Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల నిర్మాతలు మునగడమేనా?

By:  Tupaki Desk   |   1 Nov 2019 2:30 PM GMT
స్టార్ హీరోల నిర్మాతలు మునగడమేనా?
X
ఒక సినిమా ఎందుకు తెరకెక్కిస్తారు అనేందుకు చాలానే కారణాలు ఉంటాయి కానీ.. ఏ ఉద్దేశాలతో సినిమాను రూపొందించినా ఆ సినిమా ప్రధాన గమ్యం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడమే. అయితే సినిమా ఇండస్ట్రీలో విజయాల శాతం తక్కువ కాబట్టి మెజారిటీ సందర్భాలలో గమ్యాన్ని ఫిలిం మేకర్స్ చేరుకోలేరు.

ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది ఎవరు అంటే.. నిర్మాణంలో అసలు సంబంధం లేని వ్యక్తులయిన బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు. సినిమా కథపై వారికి కంట్రోల్ ఉండదు.. సినిమా అవుట్ పుట్ పై వారికి కంట్రోల్ ఉండదు.. ఆఖరికి హీరోల పైత్యంతో కూడా వారికి ఎటువంటి సంబంధం ఉండదు. అయినా వారే దాదాపుగా నష్టపోతూ ఉంటారు. గతంలో బయ్యర్లు నష్టపోయినా స్టార్ హీరోల సినిమాలు నిర్మించే నిర్మాతలు చాలామంది సేఫ్ జోన్ లో ఉండేవారు. ఎందుకంటే సినిమాను అమ్మేసి సేఫ్ జోన్ లో ఉంటారు కాబట్టి. ఈమధ్య నిర్మాతల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల నిర్మాతలు.

గతంలో స్టార్ హీరో సినిమా ఆంటే నిర్మాతకు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కాసుల పంట అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు హీరోల పద్ధతి మారింది.. రెమ్యూనరేషన్ వ్యవహారాలు మారాయి.. దీంతో నిర్మాతలకు చావు అయిపోతోంది. సినిమా బడ్జెట్ లో 30-40% స్టార్ హీరో రెమ్యూనరేషన్ కే పోతోంది. దీనికి తోడుగా కొందరు స్టార్ హీరోలు ఇద్దరు నిర్మాతలను కలిపి జాయింట్ వెంచర్లు ప్లాన్ చేస్తూ ఉండడంతో సినిమా షూటింగ్ లో కీలకమైన డెసిషన్ మేకింగ్.. కంట్రోల్ అనేది ఒకరిదగ్గర ఉండడంలేదు. దీంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. ఇంత చేసినా నిర్మాతకు ఏమైనా మిగులుతుందా అంటే ఏమీ మిగలదు. ఫ్లాప్ సినిమాలకు తల బొప్పి కడుతుంటే.. యావరేజ్ సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉండాల్సి వస్తోంది. ఇక హిట్ సినిమాకు కూడా ఏమీ మిగలడం లేదు.

ఒకవేళ హిట్ సినిమాలు ఏవైనా తగిలితే.. ఆ సినిమాతో వచ్చేది కాస్తా పాత డిజాస్టర్లకు సంబంధించిన మొండిబకాయిలు సరి చేయడానికి.. బయ్యర్లకు సర్దడానికి సరిపోతోందట. దీంతో చాలామంది నిర్మాతలు "అసలు సినిమా ఎందుకు చేసినట్టు?".. అనే ఆలోచనలో పడిపోతున్నారు. సినిమాలతో నష్టపోయేవారి లిస్టులో ఇప్పుడు స్టార్ హీరోల సినిమా నిర్మాతలు కూడా చేరిపోయారు. ఫ్లాప్ సినిమాకు నష్టపోతే ఓకే అని సరిపెట్టుకోవచ్చు. కానీ హిట్ అని ఊదరకొట్టే సినిమాలకు వీరంతా నష్టపోవడం.. జెన్యూన్ హిట్ అయినా పెద్దగా మిగలకపోవడం బాధాకరమైన విషయం.