Begin typing your search above and press return to search.

MAA మీటింగ్.. కృష్ణంరాజు వ‌ర్సెస్ ముర‌ళీమోహ‌న్

By:  Tupaki Desk   |   28 July 2021 6:35 AM GMT
MAA మీటింగ్.. కృష్ణంరాజు వ‌ర్సెస్ ముర‌ళీమోహ‌న్
X
MAA అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు `మా` క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం స‌న్నాహ‌కాల్లో ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే నువ్వా నేనా? అంటూ మ‌రోసారి హోరాహోరీ త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ .. మంచు విష్ణు మాంచి కాక మీదున్నారు. మ‌రోవైపు వీకే న‌రేష్ త‌న వ‌ర్గంతో రాజ‌కీయాలు చేస్తుండ‌గా ... ముర‌ళీ మోహ‌న్ లాంటి సీనియ‌ర్లు ఏక‌గ్రీవం అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.

పైకి క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం పెద్ద‌లు ఏదీ మాట్లాడ‌క‌పోవ‌డంతో అంతా సందిగ్ధ‌త నెల‌కొంది. 950 మంది తో స‌మృద్ధిగా ఉన్న మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో మునుముందు ఎలాంటి గ‌డ‌బిడ‌లు చోటు చేసుకోబోతున్నాయి? టీఆర్పీలు ఎలా ఏరుకోవాలి? అన్న ఆత్రుత‌లో కొన్ని ఇ- మీడియాలు ఉన్నాయి. అప్పుడ‌ప్పుడు చానెళ్ల‌కు ఎక్కుతూ మా లో ఉన్న లుక‌లుక‌ల్ని బ‌య‌ట‌పెడుతున్న కీల‌క స‌భ్యుల‌పై సినీపెద్ద‌లు గుర్రుమీదున్నాన్న క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి.

ఈ గురువార‌మే క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అధ్య‌క్షుడు కృష్ణం రాజు ఈసీ మీటింగ్ కి పిలుపునివ్వ‌డంతో ఈ మీటింగ్ లో అన్ని కీల‌క అంశాలపైనా చ‌ర్చ సాగ‌నుంద‌ని భావిస్తున్నారు. `మా` సంఘంలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు స‌హా ఎల‌క్ష‌న్ పైనా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు సంఘంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు లేఖ రాయ‌డంతో నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని భావిస్తున్నారు.

అధ్య‌క్ష ప‌దవి కోసం ఆరుగురు స‌భ్యులు నువ్వా నేనా? అంటూ పోటీబ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిన‌దే. కానీ మ‌రోవైపు ముర‌ళీ మోహ‌న్ లాంటి సీనియ‌ర్ ఏక‌గ్రీవం చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. సినీపెద్ద‌ల‌తో తాను ముచ్చ‌టించాన‌ని ఆయ‌న అన్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో వీకే న‌రేష్ ఎత్తుగ‌డ ఏమిట‌న్న‌ది ఆయన మీడియా ముందుకొచ్చి చెబితే కానీ క్లారిటీ రాదు.

అలాగే వ‌ర్చువ‌ల్ ఈసీ స‌మావేశంలో క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ అధ్య‌క్షుడు కృష్ణం రాజుకు అందిన లేఖపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక‌వేళ ఎన్నిక‌లు జ‌రిగితే తేదీ ఎప్పుడో నిర్ణ‌యిస్తారు. లేదు ఏక‌గ్రీవం అనుకుంటే ఎవ‌రిని ఎంపిక చేస్తారు? అన్న‌దానిపైనా చర్చిస్తారనే భావిస్తున్నారు. ఈసారి ఒక మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిని చేయాల‌న్న ఆలోచ‌న సినీపెద్ద‌ల‌కు ఉంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. జీవిత‌.. జ‌య‌సుధ లాంటి వారు అధ్య‌క్ష ప‌ద‌విపై ఆస‌క్తిగానే ఉన్నారు. మ‌రి వారిలో ఎవ‌రికైనా అవ‌కాశం క‌ల్పిస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

మంచు విష్ణు జైలు కామెంట్ల‌పై ఈసీలో చ‌ర్చ‌

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ లో మంచు విష్ణు ఎపిసోడ్ కీల‌కంగా మారింది. మంచు విష్ణు బ్యాక్ టు బ్యాక్ త‌న మ‌న‌సులో ఉన్న‌ది ఓపెన‌వుతూ వ్యూహానికి ప‌దును పెట్టారు. ఈసారి అత‌డు సైలెంట్ గా ఉన్న న‌ట‌సింహం బ‌రిలో దిగాల‌ని ప్ర‌స్థావించాడు. ఒక‌వేళ సినీపెద్ద‌లు ఏక‌గ్రీవం చేయ‌ద‌లిస్తే ఆ న‌టుడికి తాను మ‌ద్ధ‌తునిస్తాన‌ని ప్ర‌క‌టించిన మంచు వార‌బ్బాయి తెలివిగా ఓ మెలిక వేశారు. ``కృష్ణ- కృష్ణంరాజు- చిరంజీవి`` వంటి సినీ ప‌రిశ్ర‌మ పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా ఎన్నుకుంటే త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని కూడా అన్నారు. త‌న‌ను సోద‌రుడిగా భావించే న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ను అధ్య‌క్షుడిని చేస్తే త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌ని కూడా అన్నారు. బాల‌య్య హ‌యాంలో సీనియ‌ర్లు కొంద‌రు అధ్య‌క్షులు కాలేద‌ని వారు ఎవ‌రు అయినా త‌న‌కు ఓకే అని అన్నారు. ఒక‌వేళ ఏక‌గ్రీవం చేయ‌క‌పోతే తానే పోటీకి దిగుతాన‌ని కూడా అన్నారు. మొత్తానికి తాన‌యినా అధ్య‌క్షుడు కావాలి.. త‌న‌వార‌యినా కావాలి! అన్న‌చందంగా విష్ణు మెలిక పెట్టారు.

అత‌డు ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ తెలివైన‌ వ్యూహాన్ని అనుస‌రించార‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ప‌ద‌వులు అంటే అంత‌గా ఆస‌క్తి చూపించ‌ని బాల‌య్యను కూడా `మా` ఎన్నిక‌ల్లో దిగాల‌ని విష్ణు పిలుపునివ్వ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపింది. మ‌రోవైపు జైలు కెళ్లాల్సిన వాళ్ల‌ను కాపాడామ‌ని.. వాళ్ల పేర్లు తొంద‌ర్లోనే వెల్ల‌డిస్తాన‌ని విష్ణు ప్ర‌క‌టించ‌డంతో ఆ పేర్లు ఏవో తెలుసుకోవాల‌న్న ఉత్కంఠ టాలీవుడ్ లో నెల‌కొంది. తాజా వ‌ర్చువ‌ల్ ఈసీ స‌మావేశంలో ఈ కామెంట్ల‌పైనా చ‌ర్చించ‌నున్నార‌ని తెలిసింది. మా అసోసియేష‌న్ బిల్డింగ్ నిర్మిస్తే మొత్తం తానే భ‌రిస్తాన‌ని మంచు విష్ణు అన్న వ్యాఖ్య‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా లేదా? స్థ‌ల సేక‌ర‌ణ‌కు తెరాస ప్ర‌భుత్వాన్ని ఒప్పించే బాధ్య‌త నాది అని ప్ర‌క‌టించిన ప్ర‌కాష్ రాజ్ ఆలోచ‌న‌ల్ని ప‌రిశీలిస్తారా? లేదా..! జ‌స్ట్ వెయిట్..