ‘తెరి’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు. కానీ సినిమా చూసి థూ అన్నారు ప్రేక్షకులు. అరిగిపోయిన ఫార్ములా సినిమా అంటూ తిప్పికొట్టారు. తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చేశారు.

ఇక లేటెస్టుగా ‘కబాలి’ సినిమా చూసిన మన ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజినీ సినిమా అంటే ఏదోలా ఊహిస్తే.. అక్కడ తెరమీద బొమ్మ ఇంకోలా కనిపించింది. వీకెండ్ వరకు ముందే బుకింగ్స్ అయిపోవడం వల్ల కలెక్షన్లు బాగానే వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా చూస్తే ఇది పెద్ద డిజాస్టరే. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా బాగా ఆడింది. ఆడుతూ కూడా ఉంది. రివ్యూలు బాగున్నాయి. కలెక్షన్లూ బాగున్నాయి. ఇలాంటి సమయాల్లోనే తమిళ ప్రేక్షకుల టేస్టు మీద కొంచెం సందేహాలు కలుగుతుంటాయి.