Begin typing your search above and press return to search.

బన్నీ అభిమానులుగా మారిపోతున్న బడా హీరోలు!

By:  Tupaki Desk   |   14 Feb 2022 4:15 AM GMT
బన్నీ అభిమానులుగా మారిపోతున్న బడా హీరోలు!
X
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో అందరినోళ్లలో నానిన సినిమా ఏదైనా ఉందంటే అది 'పుష్ప'నే. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. సాధ్యమైన ప్రతిచోటున సంచలనాన్ని సృష్టించింది. చిన్నపిల్లల్లోకి 'తగ్గేదే లే' అనే డైలాగ్ ఒక రేంజ్ లో వెళ్లిపోయింది. ఇక శ్రీవల్లీ పాటకి బన్నీ వేసిన స్టెప్ ను సెలబ్రటీలు సైతం అనుసరించడం ఆశ్చర్యం. అంతేకాదు 'నా సామీ' సాంగ్ కి చేసిన రీల్స్ చూస్తే కళ్లు తిరిగిపోతాయి. అలా 'పుష్ప' సినిమా అన్ని వైపులా నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లుకుపోయింది.

'పుష్ప' అంతగా ప్రేక్షకులకు చేరువకావడానికి ఒక కారణం ఉంది. ఈ మధ్య కాలంలో కథలు చాలా వరకూ ఫారిన్లో పుట్టి ఫారిన్లో పెరుగుతున్నాయి. అందువలన తమది కానీ కథలో తాముగా ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాకపోవడం జరుగుతోంది. 'పుష్ప' విషయానికి వచ్చేసరికి ఈ కథలో కావలసినంత స్థానికత కనిపిస్తుంది. ఆయా పాత్రలను మలచిన తీరు .. ఆ పాత్రలు మాట్లాడే యాస కారణంగా కథ తమచుట్టూ జరుగుతున్నదే అనుకుంటూ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దాంతో కాసుల వర్షం కురిసేసింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది.

ఈ సినిమా బన్నీ మాస్ ఇమేజ్ ను మరింతగా పెంచింది. ఈ ట్రెండ్ లో ఒక స్టార్ హీరో ఇలాంటి ఒక లుక్ తో కనిపించడానికి ఒప్పుకోవడం నిజంగా విశేషమే. అదే ఇప్పుడు బాలీవుడ్ ఆర్టిస్టులను ఆశ్చర్యపరుస్తోంది. మురికి బట్టలు .. మాసిన జుట్టు .. పెరిగిన గెడ్డం .. కాస్త గూని .. ఇలాంటి ఒక లుక్ తో తెరపై కనిపించడానికి గట్స్ కావాలి. ఈ సినిమా హిందీలో కూడా 100 కోట్లకి పైగా వసూలు చేసింది. ఏడేళ్లలో బాలీవుడ్ లో 100 కోట్ల వసూళ్లను రాబట్టిన దక్షిణాది సినిమాలు నాలుగే నాలుగు. మళ్లీ ఇంతకాలానికి ఆ రికార్డును సెట్ చేసిన 5వ సినిమాగా 'పుష్ప' నిలవడం విశేషం.

బాలీవుడ్ కి వచ్చి బహు దర్జాగా అక్కడి సినిమాలకి 'పుష్ప' పోటీగా నిలబడటం. అరుదైన రికార్డులను తన పేరుతో రాసేస్తూ ఉండటంతో, అంతగా ఈ సినిమాలో ఏముందో చూడాలనే కుతూహలం అక్కడి స్టార్ హీరోల్లో పెరుగుతూ పోయింది. అంతటి ఆసక్తితో వాళ్లంతా ఆ సినిమాను చూశారు. అప్పుడుగానీ వాళ్లకి అసలు విషయం అర్థం కాలేదు.

సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హీరోలంతా బన్నీ అభిమానుల జాబితాలో చేరిపోయారు. ఆ విషయాన్ని వారే స్వయంగా చెప్పారు. ఈ సినిమా చూసిన అక్షయ్ కుమార్ .. రణ్ వీర్ సింగ్ .. జాన్వీ కపూర్ .. కరణ్ జొహార్ .. తదితరులు అంతా కూడా తాము బన్నీ అభిమానులుగా మారిపోయినట్టుగా చెప్పారు.

తాజాగా ఈ జాబితాలో సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కూడా చేరిపోవడం విశేషం. 'పుష్ప' సినిమా చూడగానే ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. "ఈ సినిమాను నేను చూశాను .. బన్నీ అద్భుతంగా చేశాడు. 'పుష్ప' చూసిన తరువాత నేను బన్నీ అభిమానుల్లో చేరకుండా ఉండలేకపోయాను. ఈ సినిమాను నేను చూస్తున్నంత సేపు 1980 - 90లలో నేను చేసిన కొన్ని సినిమాలు గుర్తుకు వచ్చాయి. బన్నీ తన పాత్రతో ప్రతి ప్రేక్షకుడిని ప్రభావితం చేశాడు. ఇక నుంచి నా అభిమాన నటులలో ఆయన ఒకరు" అని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ను ఒక దశలో ఏలేసిన సీనియర్ స్టార్ నుంచి బన్నీకి ఇలాంటి ఒక కాంప్లిమెంట్ రావడం నిజంగా విశేషమే.