Begin typing your search above and press return to search.

ఈ పుకారు మాత్రం ఇంట్లోవాళ్లు నమ్మేశారండోయ్!

By:  Tupaki Desk   |   13 July 2022 6:30 AM GMT
ఈ పుకారు మాత్రం ఇంట్లోవాళ్లు నమ్మేశారండోయ్!
X
దూరం నుంచి చూసేవారికి సినిమా ఇండస్ట్రీ చాలా అందంగా కనిపిస్తుంది. హీరోలు .. హీరోయిన్లు .. వాళ్ల లైఫ్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడి ప్రేమలు .. పెళ్లిళ్ల పట్ల బయటివారు చూపించే ఆసక్తి .. ఉత్సాహం ఒక రేంజ్ లో ఉంటాయి. సినిమా హీరోహీరోయిన్లు ఒక సినిమా కోసం కొన్ని నెలల పాటు కలిసి పని చేయడం జరుగుతుంది. అందువలన వాళ్ల మధ్య పరిచయాలు .. ప్రేమలు ఎక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. అందువల్లనే వాళ్లపై పుకార్లు షికార్లు చేస్తుంటాయి.

సాధారణంగా ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతోనో .. బిజినెస్ మేన్ తోనో ప్రేమలో పడిందనే ప్రచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కొంతమంది వెంటనే మీడియా ముందుకు వచ్చేసి 'అబ్బే .. అదేం లేదు' అనేసి వివరణ ఇచ్చుకుంటూ ఉంటారు. మరికొంతమంది లైట్ తీసుకుని తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటారు. తామేంటన్నది తమకి తెలుసనీ .. ఇలాంటి వార్తలను గురించి తమ ఇంట్లో వాళ్లు కూడా అడగారని సందర్భం వచ్చినప్పుడు చెప్పేస్తుంటారు. అప్పుడు మాత్రం పుకారిస్టులు ఉస్సూరు మంటారు.

ఈ సారి హీరోయిన్స్ పై కాకుండా హీరో రామ్ పై ఒక పుకారు షికారు చేసింది. తన చిన్ననాటి స్నేహితురాలినే రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఒక వార్త వీరలెవెల్లో విహారం చేసింది. రామ్ ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి ఫొటోను షేర్ చేస్తాడా అని కాచుకుని కూర్చున్నవాళ్లు లేకపోలేదు.

కానీ నేరుగా రామ్ నే రంగంలోకి వచ్చేసి .. అలాంటిదేం లేదని చాలామందిని నిరాశపరిచాడు. రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్' ఈ నెల 14వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ ఈ రూమర్ గురించి స్పందించాడు.

"సాధారణంగా ఫలానా హీరో .. ఫలానా హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్నాడనే పుకార్లు వస్తుంటాయి. ఇలాంటివి కామన్ అనుకుని ఇంట్లోవాళ్లు కూడా పట్టించుకోరు. కానీ నేను చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా కథనం అల్లేశారు. దాంతో ఇంట్లోవాళ్లు నన్ను అదోలా చూశారు .. అనుమానంగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.

''ఎంతోకొంత నిజం లేకపోతే ఇలా రాస్తారంటావా అబ్బాయ్ ?" అంటూ మా అమ్మ కూడా అనేసింది. "అసలు నేను స్కూల్ కే రెగ్యులర్ గా వెళ్లింది లేదు .. ఇక ప్రేమలో ఎలా పడతానే" అని నేను అంటే, అప్పుడు కాస్త నమ్మినట్టుగా అనిపించింది. ఆ తరువాత నేను బయటికి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.